Harish Rao | సిద్దిపేట, అక్టోబర్ 1: దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్‌రెడ్డి సర్కారేనని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్నచూపు అని ప్రశ్నించారు. బుధవారం ఆయన సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేస్తూ .. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం మొండిచేయి చూపుతున్నదని హరీశ్‌రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం 3% డీఏను మంజూరు చేస్తూ తీపి కబురు చెప్తే, రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఉద్యోగులపై వివక్షకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎకువ జీతం ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. దేశంలో ఎకడాలేనివిధంగా మొదటిసారి 42% పీఆర్సీ, రెండోసారి 31% పీఆర్సీ మొత్తంగా 73% పీఆర్సీ కేసీఆర్ ఇచ్చారని గుర్తుచేశారు.
డీఏ అంటే డియర్నెస్ అలవెన్స్. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం డీఏ అంటే ‘డోంట్ ఆస్’ అంటున్నారు. పగ, ప్రతీకారంతో పాలన నడుస్తున్నది. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దెబ్బతీసింది.
-హరీశ్‌రావు
దసరా పండుగ రోజు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ, డీఏ ప్రకటిస్తుందేమోనని ఉద్యోగులు ఆశగా చూశారని, కానీ వారికి నిరాశే మిగిలిందని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తమని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీంను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. చివరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను కూడా ఖతం చేస్తున్నదని ఎద్దేవా చేశారు. 15 నెలలుగా ఉద్యోగుల వేతనాల నుంచి పెన్షన్ కోసం కట్ చేసిన కాంట్రిబ్యూటరీ ఫండ్ రూ.5,500 కోట్లు ప్రభుత్వం వాడుకున్నదని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత పోలీస్ సిబ్బందికి ఐదు ఏరియర్స్, ఐదు సరెండర్ లీవులు, 14 డీఎలు పెండింగ్ ఉన్నాయని, పోలీసుస్టేషన్‌కి ఇచ్చే అలవెన్స్‌లను కూడా బంద్ పెట్టారని హరీశ్‌రావు విమర్శించారు. పోలీస్ వాహనాల్లో పెట్రోల్ పోసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని చెప్పారు. కేసీఆర్ హోంగార్డుల వేతనాన్ని రూ.12 వేల నుంచి రూ.29 వేలకు పెంచితే రేవంత్‌రెడ్డి కేవలం రూ.75 పెంచారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌కు అడిషనల్ అలవెన్స్, 30% అదనపు వేతనం ఇచ్చిందని, కానీ రేవంత్ సర్కార్ అన్నీ బంద్ పెట్టిందని దుయ్యబట్టారు.
ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి బడాబడా మాటలు, ఓట్లు అయిపోయాక గజనీకాంత్ మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా.. పీఆర్సీ, డీఏ ప్రస్తావనే లేదు.
-హరీశ్‌రావు
తెలంగాణలోనే అతి పెద్ద పండుగ దసరాను చేసుకోలేని పరిస్థితుల్లో చిరు ఉద్యోగులు ఉన్నారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ‘రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నుంచి ఆరు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ వాచ్మెన్లకు నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదు. ఫారెస్ట్‌లో పనిచేసే వాచ్గార్డ్లకు 12 నెలల నుంచి జీతాలు రావడం లేదు. ఆశా వరర్లను రోడ్డెకించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు బంద్ చేస్తామంటున్నాయి’ అని హరీశ్‌రావు వివరించారు. దేవాలయాల్లోని అర్చకులకు ధూపదీప నైవేద్యం పథకం కింద మూడు నెలల నుంచి డబ్బులు చెల్లించడం లేదని విమర్శించారు. ‘ఆడబిడ్డలకు చీరల్లేవు. రైతులకు యూరియా లేదు. సన్న వడ్లకు బోనస్ రాదు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగులకు అడుగడుగునా డబ్బులు లేవంటున్న సీఎం రేవంత్‌రెడ్డి… ఫోర్త్‌సిటీకి రూ.5 వేల కోట్లతో ఆరు లైన్ రోడ్డు, మూసీలో గోదావరి నీళ్లు పోయడానికి రూ.7వేల కోట్లు, హెచ్ఎండీఏలో రూ.10 వేల కోట్లతో టెండర్లు ఎలా పిలుస్తున్నారని ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు ఉద్యోగులకు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగితే, పగబట్టి అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి బెదిరింపులకు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని, ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడి పోరాడుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలను, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌ను తక్షణమే విడుదల చేయాలని, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, రూ.5,500 కోట్లను తక్షణమే తిరిగి సీపీఎస్ కాంట్రిబ్యూషన్‌కు చెల్లించాలని, హెల్త్‌కార్డులు అమలుచేయాలని డిమాండ్ చేశారు.. చిరు ఉద్యోగులు, ఆశాలు, అంగన్వాడీలు, రేషన్‌డీలర్లు, అర్చకులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల హామీలను అమలు చేయాలని కోరారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగుల పక్షాన శాసనసభలో నిలదీస్తాం. ఈ ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడింది. అన్యాయం, అహంకారం, అరాచకాలను ప్రజలు ఎకువ రోజులు సహించరు.
-హరీశ్‌రావు
కేంద్ర ప్రభుత్వం గోధుమలకు మద్దతు ధరను రూ.160 పెంచి, వరికి మాత్రం 69 రూపాయలే పెంచిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలో పండే గోధుమలకు ఒక నీతి, దక్షిణ భారతదేశంలో వరికో నీతి ఎందుకు? అని ప్రశ్నించారు. దక్షిణ భారతదేశ రైతులంటే బీజేపీకి చిన్నచూపు ఎందుకుని నిలదీశారు. గోధుమలతో సమానంగా వరికి మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో అతి ఎకువ నష్టం తెలంగాణకే జరగుతుందని చెప్పారు. వరి పండించే తెలంగాణ రైతులు క్వింటాల్‌కు రూ.220 చొప్పున, ఎకరాకు దాదాపు రూ.ఏడు వేల దాకా నష్టపోవాల్సి వస్తున్నదని వివరించారు. గోధుమలకు ఇచ్చినట్టు వరికి కూడా మద్దతు ధర సమానంగా ఇస్తే తెలంగాణ రైతులకు ఎకరానికి రూ.7000 లాభం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు రైతుల పక్షాన నిలబడతారో, కేంద్రానికి కొమ్ము కాస్తారో తేల్చుకోవాలని హితవు పలికారు.
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రైతు ఆత్మహత్యల తెలంగాణను అన్నపూర్ణగా మార్చిందీ, దేశానికే ఆదర్శప్రాయమైన రైతు సంక్షేమ పథకాలను ప్రారంభించి, సాగును బాగు చేసిందీ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని, ఈ విషయాన్ని జాతీయ నేర గణాంక నివేదిక లెకలే స్పష్టంచేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ లెక్కలు కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టు అని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా జాతీయ నేర గణాంక నివేదికలో పేర్కొన్న వివరాలను ఉటంకించారు. తెలంగాణలో 2014లో 1,347 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, 2023 నాటికి 56కి తగ్గిందని వివరించారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ప్రస్తుతం 14వ స్థానానికి పరిమితమైందని తెలిపారు. 2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, అందులో తెలంగాణ వాటా కేవలం 0.51% అని తెలిపారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పింఛనుదారులకు డీఏను 3 శాతం పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీనివల్ల 49.19 లక్షల మంది ఉద్యోగులు, 68.72 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ పెరుగుదల జూలై 1 నుంచి అమలవుతుంది. ధరలు పెరుగుదలకు పరిహారంగా డీఏ, డీఆర్‌లను పెంచుతారు. ప్రస్తుతం బేసిక్ పే/పెన్షన్‌లో 55 శాతం డీఏ/డీఆర్ ఇస్తున్నారు. దీనిని తాజాగా మరో 3 శాతం పెంచారు. ఈ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. డీఏ/డీఆర్ పెంపు వల్ల ఖజానాపై సంవత్సరానికి రూ. 10,083.96 కోట్లు భారం పడుతుందన్నారు.