Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు కానీ ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనడం లేదని మండిపడ్డారు.
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మల్లారం వద్ద సిద్దిపేట-కరీంనగర్ రాజీవ్ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. రైతులకు సంఘీభావంగా హరీశ్‌రావు ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. 28 రోజులుగా వడ్లను కొనుగోలు చేయడం లేదంటూ రైతులు తన దృష్టికి తెచ్చారని తెలిపారు. మొక్కజొన్న రైతులకు గన్నీ బ్యాగులు లేకపోతే రైతులు సొంతంగా బ్యాగులు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. 22 రోజులుగా సన్ ఫ్లవర్ గింజలను కొనుగోలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే కలెక్టర్లకు ఆర్డర్ ఇచ్చి వడ్ల కొనుగోలును ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారని.. అది కాస్త బోగస్ అయ్యిందని హరీశ్‌రావు విమర్శించారు. ఎరువులు కొనాలంటే యాప్ కావాలి.. వడ్లు కొనాలంటే ఆన్లైన్ కావాలి అంటూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు.