Keeravani | రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘RRR’ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలోనూ భారతీయ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాకు సీక్వెల్ రావాలని రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ‘RRR 2’ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సీక్వెల్ గురించి మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. దీంతో ‘RRR 2’ అధికారికంగా కన్ఫర్మ్ అయిందంటూ అభిమానుల్లో చర్చ మొదలైంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న కీరవాణి వీడియోను చాలామంది తాజా ఇంటర్వ్యూగా భావిస్తున్నారు. అయితే వాస్తవానికి ఆ వీడియో పాతదే. గతంలో జరిగిన ఓ సంభాషణలో కీరవాణి ‘RRR’ సీక్వెల్ తెరకెక్కే అవకాశాల గురించి మాట్లాడారు. అయితే ఆ పాత వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘RRR 2’పై కొత్త అప్డేట్ వచ్చిందనే ప్రచారం మొదలైంది. దీంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. కానీ ఈ వీడియో ఆధారంగా సీక్వెల్ అధికారికంగా ఖరారైందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు.
అదే సంభాషణలో ఎస్ఎస్ రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ గురించి కూడా కీరవాణి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో రాజమౌళి ప్రధానంగా మహేశ్ బాబుతో చేస్తున్న సినిమాపైనే దృష్టి పెట్టారని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ భారీ చిత్రం ‘వారణాసి’. ఇప్పటికే ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందువల్ల రాజమౌళి నుంచి వెంటనే ‘RRR 2’పై అధికారిక ప్రకటన వచ్చే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ‘RRR’లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ నేపథ్యంలో ‘RRR 2’పై ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.