నీళ్లున్నా ఎత్తరు.. కరెంట్ ఇయ్యరు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చింది కాదని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యం వల్ల వచ్చిన కరువని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. కండ్ల ముందు నీళ్లు పారుతున్నా పొలాలకు పారివ్వలేని దద్దమ్మ పాలన రాష్ట్రంలో సాగుతున్నదని ధ్వజమెత్తారు. పంటలను కాపాడలేని పాలన కొనసాగుతున్నదని దుయ్యబట్టారు. నీటి వినియోగం, విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా విషయంలో మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలనుకున్నామని, కానీ, అసెంబ్లీ నుంచి తమను అకారణంగా సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నీళ్లు లిఫ్టుచేయడం చేతకాని సర్కార్.. తమను మాత్రం మార్షల్స్‌తో లిఫ్టుచేసి బయటకు పంపిందని విమర్శించారు. తెలంగాణభవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణా జలాల వినియోగం, పాలమూరు ప్రాజెక్టులు, విద్యుత్తు ఉత్పత్తి, రైతుల సమస్యలపై రాష్ట్ర సర్కార్‌ను హరీశ్ నిలదీశారు. పాలమూరు బిడ్డనని, పాలమూరు పులినంటూ చెప్పుకొనే రేవంత్‌రెడ్డి నీటి వినియోగంలో మాత్రం పిల్లిలా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఫలితంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో సాగు, తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎత్తిపోతల నిర్వహణలో విఫలం
రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు పంప్‌హౌస్‌లో రెండు మోటర్లు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. అవి కూడా నిరంతరం కాకుండా ఆన్ఆఫ్ పద్ధతిలో నడుస్తున్నాయని, సగటున రోజుకు 11 గంటలే పనిచేస్తున్నాయని తెలిపారు. 24 గంటలూ ఐదు మోటర్లు నడిపే సామర్థ్యం ఉన్నా అలా చేయడం లేదని, రోజుకు సుమారు 1,600 క్యూసెకుల నీరు రావాల్సిన చోట 700 క్యూసెకులే వస్తున్నాయని, 4,000 క్యూసెకులు ఎత్తగలిగే సామర్థ్యం ఉన్నా 700 క్యూసెకులకే పరిమితం చేశారని విమర్శించారు.
‘భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ మోటర్లదీ ఇదే పరిస్థితి. భీమా ప్రాజెక్టులో మూడు మోటర్లు ఉంటే ఒక మోటరే నడుపుతున్నరు. నెట్ట్టెంపాడులో నాలుగింటికి ఒకటి, కోయిల్‌సాగర్‌లో మూడింటికి ఒకటి మాత్రమే నడుపుతున్నరు’ అని మండిపడ్డారు. బేసిన్లో లేని వెలిగొండ ద్వారా ఏపీకి నీళ్లు తరలిపోతుంటే, బేసిన్లో హక్కుగా ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు అందించడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదని ప్రశ్నించారు.

Harishrao
వెలిగొండ, పోతిరెడ్డిపాడు ద్వారా
ఏపీ నీటిని తరలించుకుపోతుంటే రేవంత్‌రెడ్డి నోరు మెదుపుతలేడు. చంద్రబాబుకు గురుదక్షిణగా కృష్ణా నీటివాటాను దిగువకు వదిలేస్తు న్నడు. నీళ్లుండీ మోటర్లు నడుపడం చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నం. అసెంబ్లీలో ప్రజల తరఫున మాట్లాడితే మార్షల్స్ పెట్టి మమ్మల్ని ఎత్తేసినవ్. మమ్మల్ని కాదు.. ముందు మోటర్లు ఆన్‌చేసి కృష్ణా నీళ్లు ఎత్తు రేవంత్!:
-హరీశ్‌రావు
శ్రీశైలం నుంచి 35 టీఎంసీలు తీసుకెళ్లిన ఏపీ
అధికారిక లెకల ప్రకారం శ్రీశైలం నుంచి ఏపీ సర్కార్ 35 టీఎంసీల నీటిని తీసుకెళ్లిందని, అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కేవలం ఏడు టీఎంసీల నీటినే ఎత్తుకున్నదని హరీశ్ వివరించారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు ఉన్న తాతాలిక వాటాను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో 36.37 శాతం వరకు నీటిని వాడుకోగా, కాంగ్రెస్ సర్కార్ హయాంలోనే అతి తక్కువ నీటి వాడకం ఉన్నదని చెప్పారు.
2024- 25లో 28.49 శాతం, 2025-26లో 25.77 శాతం మాత్రమే కృష్ణా జలాలను వినియోగించుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ మూడేండ్ల్లలోనే కృష్ణా జలాల వినియోగం అత్యల్పస్థాయికి చేరిందని, ఇది ‘ఎవర్ లోయెస్ట్ యుటిలైజేషన్’ అని తెలిపారు. సుమారు ఆరు లక్షల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి రావడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను మీడియాకు చూపించారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తానని హెచ్చరిస్తే సాగర్ ఎడమ కాలువ నుంచి కొంచెం నీటిని విడుదల చేశారని గుర్తుచేశారు.

కేసీఆర్‌కు పేరొస్తుందనే పాలమూరు పడావు
శ్రీశైలం నుంచి తెలంగాణకు ఉన్న ప్రధాన అవకాశాల్లో కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టులు కీలకమైనవని హరీశ్ చెప్పారు. పాలమూరు ప్యాకేజీ-3 పనులను నెల రోజులపాటు కష్టపడితే పూర్తి చేసే పరిస్థితి ఉన్నా మూడేండ్లుగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ పనులు పూర్తయితే మరో ఐదు నుంచి ఆరు లక్షల ఎకరాలకు నీరందే అవకాశం ఉన్నదని చెప్పారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టుగా ఆయనకు కీర్తి వస్తుందనే కారణంతోనే పనులను పూర్తి చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు నీరు, విద్యుత్తు కోసం ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రైతులు అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నారని, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోనూ రైతులు ధర్నాలు చేస్తున్నారని వివరించారు. ‘కొండారెడ్డిపల్లిలో ధర్నా చేస్తు న్న రైతులు బీఆర్ఎస్ కార్యకర్తలా? పొంగులేటి నియోజకవర్గంలో ధర్నా చేస్తున్న రైతులు బీఆర్ఎస్ కార్యకర్తలా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా సబ్స్టేషన్ల ఎదుట రైతులు విద్యుత్తు కోసం ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలను మీడియాకు చూపించారు. సాగు నీరు, విద్యుత్తు కోసం రైతులు ఓ వైపు ధర్నాలు చేస్తే.. మరోవైపు ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని, రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిన చందంగా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడని ఆక్షేపించారు.
విద్యుత్తు ఉత్పత్తి ఎందుకు బంద్ పెట్టిండ్రు?
నీటి ప్రాజెక్టుల మాదిరిగానే విద్యుత్తు రం గంలోనూ అందుబాటులో ఉన్న సామర్థ్యాన్ని ప్రభుత్వం వినియోగించుకోవడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్, భద్రాద్రి కొత్తగూడెం సోలార్ తదితర విద్యుత్తు ప్రాజెక్టులు ఉన్నా వాటిని పూర్తిస్థాయిలో నడుపడం లేదని చెప్పారు. కేటీపీఎస్‌లో 800 మెగావాట్ల ప్లాంట్‌ను మూసివేశారని, 540 మెగావాట్ల బీటీపీఎస్ యూనిట్లు 3, 4 కూడా మూసివేశారని తెలిపారు.
యాదాద్రి పవర్ ప్లాంట్‌లో 4,000 మెగావాట్ల సామర్థ్యం ఉంటే ప్రస్తుతం సుమారు 2,000 మెగావాట్ల మేరకే ఉత్పత్తి జరుగుతున్నదని చెప్పారు. ఓవైపు బొగ్గు సర్ప్లస్ ఉన్నదని చెప్తూనే, మరోవైపు యాదాద్రి ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేయడం లేదని విమర్శించారు. ‘నీళ్లు ఉండీ ఎత్తరు.. సామర్థ్యం ఉండీ కరెంట్ ఉత్పత్తి చేయరు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మూడేండ్ల్లలో హైటెన్షన్ సబ్‌స్టేషన్ ఒకటీ కట్టలేదు. రైతులకు ఇచ్చే పవర్ లేదు. ప్రతిపక్షాల పీక నొకడానికి మాత్రం పవర్ ఉన్నదా? కోమటిరెడ్డి నాడు కరెంట్ లేదని విమర్శలు చేసిండు. ఇప్పుడు ఏడు గంటలు కూడా కరెంట్ వస్తలేదు. ఎందుకు లాగ్ బుక్స్ చూడటం లేదు? రేవంత్‌రెడ్డిని చూస్తే లాగులు తడుస్తున్నయా?’ అని నిలదీశారు.
వెలిగొండ, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటిని తరలించుకుపోతుంటే రేవంత్‌రెడ్డి నోరు మెదుపుతలేడు. చంద్రబాబుకు గురుదక్షిణగా కృష్ణానీటి వాటాను వదిలేస్తున్నడు. శ్రీశైలం నుంచి ఏపీ 35 టీఎంసీలు తరలిస్తే, తెలంగాణ 7 టీఎంసీలే ఎత్తిపోసిందని అధికారిక లెకలు చెప్తున్నయ్. తెలంగాణ రైతాంగానికి నీళ్లు నిల్.. ఏపీ రైతాంగానికి నీళ్లు ఫుల్ ఉన్నట్టుగా పరిస్థితి మారింది.
-హరీశ్‌రావు
రైతులకు తిట్లు కాదు.. పంపులకు పవర్ కావాలి
ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శల కంటే రైతుల సమస్యలకు పరిషారం చూపడమే ముఖ్యమని హరీశ్ సూచించారు. ‘రైతులకు కావాల్సింది బూతులు కాదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కాదు.. పంపులకు పవర్, పొలాలకు సాగునీరు’ అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి మౌనం తెలంగాణ సాగు, తాగునీటి ప్రయోజనాలకు శాపంగా మారుతున్నదని విమర్శించారు. ఏపీకి నీటి తరలింపును వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కోరాలని సూచించారు. పాలమూరు పరిధిలోని అన్ని ప్రాజెక్టుల మోటర్లను పూర్తిస్థాయిలో ఆన్‌చేసి పొలాలకు నీరివ్వాలని, సాగర్ కాలువకు నీరు విడుదల చేసి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని పంట పొలాలకు మళ్లించాలని డిమాండ్‌చేశారు.

1984లో కల్వకుర్తి ప్రారంభమైతే 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేవరకు అంటే దాదాపు 30 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కేవలం 13వేల ఎకరాలకు నీళ్లిస్తే మేము 3,07,000 ఎకరాలకు సాగేనీరందించినం. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ భీమా ప్రాజెక్టుల కోసం రూ.4 వేల కోట్లు ఖర్చుపెట్టి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినం.
-హరీశ్‌రావు
కృష్ణాలో కోటా నీళ్లూ వాడలే
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కృష్ణా జలాలను తాత్కాలిక కోటా మేరకే కాదు, గత పన్నెండేండ్లలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత కనిష్ఠ స్థాయిలో తెలంగాణ వినియోగించుకున్నదని హరీశ్‌రావు వివరించారు. 2025-26 నీటి సంవత్సరంలో మొత్తంగా 25 శాతం (271 టీఎంసీలు) నీటిని మాత్రమే వాడుకున్న దుస్థితి ఉన్నదని తెలిపారు. ఇక ఏపీ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కృష్ణా జలాలను మళ్లించుకుపోయిందని చెప్పారు.
మొత్తంగా 777 టీఎంసీలను (74.90 శాతం) తరలించుకుపోయిందని వివరించారు. కోటా కు మించి 43 టీఎంసీలు వాడుకున్నదని, శ్రీశై లం నుంచి మునుపెన్నడూ లేనివిధంగా 253 టీఎంసీలను మళ్లించుకుపోయి రికార్డును బ్రేక్ చేసిందని తెలిపారు. ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితులున్న నేపథ్యంలోనూ ఏపీ నిరుటి తరహాలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి జలాల ను తరలించుకుపోతున్నదని, ఇప్పటికే 2026-27 నీటి సంవత్సరంలో వాటాలు ఖ రారు కాకముందే 73 టీఎంసీలను మళ్లించగా, తెలంగాణ కేవలం 39 టీఎంసీలనే వినియోగించిందని వివరించారు. ఈ వైఫల్యానికి ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కారేనని స్పష్టంచేశారు.
ఎల్ నినో ప్రమాదం ఉన్నదని ప్రపంచ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్న తరుణంలో వచ్చిన నీళ్లు వచ్చినట్టుగా ఎత్తిపొయ్యాలి. కానీ, వాటిని ఎత్తకుండా సీఎం రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్నడు. ఎత్తగలిగే అవకాశం ఉండి కూడా మోటర్లు బంద్‌పెట్టి కూర్చున్నడు. చాలెంజ్ చేస్తున్న.. వెళ్లి చూద్దాం.. రేవంత్ వస్తడా? ఉత్తమ్ వస్తడా రమ్మను. తెలంగాణ తెచ్చిన పార్టీగా మాకు బాధ్యత ఉన్నది. కానీ, రేవంత్‌రెడ్డికి ఆయన గురువు బాగుంటే చాలు.
-హరీశ్‌రావు
నిజామాబాద్‌లో దారుణ పరిస్థితులు: వేముల

నిజామాబాద్ జిల్లాలో వర్షాల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 46 టీఎంసీల నీరున్నా రైతులకు అందివ్వడం లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. జిల్లాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అసెంబ్లీలో రైతుల సమస్యలపై మాట్లాడాలని రైతులు ఫోన్ చేస్తున్నారని చెప్పారు. రైతుల సమస్యలను సభలో ప్రస్తావించేందుకు ప్రయత్నించిన తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని విమర్శించారు. గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి చెరువులు నింపాలని డిమాండ్ చేస్తే.. ప్రభుత్వం తూతూమంత్రంగా లిఫ్టులను ఆన్ చేసిందని చెప్పారు. గుత్ప లిఫ్టులో నాలుగు మోటర్లకు ఒక మోటర్ మాత్రమే నడుస్తున్నదని, వెంటనే పూర్తిస్థాయిలో నడిపి అన్ని చెరువులను నింపాలని కోరారు.
అలీసాగర్ లిఫ్ట్ సామర్థ్యం 720 క్యూసెకులు కాగా, నాలుగు మోటర్లకు బదులు సగం సామర్థ్యంతోనే నడుపుతున్నారని, అదీ ఆన్-ఆఫ్ పద్ధతిలోనే సాగుతున్నదని ఆరోపించారు. గుత్ప, అలీసాగర్ లిఫ్టులను కలిపి రోజుకు 1,260 క్యూసెకుల చొప్పున నెలపాటు నడిపినా సుమారు మూడు టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోవచ్చని, అలా చేస్తే ఆయా ప్రాంతాల్లోని చెరువులను నింపవచ్చని తెలిపారు. బాలొండ నియోజకవర్గంలోని లక్ష్మీ కాలువకు పూర్తిస్థాయిలో నీరు అందించాలని కోరారు. హన్మంతరెడ్డి లిఫ్ట్‌తోపాటు ఇతర అన్ని ఎత్తిపోతల పథకాలను కూడా వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 4.45 వరకు మాత్రమే కరెంటు ఇస్తున్నారని తనకు ఓ రైతు తెలిపాడని చెప్పారు. సమావేశంలో శాసన మండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, జైపాల్‌యాదవ్, కాలేరు వెంకటేశ్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాణిక్‌రావు పాల్గొన్నారు.
