హైదరాబాద్, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ పరువుకు భంగం కలిగించడమే కాకుండా అసత్యాలు ప్రచారం చేస్తూ సభను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, బీ లక్ష్మారెడ్డి గురువారం అసెంబ్లీ కార్యదర్శి కి నోటీసు కాపీని అందించారు. రూల్ 168 కింద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన బీఆర్ఎస్.. సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ నెల 9వ తేదీన శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అనేక నిరాధార ఆరోపణలతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించారని నోటీసులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ అంతర్జాతీయ కార్యదర్శి సంధ్యారావు పేరిట ఉన్న నకిలీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టును చదువుతూ కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించారని పేర్కొన్నారు. అసలు బీఆర్ఎస్కు అంతర్జాతీయ కార్యదర్శి పదవే లేదని తెలిపారు. నిజానిజాలను సరిచూసుకోకుండా సంధ్యారావు పేరిట కాంగ్రెస్ ఐటీ సెల్ వండి వార్చిన నకిలీ ఎక్స్ ఖాతాలోని పోస్టును అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చదివి వినిపించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు.