హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : ‘ఎన్నికల్లో హామీ ఇచ్చిన జా బ్ క్యాలెండర్ ఏమైంది? అని విద్యార్థులు నిలదీసినందుకే గ్రంథాలయాల్లో నిషేధాజ్ఞలు విధిస్తరా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారపక్షంలోకి రాగానే మరో విధంగా వ్యవహరిస్తరా? గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలపై విద్యార్థులతోపాటు యావత్తు తెలంగాణ ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా నిలదీస్తున్నరు. అయితే మొత్తం తెలంగాణ సమాజంపైనే నిషేధాజ్ఞలు విధిస్తరా?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నివర్గాలపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని బుధవారం ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. గ్రంథాలయాల్లో నిషేధాజ్ఞలతో బోర్డులను ఏర్పాటు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రంథాలయాలను రాజకీయ వేదికలుగా మార్చిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు ఆ గ్రంథాలయాల్లోనే సుద్దపూస మాటలు, నీతులతో తయారుచేసిన బోర్డులను ఏర్పాటు చేసిందని నిప్పులు చెరిగారు.
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రాజకీయమంతా గ్రంథాలయాల చుట్టే తిరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని సైతం గ్రంథాలయాలకు తీసుకొచ్చి, నిరుద్యోగులకు బూటకపు హామీలు ఇచ్చిన సంగతి అప్పుడే మరిచిపోయారా? నిలదీశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే అవి రాజకీయ వేదికలు కావని, గ్రంథాలయాలని గుర్తుకొచ్చాయా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులపై లాఠీచార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.