హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సామాన్యుడి కంటిమీద కునుకు లేకుండా వేధిస్తున్న సమస్య ‘22ఏ నిషేధిత జాబితా’. తప్పు జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి అంగీకరించారు. పొరపాట్లు జరిగాయని రెవెన్యూ శాఖమంత్రి ఒప్పుకొని, నెపాన్ని అధికారుల మీదికి నెట్టారు. రోజల వ్యవధిలోనే సీఎం, మంత్రి వరుసగా సమీక్షలు, టెలికాన్ఫరెన్స్లతో హడావుడి చేశారు. వెంటనే పరిష్కరించామంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. గంటల వ్యవధిలోనే పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేశామంటూ ప్రకటనలు గుప్పించారు. కానీ క్షేత్రస్థాయిలో జరిగింది మాత్రం పూర్తిగా భిన్నం.
మహమ్మారిలా మారిన నిషేధిత జాబితా భూతం సామాన్యుడిని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నది. ప్రభుత్వం క్షమాపణ చెప్పినా, సమీక్షల పేరిట హడావిడి చేసినా పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఆ చిక్కుముడిని విప్పలేక అధికారులు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. దీనికితోడు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య కొరవడిన సమన్వయం బాధితుడికి పుండుమీద కారంలా తయారైంది. పైగా, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 22ఏ నుంచి సామాన్యుడి ఆస్తికి విముక్తి కల్పించాల్సిన ప్రభుత్వం.. చేతలు మరిచి మరోసారి పాత పాటే పాడేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ వేదికగా 22ఏపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ‘ఈ హడావుడి, ఊకదంపుడు ప్రకటనలు ఎన్నాళ్లు? మా సమస్యలకు పరిష్కారం ఉందా?’ ఇప్పుడు బాధితుల నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవే.
చాపకింద నీరులా విస్తరిస్తున్న సమస్య
రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితా పిడుగు ప్రభావం అంతకంతకూ చాపకింద నీరులా విస్తరిస్తూ సామాన్యుడిని సలుపుతూనే ఉన్నది. ఇది మున్ముందు ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందోనని నగరంలోని సామాన్యుల నుంచి గ్రామాల్లోని రైతుల వరకు గుబులు పట్టుకున్నది. నిన్నటిదాకా రూ.లక్షలు, రూ.కోట్ల విలువ చేసే ఆస్తులను చూసుకొని భరోసాగా ఉన్న కుటుంబాలు, ఇప్పుడు తమ ఆస్తులపై సర్కార్ వేసిన పీటముడిని ఎలా విప్పుకోవాలో తెలియక అయోమయంలో పడిపోయారు. హైకోర్టు ఆదేశాల పేరుతో నిషేధిత జాబితాలో మార్పులు చేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారని, తదుపరి పరిణామాలను అంచనా వేయడంలో వారు పూర్తిగా విఫలం అయ్యారనేది బహిరంగ రహస్యం. కుట్రల సంగతి ఎలా ఉన్నా, సామాన్యుడి ఆస్తికి ముప్పు కలుగకుండా చర్యలు తీసుకోవాలనే కనీస బాధ్యతను మరిచారు.
చివరికి సమస్య పెనుభూతంలా మారి బయటికి వచ్చినపుడైనా, మూలాల్లోకి పోయి పరిష్కారాన్ని కనుగొంటే సరిపోయేది. గత నెలలోనే అటు ముఖ్యమంత్రి, ఇటు రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నతస్థాయి సమీక్షలు, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కారాన్ని చూపుతాం, ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రకటించారు. అదే సమయంలో నెపాన్ని తమపైకి నెట్టివేయడంతో అధికార యంత్రాంగం ఆత్మైస్థెర్యం దెబ్బతిన్నది. పరిష్కార క్రమంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ నిర్ణయం తీసుకుంటే తమకు ఎలాంటి ముప్పు వస్తుందోనన్న అనుమానంతో రెవెన్యూ అధికారులు తీవ్ర భయాందోళనలోకి వెళ్లిపోయారు. అటువైపు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులది కూడా ఇదే పరిస్థితి. కొన్ని నెలల కిందట ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు పడటంతో.. తమకెందుకు వచ్చిన తంటా అని అధికారులు భావిస్తున్నారు.
పిల్లి మెడలో గంట కట్టేదెవరు?
దశాబ్దాల కిందట ఇండ్లు నిర్మించుకున్న కాలనీలను సైతం సర్కార్ పెద్దల ఆదేశంతో అధికారులు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ దశాబ్దాల కిందటి రికార్డుల ఆధారంగా భూములపై నిషేధిత కత్తిని కట్టారు. సీఎం, రెవెన్యూ మంత్రి 22ఏ నిషేధిత జాబితాకు సంబంధించిన సమీక్షల్లో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారేగానీ, వాటి తొలగింపునకు స్పష్టమైన మార్గదర్శకాలు తెలియజేయలేదు. దీంతో తాము ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనన్న అనుమానం వెంటాడుతున్నదని అధికారులు చెప్తున్నారు. తహసీల్దార్లు నివేదికలు రూపొందించి జిల్లా కలెక్టర్లకు పంపుతున్నారు.
ఒకేసారి కుప్పలుగా వస్తున్న నివేదికలపై వెంటనే నిర్ణయం తీసుకునేందుకు కలెక్టర్లు కూడా ముందుకు రావడంలేదని తెలిసింది. మరోవైపు రిజిస్ట్రేషన్ శాఖలో ప్రస్తుతం ఉన్న జాబితాను ముట్టుకునేందుకు ఎవరూ సాహసించడం లేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప తాము నిర్ణయం తీసుకోవద్దనే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇటీవలే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని చెంగిచర్లలో ఏండ్ల కిందటే పట్టా భూమిలో వేసిన లే అవుట్ నిషేధిత జాబితాలో చేరింది. అందులో 500 చదరపు గజాలకు సంబంధించి స్వయానా జిల్లా కలెక్టర్ ఎన్వోసీ జారీ చేశారు. దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయాలని బాధితుడు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లగా, ఎన్వోసీ ఆధారంగా చేయాలని ఏ చట్టంలో ఉందో చెప్పాలంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. 22ఏ జాబితాలో ఉన్నందున తాము రిజిస్ట్రేషన్ చేయమంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. దీంతో పిల్లి మెడలో గంట కట్టేదెవరో తెలియక సామాన్యుడు అచేతనంగా మారిపోయాడు.
‘ఫాస్ట్‌ట్రాక్’ ఆదేశాల అమలేది?
22ఏ నిషేధిత జాబితాకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరించాలంటూ మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో అమలవుతుందా అని పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. 22ఏ పై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చిన ఫిర్యాదులను రెవెన్యూ శాఖకు పంపుతారు. వాటిని పరిష్కరించాలంటూ ఆర్ఐ, సర్వేయర్‌ను తహసీల్దార్ ఆదేశించాలి. సర్వేయర్ క్షేత్రస్థాయికి వెళ్లి నిర్ధారించుకోవాలి. ఆ వివరాల ఆధారంగా రిపోర్టు తయారు చేయాలి. తహసీల్దార్ వాటిని పరిశీలించి జిల్లా కలెక్టర్‌కు పంపాలి. కలెక్టర్ వాటిని పరిశీలించి, జాబితా నుంచి తొలగింపునకు అర్హత ఉందని నిర్ధారణకు వస్తే క్లియరెన్స్ ఇవ్వాలి. ఇక్కడే అత్యంత క్లిష్టమైన పరిస్థితులు నెలకొంటున్నాయని బాధితులు, అధికారులు చెప్తున్నారు.
అసెంబ్లీలో అయినా పరిష్కారం చెప్తారా?
22ఏ నిషేధిత జాబితా సమస్య సామాన్యుడిని వేధిస్తున్నదని సర్కార్ పెద్దల దృష్టికి పలువురు ప్రముఖులు తమ స్వీయానుభవాన్ని తీసుకుపోయారు. నానాటికీ సవాల్‌గా మారుతున్న సమస్యను పరిష్కరించడంపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలి. కానీ దీనిని రాజకీయ కోణంలోనే చూడటంతో ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఈ అంశంపై తమ గళాన్ని వినిపిస్తున్నది. ప్రభుత్వం దీనిని సమస్యగా గుర్తించడానికి బదులుగా ప్రతిపక్షాన్ని కట్టడి చేయడం, అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షం ఈ సమస్యను లేవనెత్తకుండా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే ధ్యాసం తా ఉంచింది. ఫలితంగా సమస్యకు పరిష్కారం ఎండమావిగా మారింది. అసెంబ్లీలో శుక్రవారం ప్రభుత్వం 22ఏపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. దీనిద్వారా అయినా శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందా? లేక మళ్లీ ప్రతిపక్షాలపై ఎదురు దాడికి పరిమితమవుతుందా? అనేది వేచి చూడాలి.
రాయదుర్గం భూములను ఎందుకు వేలం వేశారు?: హైకోర్టు
ప్రభుత్వానికి, టీజీఐఐసీకి నోటీసులు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): పురాతన శిలలు, చారిత్రక ప్రాధాన్యం ఉన్న రాయదుర్గం సర్వే నంబర్ 83/1లోని భూములను ఎందుకు వేలం వేశారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దుర్గంచెరువు సమీపంలోని ఐదెకరాల విస్తీర్ణంలో రెండు ప్లాట్లకు లేఔట్ వేసి నిర్వహించిన ఈ-వేలాన్ని సవాల్ చేస్తూ బేగంపేటకు చెందిన ప్రణయ్సింహారావు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. 1998, 2003 ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఈ ప్రాంతాన్ని చారిత్రక, వారసత్వ, శిలా రక్షణ ప్రాంతంగా గుర్తించారని, 2006లో ఇదే భూమిని వేలం వేసి, సాంకేతిక కమిటీ సిఫార్సుల మేరకు రద్దు చేశారని ధర్మాసనం గుర్తుచేసింది. ఇప్పుడు మళ్లీ ఎందుకు వేలం వేయాల్సి వచ్చిందో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని, టీజీఐఐసీని ఆదేశించింది. ఈ ప్రాంతానికి సంబంధించిన లేఔట్ సవరణలు, బఫర్‌జోన్ పరిధి, అభివృద్ధికి అనుమతులు తదితర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
22ఏ జాబితాపై పలు సందర్భాల్లో సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి చేసిన ప్రకటనలు
తేదీ: 13.08.2026
మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత నాదే. ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దు. ఎవరైనా కొనుగోలు చేసిన భూమి ఏదైనా కారణంతో 22ఏలో పడితే ఆ భూమి ఎక్కడికీ పోదు. అధికారులతో మాట్లాడి ఆ భూమి రిజిస్ట్రేషన్లు అయ్యేలా ఆదేశాలిస్తాం. ఒక సర్వేనెంబరు 500 ఎకరాలు ఉంటే అందులో రెండు, మూడు ఎకరాలపై కేసులుంటే కోర్టు ఆదేశాలతో మొత్తాన్ని 22ఏలో పెడుతున్నారు. అలాంటి భూములకు బై నంబర్లు ఇచ్చి, ప్రభుత్వ భూమిని తీసేసి, కొనుగోలు చేసుకున్న వారి భూములు రిజిస్ట్రేషన్ అయ్యేలా చూసే బాధ్యత నాది.
(తేదీ: 19.08.2026)
నిజమైన యజమానులు తమ ఆస్తులను రిజిస్టర్ చేసుకోవడంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు చర్యలు ప్రారంభించాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్లు పొందిన వారికి చెందిన భూములు సెక్షన్ 22ఏ కింద చేర్చబడ్డాయో లేదో అధికారులు రెండు రోజుల్లో ధృవీకరించుకోవాలి. ఒకవేళ అవి ప్రైవేట్ భూములైతే రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలి. జిల్లా కలెక్టర్లు 22ఏ కింద చేర్చబడిన భూములను తనిఖీ చేసి, ఒక సమగ్ర జాబితాను సిద్ధం చేయాలి. ఒక్క అంగుళం ప్రైవేట్ భూమి కూడా ప్రభావితం కాకుండా చూస్తాం.
తేదీ: 05.08.2026
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గజం భూమిని కూడా 22ఏ జాబితాలో చేర్చలేదు. వివాదాలులేని ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో ఏ పేదవాడికీ, ఏ నిజమైన భూ హక్కుదారుడికీ అన్యాయం జరుగకుండా చూడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. 22ఏకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులు ఏస్థాయిలో వచ్చినా వాటిని పెండింగులో ఉంచకుండా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలి.
తేదీ: 17.08.2026
22ఏకు సంబంధించి అధికారుల తప్పిదాల కారణంగా ఇబ్బందులు పడిన వారికి క్షమాపణలు చెబుతున్నాం. నిషేధిత జాబితాను నవీకరించడంలో జరిగిన పొరపాట్లను అంగీకరిస్తున్నాం. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్22ఏ కింద చేర్చబడిన భూములకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో అనేక ప్రైవేట్ భూములు అధికారుల పొరపాటుతో నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. 22ఏ సమస్యల సత్వర పరిష్కారం కోసం రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌శాఖ ఐజీ, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. రాబోయే 15 రోజుల పాటు ఈ కమిటీ రోజువారీగా దరఖాస్తులను పరిశీలించి, నిజమైన ప్రైవేట్ ఆస్తులన్నింటినీ తక్షణమే పరిష్కరిస్తుంది.
తేదీలు: 19.08.2026, 20.08.2026
22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్య పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ విధానంలో చర్యలు చేపడుతున్నాం. నిషేధిత జాబితాలో భూమి ఉన్నదనే కారణంతో రిజిస్ట్రేషన్ దరఖాస్తులను తిరస్కరించవద్దని అధికారులను ఆదేశించాం. కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదుపై నిజానిజాలను నిర్ధారించి, దరఖాస్తుదారు పేర్కొన్న సమస్య వాస్తవమా? భూమి 22ఏ జాబితాలోకి ఎందుకు వచ్చింది? దరఖాస్తుదారుడికి అర్హత ఉందా? అనే అంశాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, స్పష్టమైన కారణాలతో వెంటనే నిర్ణయం తీసుకోవాలి.
తేదీ: 31.08.2026
రెవెన్యూ అధికారుల పనితీరు తీవ్ర అసంతృప్తిగా ఉంది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవు. అధికారులు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో పని చేయాలి. 22ఏ నిషేధిత జాబితా, భూ సమస్యల విషయాల్లో నిబంధనలకు విరుద్ధంగా, సొంత నిర్ణయాలు తీసుకోవద్దు.