హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నది ఎంత నిజమో.. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన ఆద్యంతం భూ దందాల చుట్టూనే తిరుగుతుందనేది కూడా అంతే నిజం. అవును.. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అటు ప్రభుత్వం.. ఇటు సర్కార్ పెద్దల అడుగులను నిశితంగా పరిశీలిస్తే అది నిజమనేది స్పష్టమవుతుంది. అధికారిక భూ సేకరణలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, బలవంతపు సెటిల్మెంట్లు.. ఇలా తెల్లారి లేచింది మొదలు భూముల చుట్టూనే భ్రమిస్తున్నారనేది బహిరంగ రహస్యం. సామాన్యుడి ఇండ్ల కూల్చివేతలతో మొదలైన ఈ ‘భూ భ్రమణం’.. వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కొల్లగొట్టడంతో తారస్థాయికి చేరింది.
సామాన్య రైతులపై ‘భూ సేకరణ’ పిడుగుతో ప్రారంభమైన అరాచకం ఇప్పుడు ‘22ఏ’ నిషేధిత జాబితాతో భూకంపాన్ని సృష్టిస్తున్నారు. ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం ఏర్పడిన వెయ్యి రోజుల్లో ప్రభుత్వ పెద్దలు తమ పూర్తి సమయాన్ని తమ స్వలాభం కోసం హైదరాబాద్ మహా నగరంలోని భూముల మీదనే దృష్టిసారించారు. అంతేతప్ప ప్రజా ప్రయోజనాలకు భూములను వినియోగించిన దాఖలాల్లేవు. హైడ్రా కూల్చివేతలు, రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను చెరబట్టడం, పారిశ్రామిక అవసరాల పేరిట రైతుల నుంచి బలవంతంగా భూములు గుంజుకోవడం, నగరం చుట్టూ ఉన్న వేలాది ఎకరాల అసైన్డ్ భూములను అడ్డికి పావుశేరుకు పెద్దలు, బినామీలు తీసుకోవడం, చివరికి 22ఏ పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టడంతోపాటు వివాదాస్పద భూములను కబళించేందుకు ప్రయత్నించడం వరకు.. అన్ని కుట్రలను ‘నమస్తే తెలంగాణ’ అనేక కథనాల రూపంలో ప్రజల ముందు ఉంచింది. ఆధారాలతో వివరించింది.
ఇంకో నాలుగైదు దశాబ్దాల తర్వాత కూడా ‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వం’ అని చెప్పగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు ‘హైడ్రా’. హైదరాబాద్ మహానగరంలో ఆ స్థాయిలో విధ్వంసం సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వ్యవస్థ ఇది. ఈ సంస్థ ట్యాగ్‌లైన్.. ‘చెరువులను చెరబట్టిన వారిని చెరసాలకు పంపుతాం’!. కానీ జరుగుతున్నది పూర్తి విరుద్ధం. నగరవాసులు తాగునీటి కోసం వినియోగించే జంట జలాశయాలను కలుషితం చేసేలా ఫౌమ్హౌస్లు, ఆకాశహర్మ్యాలు నిర్మించుకున్న మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతల సౌధాలను మాట వరసకైనా ముట్టదు. కానీ.. నగరంలోని పేదల కలల సౌధాలపై మాత్రం దండయాత్రకు దిగింది. పెద్దోళ్లకు ఒక న్యాయం, పేదోళ్లకు మరో న్యాయం అన్నట్టుగా హైడ్రా వ్యవహరించింది.
ఈ సంస్థను 2024 జూలై 19న ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు సుమారు 815 చోట్ల కూల్చివేతల పర్వాన్ని కొనసాగించింది. మొదట్లో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లు అంటూ మొదలుపెట్టిన విధ్వంసం ఆ తర్వాత ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లు అంటూ విస్తరించింది. పేదలైతే కూల్చివేతలు, పెద్దలైతే నోటీసులతో సరిపెట్టి తన స్వామిభక్తిని ప్రదర్శించింది. ఈ కూల్చివేతల్లో ఇప్పటివరకు నష్టపోయింది సామాన్యులే. మొదటి మూడు నెలల్లో తప్పిదాలు జరిగాయంటూ సాక్షాత్తు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంగీకరిస్తున్నారు. బడాబాబుల ఆక్రమణల పర్వానికి ఒక్కోచోట ఒక్కో భాష్యం చెప్తూ, బాగుచేసిన నాలుగైదు చెరువులను చూపుతూ, మొత్తం హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరించామని ప్రకటనలు ఇస్తున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లంపేటలోని కత్వా చెరువు వద్ద 17 విల్లాలను హైడ్రా కూల్చేసిన సంగతి తెలిసిందే. తమకు అనుమతులన్నీ ఉన్నాయంటూ ఇంటి యజమానులు కాళ్లావేళ్లా పడ్డా హైడ్రా బుల్డోజర్ కనికరించలేదు. వారి ఇండ్లను సమూలంగా నేలమట్టం చేసింది. అన్ని అనుమతులతో, బ్యాంకు లోన్లు తీసుకొని, ఇండ్లు కట్టుకొని, గృహప్రవేశాలు చేసిన వారం రోజులకే తమ కలల సౌధాలను కండ్లముందే కూల్చివేస్తుంటే వారి బాధ వర్ణనాతీతం. లేని ఇండ్లకు ఇప్పటికీ లోన్లు కడుతూ, కరెంటు మీటర్లు లేకున్నా బిల్లులు కడుతూ, నివాసం ఉండకపోయినా ఆస్తి పన్నులు చెల్లిస్తూ, నీళ్లు రాకున్నా నల్లా బిల్లులు చెల్లిస్తున్న సామాన్యుల వేదనకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుంది?
గుట్టలబేగంపేటలోని సున్నంచెరువు బాధితుల బాధ ఇప్పటికీ రావణకాష్టంలా రగులుతూనే ఉన్నది. సంగారెడ్డి పరిధిలోని అమీన్పూర్, కిష్టారెడ్డిపేటల్లో ఏండ్ల నుంచి నివాసముంటున్న వారిని కట్టుబట్టలతో వీధినపడేసి కూల్చివేతలకు పాల్పడిన హైడ్రా.. రాయదుర్గంలో ఎనిమిది దశాబ్దాలుగా నివాసముంటున్నవారిని బయటకు పంపి కూల్చివేతలకు పాల్పడింది. లోతుకుంట, ఈదులకుంట వంటి వాటిలో తనకు సంబంధం లేకుండానే నంబర్ టూ కోసం దూకుడుగా పోయి బోల్తాపడ్డ వ్యవహారం ఇప్పటికీ కోర్టులో రగులుతూనే ఉన్నది. కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ‘మేము చేసేదే చేస్తం.. మాకెవరూ చెప్పేది లేదు’ అన్నట్టుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరుకు కోర్టు ఉల్లంఘన కేసులే నిదర్శనం. ఇప్పటివరకు హైడ్రాపై ఐదువందలకుపైగా ప్రత్యేక కేసులు, కమిషనర్‌పై 60కిపైగా కోర్టు ధిక్కరణ కేసులున్నాయి.
హైడ్రా సాయంతో నగరంలోని సామాన్యుల ఇండ్లను పేకమేడల్లా కూల్చిన ప్రభుత్వం.. ఇంకోవైపు నగరం చుట్టూ సన్న, చిన్నకారు రైతుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను గుంజుకోవడమే యజ్ఞంలా పెట్టుకున్నది. అనేక ప్రాంతాల్లో దశాబ్దాలుగా నిరుపేద రైతు కుటుంబాలు తమ ఆస్తిగా నమ్ముకొని జీవిస్తున్న వివిధ రకాల అసైన్డ్ భూములే లక్ష్యంగా భూసేకరణ భూతం పట్టి పీడిస్తున్నది. లగచర్ల, గ్రీన్‌ఫీల్డ్ ఫార్మా, ఇండస్ట్రియల్ పార్కులు, పారిశ్రామికవాడలు, రీజినల్ రింగురోడ్డు, రేడియల్ రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, బుల్లెట్ ట్రైన్లు… ఇలా పేరు ఏదైనా లక్ష్యం మాత్రం భూ సేకరణే. పేద రైతు కుటుంబాలకు చెందిన అసైన్డ్ భూములతోపాటు ఒకటి రెండు ఎకరాల పట్టా భూములున్న సన్న, చిన్నకారు రైతు భూముల్లోనే ప్రాజెక్టులన్నింటికీ రూపకల్పన చేస్తున్నది. ప్రభుత్వం వివిధ అవసరాల కోసమంటూ రూపకల్పన చేస్తున్న ఏ ప్రాజెక్టుల్లోనూ పెద్దోళ్లకు చెందిన వందల ఎకరాలు మాత్రం పోవడం లేదు.

సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల, దుద్యాలలో గిరిజన భూములను లాక్కునేందుకు ప్రభుత్వం సృష్టించిన అరాచకం దేశస్థాయిలోనే అందరినీ కలవరపాటుకు గురిచేసింది. రంగారెడ్డి జిలాల్లో ఫ్యూచర్‌సిటీ, తిమ్మాపూర్ పారిశ్రామికవాడ, గ్రీన్‌ఫీల్డ్ హైవే, మొయినాబాద్ పరిధిలోని ఎన్కెపల్లిలో గోశాల, మంచిర్యాలలో పారిశ్రామికవాడ, భూపాలపల్లి జిల్లా భీమారం మండలం సూరమ్మ చెరువు కుడి కాల్వ, పలిమెలలో సిమెంటు కంపెనీ, సిద్దిపేట జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కు, హుస్నాబాద్, అక్కన్నపేటల్లో వివిధ ప్రాజెక్టుల కోసం భూసేకరణతో పాటు రీజినల్ రింగు రోడ్డు కోసం భారీ ఎత్తున పట్టా భూముల్ని బలవంతంగా సేకరిస్తున్నది. ఒక్క యాచారం మండలంలోనే ఇప్పటివరకు పదివేల ఎకరాల వరకు పట్టా, అసైన్డ్ భూములను సేకరించి, నామమాత్రపు ధరలు చెల్లించేందుకు సిద్ధపడింది. ఔటర్ రింగు రోడ్డు, ట్రిపుల్ఆర్ను కలిపేందుకు ‘ముఖ్య’నేత బంధువుల భూములకు సమీపంలోంచి వెళ్లేలా 330 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం సేకరించిన 554 ఎకరాల్లోనూ అత్యధిక భాగం అసైన్డ్ భూములే ఉన్నాయి. మిగిలిన దానిలో అన్నీ సన్న, చిన్నకారు రైతులకు చెందిన చిన్న కమతాలే ఉన్నాయి.
రెండున్నరేండ్లలో నగరం చుట్టూ ఉన్న వేల కోట్ల విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూముల కబ్జా వెనుక ప్రధానంగా సర్కార్ పెద్దల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. రెవెన్యూ అధికారులు ఆ కబ్జాలపై ప్రేక్షకపాత్ర పోషిస్తుండటం దీనికి బలాన్ని చేకూరుస్తున్నది. ఒక మంత్రి తనయుడు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములపైకి దౌర్జన్యంగా వెళ్లడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇదే మంత్రి క్రషర్ ఏర్పాటు పేరిట వందల ఎకరాల అసైన్డ్ భూములపై కన్నేయడం అసెంబ్లీని సైతం అట్టుడికించింది. చివరికి హైడ్రాతో క్రషర్‌ను నేలమట్టం చేసేదాకా పరిస్థితి వెళ్లిందంటే రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ భూముల రక్షణ గాలిలో దీపంలా తయారైందని అర్థమవుతుంది. ఈ క్రమంలో ప్రధానంగా వెలుగులోకి వచ్చిన భూ దందాల విలువనే లక్ష కోట్ల వరకు ఉందంటే వెలుగులోకి రాని అనేక కబ్జాల పర్వాలు, రికార్డుల తారుమారు ఏస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఓవైపు ప్రభుత్వం బక్క రైతు దగ్గర అసైన్డ్ భూములను గుంజుకుంటుండగా.. ఇంకోవైపు బడాబాబులు, బడా కంపెనీవారు అసైన్డ్ భూములను చెర పట్టేందుకు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. రైతులతో అనధికారిక ఒప్పందాలు చేసుకొని రికార్డుల తారుమారుకు అనేక అస్ర్తాలు సంధిస్తున్నారు. 1958 కంటే ముందు అసైన్ చేసినందున వాటిని అమ్ముకొనే హక్కు ఉన్నదని ఒకచోట… ఒకట్రెండు సంవత్సరాలు పట్టా భూములుగా వచ్చాయనే సాకు మరోచోట.. ఇంకోచోట పూర్తి రికార్డులనే మాయం చేసి రాత్రికి రాత్రి వాటిని పట్టా భూములుగా చూపుతున్నారు.
ఇలా ఎకరాకు రూ.10-20 కోట్ల ధర పలికే చోట రూ.1.50-2.00 కోట్లు ఖర్చు చేసి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక సందర్భంలో రాష్ట్రంలో 80వేల అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన వారికి న్యాయం చేస్తాం.. అని ప్రకటించడంతో ఈ దందా మరింత జోరందుకున్నది. పధానంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఈ అసైన్డ్ భూములపై అనధికారిక ఒప్పందాలు ఇబ్బడిముబ్బడిగా జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో మాత్రం ఊహించనిరీతిలో వందల కోట్ల రూపాయల పెట్టుబడులను కుమ్మరిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి సర్వేనంబర్ 36, 37లోని 182 ఎకరాలపై నెలకొన్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఇందులో ఏకంగా జిల్లా కలెక్టర్ ఎన్వోసీలు జారీ చేసి.. ఆపై వాటి అమలును నిలిపివేశారంటే తెరవెనుక ఎంత తతంగం జరిగిందో అందరికీ అర్థమైంది. చివరికి హైకోర్టు జోక్యం చేసుకొని స్టే ఇస్తే తప్ప ప్రైవేట్ వ్యక్తుల కబ్జాల పర్వానికి అడ్డుకట్ట పడలేదు. ఇదే జిల్లాలోని బాలాపూర్ మండలం నాదర్గుల్ సర్వేనంబర్ 613లో 374 ఎకరాల వ్యవహారం సంచలనం సృష్టించింది. ఇప్పటికీ దీనిపై ప్రభుత్వంగానీ అధికారులుగానీ స్పష్టత ఇవ్వకపోగా… రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదైన దానిలో ప్రైవేట్ వ్యక్తులు ఎలా పాగా వేశారనే దానిపై ఎవరూ నోరు మెదపడం లేదు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామంలోని 275.12 ఎకరాల ప్రభుత్వ భూమిపైనా ఇదే అయోమయం.
సర్వేనంబర్ 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల భూమిని గతంలో జాయింట్ కలెక్టర్ ప్రభుత్వానికి చెందినదిగా నిర్ధారిస్తే.. అందుకు భిన్నంగా ఇప్పుడు ఓ ఆర్డీవో ఉద్యోగ విరమణకు మూడు రోజుల ముందు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం విస్మయానికి గురిచేసింది. ఇందులోనూ హైకోర్టు జోక్యం చేసుకొని భూ లావాదేవీలపై స్టే ఉత్తర్వులు ఇచ్చింది.

ఇక్కడ మరో విచిత్రమేందంటే.. అసలు ఆర్డీవో ఓఆర్సీ ఇచ్చిన వారసులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మరికొందరు హైకోర్టును ఆశ్రయించడం అధికారుల డొల్లతనం, తెరవెనుక సర్కార్ పెద్దల ప్రమేయం ఎంత ఏకపక్షంగా ఉన్నదో తెలుస్తున్నది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ పరిధిలోని సర్వేనంబర్ 27లో సుమారు 64.05 ఎకరాల ప్రభుత్వ భూమిలోని 27.18 ఎకరాల పరిస్థితి రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి, తెరవెనుక సర్కార్ పెద్దల భూ దందాలకు మరో నిలువెత్తు నిదర్శనం.
1954-55 ఖాస్రా పహాణీతోపాటు 1959-60 సంవత్సరంలోని రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి పొరంబోకు అని పేర్కొని ఉన్న ఈ భూముల్లో ఇప్పుడు ఆకాశహర్మ్యాలు వెలుస్తున్నా… అటు హైడ్రా, ఇటు రెవెన్యూ అధికారులు కనీసం నోరెత్తి ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు కూడా ముందుకు రావడం లేదు. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇవి ప్రభుత్వ భూములేనని హైకోర్టును ఆశ్రయించి, ఆపై నోరు మెదపకపోవడం వెనుక ఏం జరిగిందనేది బహిరంగ రహస్యమే. ఇక.. రెండు గ్రామాల సరిహద్దులో ఉన్న భూ వివాదాలు ఇటీవల కాలంలో ఎంత దుమారాన్ని రేపాయో.. హైడ్రా పనితీరుపై ఎలాంటి సందేహాలను రేకెత్తించాయో ఈదులకుంట, లోతుకుంట వ్యవహారాలే నిదర్శనం. ఇటీవల బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు వెలుగులోకి తీసుకువచ్చిన సాస్‌ను ఆనుకొని ఉన్న మూడెకరాల ప్రభుత్వ భూమి బాగోతంగానీ, బుద్వేల్లోని 30 ఎకరాల భూ వ్యవహారంగానీ ఇలా అనేకం సర్కార్ పెద్దల భూ దందాలపై వస్తున్న ఆరోపణల జాబితాను పెంచుతూనే ఉన్నాయి.
సామాన్య ప్రజలపై కాంగ్రెస్ సర్కార్ విప్పిన మరో పడగ 22-ఏ. దాని కోరల్లో చిక్కుకొని హైదరాబాద్ మహానగరమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సామాన్యులు విలవిలలాడుతున్నారు. జీవితకాలం రెక్కల కష్టాన్ని ఒక్క రాత్రిలో ప్రశ్నార్థకం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ వంటి సంస్థల అనుమతులు పొంది.. నిత్యం పన్నులు కట్టిన ఆస్తులకే రక్షణ లేకుండా చేసిన కాంగ్రెస్ చర్యలతో గ్రేటర్ వ్యాప్తంగా ఇండ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల భవితవ్యం గందరగోళంగా మారింది. దాదాపు క్యూర్ పరిధిలో లక్షల సంఖ్యలో ఆస్తులు నిషేధిత రాక్షస కోరల్లో చిక్కుకున్నాయి.
ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములను కాపాడాలనే నిబంధన 22ఏ లక్ష్యం కాగా, ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చేస్తున్నది మాత్రం ఇందుకు విరుద్ధం. అధికారులు ఎలాంటి ముందస్తు పరిశీలన గానీ, క్షేత్రస్థాయి విచారణగానీ చేయకుండా అడ్డగోలుగా ప్రైవేట్ భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. ఒక పెద్ద లే అవుట్లో లేదా ఒక సర్వే నెంబర్లో ఉండే ఒక చిన్న ప్రాంతానికి ఉన్న సమస్యను, దశాబ్ధాల కాలం నాటి రికార్డుల్లో అస్పష్టంగా ఉన్నా… ఆ సర్వే నంబర్ పరిధిలోని వందలాది ఎకరాలు, వేలాది ప్లాట్లను, ఇళ్లను కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రతి గ్రామంలోనూ ప్రైవేట్ ఆస్తులు ఈ నిషేధిత విష వలయంలో చిక్కుకున్నాయి.

చివరికి ప్రభుత్వ గుర్తింపు పొందిన హెచ్ఎండీఏ లే అవుట్లలోని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు కాకపోవడం సర్కార్ రాక్షసానందానికి ఉదాహరణలు. మేడ్చల్ జిల్లా పరిధిలో 30 ఏండ్ల కిందటి కాలనీల్లో చట్టబద్ధమైన అనుమతులతో కట్టుకున్న ఇండ్లకు యూఎల్సీ సాకుతో రిజిస్ట్రేషన్లు నిలిపివేసి జనాలను దిక్కుతోచని విధంగా చేసింది. ఆస్తిపై జనాలకు హక్కే లేదన్నట్టుగా నిషేధిత జాబితాలో చేర్చి.. క్రయవిక్రయాలు, బ్యాంక్ రుణాలకు అవకాశం లేకుండా చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ నుంచి సంగారెడ్డి వరకు వేలాది కాలనీలు, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీలు, హెచ్ఎండీఏ వేలం వేసిన వెంచర్లు కూడా నిషేధిత జాబితాలో చేరడంతో జనాలు గగ్గోలుపెడుతున్నారు.
నగరంలోని అత్యంత కీలకమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వంటి వరల్డ్ క్లాస్ కమర్షియల్ హబ్‌లోని భూములనూ ప్రశ్నార్థకం చేసింది. ఇక్కడ ఉండే కమర్షియల్, రెసిడెన్షియల్ సముదాయాలతోపాటు, ప్రాముఖ్యత కలిగిన గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలను కూడా నిషేధించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన నివాస ప్రాంతాల్లో కొనుగోలుదారులు ఆస్తులు అమ్మాలన్నా.. తాకట్టు పెట్టాలనుకున్నా వీల్లేకుండా రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేసింది. గచ్చిబౌలి నుంచి మొదలుకొని ఉప్పల్ వరకు, అమీర్‌పేట్, శ్రీనగర్ కాలనీ, ఎస్ఆర్ నగర్, హిమాయత్ నగర్, పటాన్చెరు, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లోని పలు రెవెన్యూ గ్రామాల్లో సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చి వేలాది నివాసాలపై భూ యజమానులకు హక్కులే లేకుండా చేసింది. పదుల ఎకరాల్లో ఉన్న నివాస సముదాయాలు కాంగ్రెస్ కోరల్లో చిక్కుకోవడంతో లబోదిబోమంటున్నారు.