Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రజలంతా దేవాలయంగా భావించే నిండు శాసనసభలో సీఎం హోదాలో రేవంత్ పచ్చి అబద్ధాలు వల్లెవేశారని, తన మాటల గారడీతో ప్రజలను సభసాక్షిగా ప క్కదారి పట్టించారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ ముగిసిన తర్వాత హరీశ్ బీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడారు. సభ చివ రి రోజు వరకు రైతు భరోసా ఎప్పుడిస్తారో?, ఎంతిస్తారో?, ఎంతమందికి ఇస్తారో చెప్పలేదని, రుణమాఫీ విషయంలోనూ క్లారిటీ ఇవ్వలేదని వాపోయారు. అప్పుల విషయంలో తప్పుడు లెకలు చెప్తున్నారని ప్రభుత్వానికి, సీఎం, మంత్రులకు అప్పులపై ఇప్పటికీ క్లారిటీ లేదనే విషయం తేలిపోయిందని చెప్పారు.
బీఆర్ఎస్పై తన కడుపులున్న అక్కసునంతా రేవంత్‌రెడ్డి వెళ్లగక్కిండని హరీశ్ చెప్పారు. ‘ఒక సూలు కట్టిండ్రా? అని సీఎం మాట్లాడిండు.. నీకేం తెలుసు..? ఏ నియోజకవర్గానికైనా పోదాం పా.. మేము కట్టిన మన ఊరు మనబడి స్కూళ్లను.. గురుకులాలను చూపిస్తం’ అని చెప్పారు. తాము ఫార్మాసిటీలో ఏ కంపెనీకి కూడా ఎకరం కూడా ఇవ్వలేదని, కానీ అగ్గువకే కంపెనీలకు కేటాయించినట్టు సీఎం అబద్ధాలు చెప్తున్నారని తెలిపారు.
‘ఆగస్టు15లోగా రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని బల్లగుద్ది చాలెంజ్ చేసిన. ఇప్పటికీ రుణమాఫీ కాని రైతులు లక్షల్లో ఉన్నరు. ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ అయ్యేలా చేసిన. కానీ నువ్వేం చేసినవ్? మొత్తం ఎగబెట్టే ప్రయత్నం చేసినవ్.. నీ కథంతా ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అ న్నట్టున్నది’ అని హరీశ్ దెప్పిపొడిచారు. ‘ఆరిపోయే దీపానికి వెలుతురెక్కువ అన్నట్టు ముఖ్యమంత్రివన్నీ చావు తెలివితేటలు.. గొంతు చించుకొని నువ్వు చెప్పే గారడీ మాటలను ప్రజలు నమ్మరు’ అంటూ మండిపడ్డారు. ‘పంట బీమాపై మంత్రి తుమ్మల చేతులెత్తేసిండు. ఎస్ఎల్బీసీని మేం 11 కిలోమీటర్లు తవ్వితే, కిలోమీటరు కూడా తవ్వలేదంటరు. మూసీ కా లుష్యం పాపం 50 ఏండ్ల కాంగ్రెస్ పాలన, 16 ఏండ్ల టీడీపీ పాలన ఫలితమే’ అని విమర్శించారు.
మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి చెప్పే కంపు ఎక్కువైంది. ఏడాదిగా చేసిందేం లేక అబద్ధాల పాలన సాగిస్తున్నడు. రేవంత్‌రెడ్డి అబద్ధాల నుంచి ఈ రాష్ర్టాన్ని, ప్రజలను ఆ దేవుడే కాపాడాలె.. సభ చివరి రోజు వరకూ రైతు భరోసా ఎప్పుడిస్తరో? ఎంతిస్తరో? ఎంతమందికిస్తరో చెప్పనేలేదు!
-హరీశ్‌రావు
‘నాలుగైదు వేల కోట్లు ఖర్చుపెట్టి మూసీ ట్రీట్మెం ట్ ప్లాంట్లు కట్టినం. లగచర్లకు పోదాం పద.. మూసీ ప్రారంభమైన దగ్గరికి వెళ్దాం పద. రేవంత్‌రెడ్డీ.. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ముందా?’ అంటూ హరీశ్ సవాల్ చేశారు. ‘మే ము వాస్తవాలు చెప్తమనే మాకు స్పీకర్ మైకు కూడా ఇవ్వడం లేదు.. అప్పుల గురించి సీఎం తప్పులు మాట్లాడారు’ అని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు 4.17 లక్షల కోట్లేనని, పాత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా ఇచ్చిన అప్పులకు 3.5 లక్షల కోట్లకు పైగా మిత్తీలు కట్టామని వివరించారు. ‘మేము ఎన్నో అభివృద్ధి పనులు చేసినం.. మీకు పాలన చేతగాక ప్రజల ముందుకు పోలేక అప్పులపై తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నరు’ అని మండిపడ్డారు.
సభలో ప్రతి సబ్జెక్టులోనూ ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు సొల్లు వాగుడు వాగిండ్రు. మేము చెప్పని మాటలను చెప్పి తన స్థాయిని తగ్గించుకున్నడు. మేమే రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆర్ఆర్ఆర్, ప్రాజెక్టులు వద్దన్నమని, అడ్డంపడ్డమని సిగ్గులేకుండా అబద్ధాలు చెప్పిండు. అసెంబ్లీ సాక్షిగా ఇన్ని పచ్చి అబద్ధాలాడిన ముఖ్యమంత్రిని మేం ఇంతవరకూ చూడలే..
-హరీశ్‌రావు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన రిపోర్టులోనే కాళేశ్వరం గొప్పతనం ఉన్నదని, అయినా కావాలనే పనిగట్టుకొని అబద్ధాలు చెప్తున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాళేశ్వరం ద్వారా 20 లక్షల 30 వేల ఎకరాలకు పైగా సాగులోకి వచ్చిందని కాంగ్రెస్ రిపోర్టు చెప్తుంటే.. సాక్షాత్తూ సీఎం సభలో కాళేశ్వరంతో 50 వేల ఎకరాలే సాగవుతున్నయని అం టుండు. ఉత్తర తెలంగాణకు సాగు, తాగునీరు ఇస్తున్నది కాళేశ్వరం కాదా? పరిశ్రమలకు నీళ్లిస్తున్నది కూ డా కాళేశ్వరమే.. కాళేశ్వరమే లేకుంటే మల్లన్నసాగర్ లేదు.. నువ్వు హైదరాబాదుకు తెస్తమన్న 20 టీఎంసీల నీళ్లు లేవు’ అంటూ వివరించారు. హైటెక్ సిటీ అమ్మిండ్రు అంటవు.. ఎవరన్న అమ్మిండ్రా? చెప్పు. గోబెల్స్ ఉండి ఉంటే నీ అబద్ధాలను విని ఉరేసుకొనేటోడు’ అని హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
‘రుణమాఫీ మీద కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నరు. రూ.7,500 కోట్లు వానకాలం రైతుబంధు ఎగ్గొట్టినవు. రూ. 2500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంటు, రూ.2000 కోట్లు ముసలోళ్ల పింఛన్లు ఎగ్గొట్టినవు.. రూ. 1000 కోట్ల బతుకమ్మ చీరెలు ఎగ్గొట్టినవు. కేసీఆర్ కిట్ పథకాన్ని కరాబు చేసి డబ్బులివ్వకుండా ఎగ్గొట్టినవు. ఈ డబ్బులన్నీ ఎక్కడ?’ అని హరీశ్ ప్రశ్నించారు. ‘రుణమాఫీ చేసినప్పుడు మిత్తి మీద పడ్డదని అన్నవు.. మీ పాలనలో రైతుల మీద మిత్తి పడుతలేదా? ఆ డబ్బులు ఎవ్వరు కట్టాలె?’ అని నిలదీశారు. రైతుల మీద మిత్తీల భారం పడ్డది. దీనిమీద బహిరంగ చర్చకు నేను సిద్ధం. రేవంత్ నువ్వు వస్తవా? మీ భట్టి వస్తరా? తుమ్మల వస్తరా? చెప్పాలి’ అని సవాల్ విసిరారు. ‘2 లక్షలకు పైగా రుణాలున్న వారివి ఎప్పుడు మాఫీ చేస్తవు? లేకపోతే ముకు నేలకు రాసి రైతులకు క్షమాపణలు చెప్పండి’ అని డిమాండ్‌చేశారు.
‘సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణించడం బాధాకరమే. కొండారెడ్డిపల్లిలో నీ తమ్ముళ్ల వేధింపులతో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కేసు నమోదు చేయలేదు. వాంకిడి హాస్టల్లో ఒక గిరిజన విద్యార్థి శైలజ విషాహారం తిని చావుబతుకుల మధ్య నిమ్స్‌లో పో రాడి మరణించింది. నీకుగాని, నీ మంత్రులకు గాని పరామర్శించే తీరిక లేదా? మా ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శించేందుకు వెళ్తుంటే అర్ధరాత్రి అరెస్టు చే యించడం దుర్మార్గం కాదా?’ అని ఫైర్ అయ్యారు.
1946 డిసెంబర్ 9న సోనియాగాంధీ పుడితే.. ఆమె ప్రసన్నం కోసం తెలంగాణ తల్లి ఏర్పాటు కోసం 1946 జీవో నంబర్ ఇచ్చిండ్రు. డిసెంబర్ 9న అసెంబ్లీ పెట్టిండ్రు. ఇదంతా సోనియా ప్రసన్నానికే. నాడు సోనియాను బలిదేవత అన్నది నువ్వే, నేడు కాళు ్లపట్టుకొన్నది నువ్వే.. బయట అబద్ధాలు, లోపల అబద్ధాలతోనే సభ నడిపిండ్రు. పతివ్రత పరమాన్నం వండితే.. తెల్లారేదాకా సల్లారలేదన్నట్టున్నది రేవంత్ తీరు.
-హరీశ్‌రావు
‘రేవంత్‌రెడ్డి అబద్ధాలను వల్లెవేసేందుకే శాసనసభ లు నిర్వహిస్తుండు. ఉత్తమ్ మాట్లాడుతూ మేం ఒక ఉద్యోగం ఇవ్వలేదంటాడు. ఒక ఇరిగేషన్ శాఖలోనే మేం 2 వేల ఉద్యోగాలిచ్చినం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెయ్యి కోట్లు సంపాదించిండని మరో ఎమ్మెల్యే అంటడు. నిసిగ్గుగా సభలో అబద్ధాలు మాట్లాడుతుం టే సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినం’ అని హరీశ్ చెప్పారు. ఈ రేస్ మీద చర్చ పెట్టాలని కోరితే ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవాచేశారు.
‘మీ ఏడాది పాలనలో 54 మంది విద్యార్థులు మరణించారు. 89 మంది ఆటో డ్రైవర్లు, 29 మంది నేతన్నలు, 450 మంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. 1000 రేప్ కేసులు నమోదైనయి. మీ పాలనలో 390 ప్రొటెస్టులు జరిగినయ్. కుక కాట్లు, పాము కాట్లు, తేలు కాట్లతో ప్రజలు, విద్యార్థులు, రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నరు. ఆ తప్పిదాలను కప్పిపుచ్చుకోడానికే 2 గంటలపాటు సభలో సీఎం అబద్ధాలు మాట్లాడిండు’ అని హరీశ్ ధ్వజమెత్తారు.
‘సభలో మంత్రి కోమటిరెడ్డి ఏం చెప్తున్నడో ఆయనకే తెల్వదు. మంత్రి శ్రీధర్‌బాబు వెళ్లి అంగీపట్టుకొని గుంజినా, స్పీకర్ వద్దని వారించినా కోమటిరెడ్డి కూర్చోవడం లేదు. చట్టసభలపై కాంగ్రెస్ సభ్యులకు గౌరవం లేదు. బయట అబద్ధాలు, లోపల అబద్ధాలతోనే సభ నడిపిండ్రు’ అని హరీశ్ అసహనం వ్యక్తంచేశారు. రేవంత్ పాలనంతా అవినీతి మయమేనని, ఈ రాష్ర్టాన్ని కాంగ్రెస్‌కు రూ.1,700 కోట్ల సర్ ప్లస్‌తో ఇచ్చామని చెప్పారు.
మిషన్ భగీరథలో 50 వేల కోట్లు తినేశారని సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ఆరోపణలను హరీశ్ సమర్థవంతంగా తిప్పికొట్టారు. మిషన్ భగీరథ పథకానికి అయిన ఖర్చే 28 వేల కోట్లయితే 50 వేల కోట్లు తినేశారని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. ఇలా మాట్లాడటం సబబుకాదని, కోమటిరెడ్డి ఆరోపణలను సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లా అన్యాయమైపోయిందన్న వెంకటరెడ్డి ఆరోపణలను తిప్పికొట్టారు.
‘అసెంబ్లీ నుంచి సీదా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడకు పోదాం. నాడు కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికీ నీళ్లు రాకపోతే కాళేశ్వరంతో రెండు లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లిచ్చినం. ఈ నీళ్లు కేసీఆర్ వచ్చినంక వచ్చినయా? అంతకు ముందే వచ్చినయా? అని కాల్వల మీద రైతులను అడుగుదాం’ అంటూ సవాల్ విసిరారు. ‘నల్లగొండ జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చినం. యాదాద్రి పవర్‌ప్లాంట్ తెచ్చినం. గత ఐదేండ్లల్లో నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేసినం. సమగ్రంగా అభివృద్ధి చేసినం’ అంటూ దీటుగా తిప్పికొట్టారు.
శాసనసభ ఆలస్యంగా ప్రారంభం కావడంపై హరీశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. సభ ప్రారంభం కాగానే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. సభ రోజూ 5,10 నిమిషాలు ఆలస్యమవుతున్నదని, సమయపాలన పాటించి అందరికీ ఆదర్శంగా సభ ఉండేలా చూడాలని కోరారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ స్పందిస్తూ జీరో అవర్ కొనసాగించే అంశం, సభ్యులకు అవకాశం కల్పించే విషయంలో చర్చించడంతో సభ ఆలస్యమైందని చెప్పారు.
‘15 రోజులైనా సభ నిర్వహించాలని మేం పట్టుబడితే.. నిర్వహించకపోగా వారానికే సరిపెట్టారు. అప్పుల విషయంలో ప్రభుత్వం సెల్ఫ్‌గోల్ చేసుకున్నది. గాంధీభవన్, సీఎల్పీ సమావేశాలలాగా శాసనసభను నడిపారు’ అని హరీశ్ దుయ్యబట్టారు. సభలో ఎమ్మెల్యేల సంఖ్యకంటే మార్షల్స్ సంఖ్య పెరిగిందని, ఎమ్మెల్యేలు 119 మంది ఉంటే మార్షల్స్ 150 మంది వరకు ఉన్నారని ఎద్దేవా చేశారు. నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, హైడ్రా మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోనే వాళ్లు వెనకడుగు వేశారని చెప్పారు. కూల్చివేతలపై ప్రభుత్వం వెనకడుగు వేసిందంటే అది బీఆర్ఎస్ పోరాట ఫలితమేనని స్పష్టంచేశారు. సమావేశంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాణిక్‌రావు, కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.
నిర్బంధాలు, అరెస్టులు రేవంత్‌రెడ్డి నిరంకుశత్వంతోనే అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయని, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన తమ కర్తవ్యం నిర్వహించామని హరీశ్ చెప్పారు. ‘మేం విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, ఆటో డ్రైవర్లు, ఆశాల పక్షాన మాట్లాడినం. ప్రజల పక్షాన ఆరేడు రోజులపాటు ప్రజల గొంతుకగా శాసనసభలో ఎత్తి చూపినం’ అని తెలిపారు.