Harish Rao | పత్తి, ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎండగట్టారు. మీ దుర్మార్గ పాలనలో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక పత్తి రైతు ఆవేదనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్టు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్ల రేపాక గ్రామానికి చెందిన రైతు జహంగీర్ ఆవేదన ఒక్కసారి వినాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సూచించారు. పత్తి కొనుగోళ్లు జరిపే విషయంలో సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమయ్యిందో చెప్పేందుకు ఇది మరో ఉదాహరణ అని చెప్పారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తే ముఖ్యమంత్రి, మంత్రులు నోరు పారేసుకోవడం తప్ప ఇప్పటివరకు చేసిందేమీ లేదని విమర్శించారు. పండించిన పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు.
‘ రెడ్ల రేపాక నుంచి మోత్కూర్‌లోని ఓ కంపెనీకి రెండు ట్రాక్టర్లలో పత్తిని తీసుకుపోయాను. అక్కడికి వెళ్లిన తర్వాత నీ పత్తి అవసరమే రాదు.. నీ పత్తి పనికిరాదు అని చెప్పారు. వాళ్ల కాళ్లను పట్టుకుని బతిమిలాడితే తెలిసిందేంటంటే.. మ్యాచర్ వేసే వాడికి రెండు వేలు అడుగుతున్నారు. లోపలికి వెళ్లిన తర్వాత రెండున్నర క్వింటాళ్ల పత్తిని కట్ చేసుకుంటున్నారు. నాకు అయిన పత్తి 28 క్వింటాళ్లు అయితే.. రెండున్నర క్వింటాళ్ల పత్తిని కట్ చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా.. అడుక్కు తినే ప్రభుత్వమా. మేం చిప్పపట్టుకుని వెళ్లాలా?’ అని రైతు జహంగీర్ ఆ వీడియోలో ఆవేదన చెందాడు.
ముఖ్యమంత్రి @revanth_anumula గారూ..
మీ దుర్మార్గ పాలనలో ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితి నెలకొంది.
యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, రెడ్ల రేపాక గ్రామానికి చెందిన రైతు జహంగీర్ ఆవేదన ఒక్క సారి వినండి.
పత్తి కొనుగోళ్లు జరిపే విషయంలో సీసీఐ, రాష్ట్ర… pic.twitter.com/4Czq9enlJV
— Office of Harish Rao (@HarishRaoOffice) November 23, 2025
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో హ్యాపీగా పంటను అమ్ముకున్నాం. కానీ ఇప్పుడు రెండు ట్రాక్టర్లలో పత్తి తీసుకెళ్తే.. ఒక్కటే బండి పత్తి తీసుకున్నారు.. ఇంకొకటి వాపసు పంపించారని రైతు తెలిపాడు. తన ఊరి నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్న ఈ కంపెనీకికు తీసుకురావడానికి ఒక్క ట్రాక్టర్‌కు రూ.10వేల ఖర్చు వచ్చిందన్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ల కాళ్లు పట్టుకున్నా పత్తిని కొనడం లేదని.. ఈ ఖర్చు ఎవరు భరించాలని ప్రశ్నించాడు. నేను పత్తిని ఎక్కడ అమ్ముకోవాలి.. నేనేమైనా దొంగనా? నేనేమైనా పాకిస్థాన్ నుంచి వచ్చానా? కాళ్లు పట్టుకున్నా కానీ కనికరించలేదని తెలిపాడు. ‘రెండు వేలు తీసుకున్నాక ట్రాక్టర్‌ను లోపలికి పంపించారు.. అందులో రెండున్నర క్వింటాళ్ల పత్తిని కట్ చేసిండ్రు.. ఇంకో ట్రాక్టర్‌ను కొనలేదు. ఈ పత్తిని నేనేం చేయాలి.. ఎక్కడ పెట్టాలని’ కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ కాళ్లు మొక్తా.. మీరే నాకు న్యాయంచేయండి అని మాజీ మంత్రి హరీశ్‌రావును విజ్ఞప్తి చేశారు.