హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): క్యాబినెట్‌లోని మరో ముగ్గురు మంత్రులు ‘ప్రత్యేక నిఘా’ నీడలోకి వెళ్లారా? వారిపై నిఘావర్గాలు డేగకన్ను వేశాయా? టెండర్లు, ప్రమోషన్లు, బదిలీలు, నియామకాలు.. ఇలా వారి శాఖల్లో జరుగుతున్న అన్నీ కార్యకలాపాల సమాచారాన్ని గుట్టుగా సేకరిస్తున్నయా? సమగ్ర వివరాలతో వెంటనే సీఎంవోకు ప్రత్యేక నివేదికలు సమర్పిస్తున్నయా? ప్రస్తుతం సచివాలయంలో పెద్దఎత్తున జరుగుతున్న చర్చ ఇది. దీనికి అధికార వర్గాలు ‘అవును’ అనే సమాధానం ఇస్తున్నాయి. ఇందులో ఏకంగా ఒక మంత్రి సీటుకు ఎసరు పెట్టారని ప్రచారం జరుగుతున్నది. మరి ఆ ముగ్గురిపై ఇంతలా నిఘా పెట్టడానికి కారణమేమిటని ఆరా తీయగా, తమ శాఖల్లో అంశాలపై వారు వివరణ కోరడమేనని తెలిసింది. ముఖ్యంగా గురుకుల టెండర్ల వ్యవహారంపై ప్రశ్నించడంతో ఇద్దరు ‘సంక్షేమ’ మంత్రులపై ‘ముఖ్యనేత’ గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
గురుకుల టెండర్లతో మొదలు
రాష్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలతోపాటు సంక్షేమ హాస్టళ్లు, క స్తూర్బా విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ, మో డల్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అక్కడి విద్యార్థులకు ఏటా ప్రభుత్వం పుస్తకాలు, యూనిఫామ్, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సా క్సులు మొత్తంగా 24రకాల వస్తువులు అందిస్తున్నది. గతంలో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ద్వారా టెండర్లు పిలిచి, ఆయా విద్యాసంస్థలు సొంతంగా వాటిని కొనుగోలు చేసేవి. కాంగ్రె స్ ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ నేతృత్వంలో అన్నీ గు రుకుల సొసైటీల కార్యదర్శులతో ప్రత్యేకంగా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్(పీఎంయూ) ను ఏర్పాటు చేసింది.
విద్యార్థులకు సంబంధించిన వస్తువులు, నిత్యావసర వస్తువుల సరఫరా, సేకరణ, ధరల ఖరారు, టెండర్ ప్రక్రియను వారికి అప్పగించింది. ఇప్పటివరకు నిర్వహించిన రూ.1,200 కోట్ల వర్క్ ఆర్డర్లో రూ.1,100 కోట్ల వరకు గుజరాత్ కంపెనీలకే కట్టబెట్టింది. ఇటీవల సుమారు రూ.765 కోట్ల కిరాణా సామగ్రి టెండర్లను ఖరారు చేసింది. అయితే, ఏ విషయాన్ని కూడా సంక్షేమ శాఖల మంత్రులకుగానీ, ఇతర ఉన్నతాధికారులకుగానీ సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణ లున్నాయి. పీఎంయూకు ఎస్సీ గురుకుల సొ సైటీ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నా.. టెండర్ల వ్యవహారం ముఖ్యనేత సన్నిహితుల కనుసన్నల్లో, సీఎంవోలోని ఓ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో నడిచిందని ప్రచారం జరుగుతున్నది. దీంతో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ రగిలిపోతున్నట్టు స మాచారం.
ఈ క్రమంలో టెండర్ల సమాచారం ఇవ్వాలని వారిద్దరూ పదే పదే సీఎంవోలో ఒత్తిడి తెచ్చినట్టు సచివాలయ వర్గాలు తెలిపా యి. అయినా, ఇవ్వకపోగా టెండర్ల విషయం లో ఒత్తిడి చేయవద్దంటూ సీఎంవో వర్గాలు మంత్రులకు హుకుం జారీచేసినట్టు ప్రచారం జరుగుతున్నది. కొన్నిరోజుల క్రితం మంత్రు లు, సంక్షేమ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారట. అక్కడ కూడా ‘టెండర్ల విషయం పూర్తిగా మేమే చూసుకుం టాం’ అంటూ సదరు అధికారి మంత్రుల ముఖంమీదే చెప్పినట్టు తెలిసింది.
దీంతో మంత్రులు ఆగ్రహంతో ఊగిపోయి అంతా మీరే చూసుకుంటే ఇక మేమేందుకని అధికారులకు చీవాట్లు పెట్టారని, సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారని సచివాలయ వర్గా లు తెలిపాయి. అప్పటి నుంచి ఇద్దరు మంత్రులపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల్లో ప్రతి పనికీ సంబంధించిన సమాచారాన్ని నిఘావర్గాలు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నాయని, వెంటనే సీఎంవోకు నివేదికలు అందిస్తున్నాయని పేర్కొన్నాయి. ఈ నివేదికలన్నింటి ఆధారంగా సంక్షేమ మంత్రుల్లో ఒకరి సీటుకు ఎసరు పెట్టేందుకు సీఎంవో వర్గాలు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది.
అడ్లూరి శాఖపై ప్రత్యేక నిఘా
గురుకుల టెండర్ల గోల్మాల్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు నిలదీస్తుండటంతో ఆ శాఖ కు నేతృత్వం వహిస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్ బదులివ్వలేక సతమతమవుతున్నారు. దీంతో టెండర్లకు సంబంధించిన సమాచారం కోసం ఆయన సీఎంవోపై పదేపదే ఒత్తిడి చేశారని తెలుస్తున్నది. సీఎంవోతో సంబంధం లే కుండానే ఆయన టెండర్ల వ్యవహారంపై అప్ప ట్లో స్పందించారు. టెండర్ విలువ రూ.683.78 కోట్లు మాత్రమే అని, రూ.రెండు వేల కోట్ల కుంభకోణం ఎలా సాధ్యమంటూ బీఆర్ఎస్కు సవాల్ విసిరారు.
ఆ తర్వాత టెండర్ల విలువపై మాటమార్చారు. దీనిపై సీఎంవో వర్గాలు ఆయనను తీవ్రంగా మందలించినట్టు తెలుస్తున్నది. టెండర్లపై ఎవరు ఏమన్నా స్పందించవద్దని, వార్త కథనాలను సైతం చూసీచూడనట్టు వదిలేయాలని, అంతా తామే చూసుకుంటామని మంత్రికి అల్టిమేటం జారీచేసినట్టు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. ఇలా టెండర్ల వ్యవహారంపై మంత్రి పదే పదే ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని సీఎంవో వర్గాలు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అప్పటినుంచి ఎస్సీ అభివృది ్ధశాఖ, ఎస్సీ గురుకుల సొసైటీలో జరుగుతున్న అక్రమాలు, ఇష్టారీతిన తీసుకుంటున్న నిర్ణయాలపై లోతుగా వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. సొసైటీకి సంబంధించిన కీలక స్థానంలో రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ఓ ఉన్నతాధికారిని కూర్చోబెట్టడం, ఆయన ద్వారా అక్రమ వ్యవహారాలన్నీ కొనసాగిస్తున్నారన్న ఆరోపణలపై సమగ్ర వివరాలు సేకరించి, నివేదిక అందజేసినట్టు సమాచారం.
డిప్యుటేషన్లు, క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ఫైల్స్‌కు సదరు ఉన్నతాధికారి క్లీన్చిట్ ఇస్తున్నారని, ఫైలుకో రేటు చొప్పున వసూలు చేస్తున్నారని తేలిందట. దీని వెనుక ఎవరున్నారో నిఘా వర్గాలు నిర్ధారించుకున్నట్టు తెలుస్తున్నది. ప్రొబేషనరీ కూడా పూర్తికాని, ఎస్సీ అభివృద్ధి శాఖకు సంబంధం లేని ఓ మహిళా వార్డెన్‌కు మొదట మంత్రి పేషీలో, ప్రస్తుతం సొసైటీ ప్రధాన కార్యాలయంలో డిప్యుటేషన్ కల్పించారు. సొసైటీ జాయింట్ సెక్రటరీతో సమానంగా ప్రత్యేక గదిని కేటాయించారు. ఆమె ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో ఎవరికీ తెలియదు. ఆమెకు అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారనే దానిపై సీఎంవో వర్గాలు నివేదిక తెప్పించుకున్నట్టు తెలుస్తున్నది.
పొన్నం నిర్ణయాలపైనా ఆరా
గురుకుల టెండర్ల వ్యవహారంపై నిలదీసిన నాటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై సీఎంవో ప్రత్యేక నజర్ వేసినట్టు తెలుస్తున్నది. శాఖకు సంబంధించిన ఉన్నతాధికారి ఒకరు సీఎంవో వర్గాల పైరవీ ద్వారానే నియమితులయ్యారని తెలుస్తున్నది. మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకునే ప్రతీ సమాచారాన్నీ ఆయన గుట్టుగా సీఎంవోకు చేరవేస్తున్నట్టు చర్చ కొనసాగుతున్నది. బీసీ సంక్షేమ శాఖలో ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి ప్రమోషన్లలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీటు కో రేటు చొప్పున పోస్టింగ్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని చెప్తున్నారు.
ఈ వ్యవహారంపై నిఘా వర్గాలు లోతుగా సమాచారాన్ని సేకరిస్తున్నట్టు సమాచారం. డిప్యుటీ డైరెక్టర్ పోస్టులతోపాటు ఇటీవల కల్పించిన పలు పోస్టింగ్‌లు, డిప్యూటేషన్లపై ఆరా తీసినట్టు తెలుస్తున్నది. మరోవైపు కుట్టుమిషన్ల పంపిణీకి సం బంధించి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేయాల్సి ఉన్నది. ఇందుకోసం 1.19 లక్షల మిషన్లను కొనుగోలు చేయాల్సి ఉన్నది. దీనికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్, నీరాకేఫ్, నందనం రీ టెండర్లపై మంత్రి ఇటీవల ప్రత్యేక సమీక్ష ని ర్వహించారు. ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీచేశారు. వీటిపై కూడా నిఘా వర్గాలు వివరాలు సేకరించి, ని వేదిక సమర్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
మంత్రి ఉత్తమ్ కదలికలపై కన్ను
కాంగ్రెస్ పాలనపై అసంతృప్తిగా ఉన్న ముఖ్యనేతల్లో సివిల్ సైప్లెస్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒకరు. ముఖ్యనేతకు, ఆయనకు మధ్య విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యం. ఉత్తమ్ శాఖలపై మొదటినుంచీ ప్రత్యేక నిఘా పెట్టినట్టు ప్రచారంలో ఉన్నది. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల్లో ప్రతి అంశంపై నిఘా విభాగం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ము ఖ్యంగా పౌరసరఫరాలపై నిఘాపెట్టార ని, అందుకే మంత్రికి వ్యతిరేకంగా తమ అనుకూల వ్యక్తిని కమిషనర్‌గా ని యమించారనే చర్చ ఉన్నది. ధాన్యం టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యనేత వర్గం ఆధారా లు సేకరించి అధిష్ఠానానికి పంపినట్టు ప్రచారం జరిగింది. గన్నీ సంచుల కొనుగోళ్లు, రైస్ మిల్లులకు సీఎమ్మార్ కేటాయింపు, ధాన్యం కొనుగోళ్లలో ట్రాన్స్పో ర్ట్ టెండర్లు, రేషన్ బియ్యం సరఫరా కోసం నిర్వహించిన స్టేజ్-1 ట్రాన్స్పోర్ట్ టెండర్లు ఇలా ఆర్థిక వ్యవహారాలతో కూడిన అంశాలపై ఆరా తీసి, నివేదికలు సమర్పిస్తున్నట్టు సమాచారం.