హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభను నడుపుతున్న తీరుపై, శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవర్తనపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పీపీటీ ద్వారా చెప్పినవన్నీ అబ్ధాలే అని చెప్పారు. నాడు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలిపి మరణశాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు.
హరీశ్‌రావు ఇంకా మాట్లాడుతూ.. ‘1956కు ముందు హైదరాబాద్ రాష్ట్రంగా తెలంగాణ ప్రాంతం ఉండేది. ఆనాడు ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌తో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను సొంత రాష్ట్రంగా ఉంచాలని ఫజల్ అలీ కమిషన్ స్పష్టంగా చెప్పినా తెలంగాణను ఏపీలో కలిపి మరణశాసనం రాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ తొలిదశ ఉద్యమ సమయంలో 1969లో సిటీ కాలేజీలో 369 మంది విద్యార్థులను కాల్చిచంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మలిదశ ఉద్యమ సమయంలో ఇచ్చిన తెలంగాణను వెనక్కి తీసుకుని వందలాది మంది యువకులను పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘నాడు ఫజల్ అలీ కమిషన్ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌తో కలుపవద్దని స్పష్టంగా చెప్పింది. ఒకవేళ కలిపితే 174 టీఎంసీల నీటి వినియోగం లక్ష్యంగా అప్పర్ కృష్ణ, తుంగభద్ర ఎడమ కాలువ, బీమా వంటి ప్రాజెక్టులను రద్దు చేయవద్దని, కొనసాగించాలని స్పష్టంచేసింది. అయినా నాడు ఆ ప్రాజెక్టులను రద్దుచేసి పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ సొంత రాష్ట్రంగా ఉంటే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. నల్లగొండ ఫ్లోరైడ్ బాధలు, పాలమూరు వలసల బాధలు తప్పేవి’ అని అన్నారు.