Harish Rao | ప్రైవేటు ఆస్పత్రులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయకుండా ఆరోగ్య భద్రత ద్వారా పోలీసులకు అందించే వైద్య చికిత్సలను నిమ్స్ ఆసుపత్రికే పరిమితం చేయడం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. పోలీసుల జీతాల నుంచి ప్రతి నెలా ఆరోగ్య భద్రత కోసం డబ్బులు కట్ చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. వారికి సేవలు అందించడంలో మాత్రం తీవ్ర వివక్ష చూపిస్తోందని విమర్శించారు. నిత్యం ప్రజల భద్రత కోసం కృషి చేసే పోలీసులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యాన్ని దూరం చేసి, నిమ్స్ ఆస్పత్రికే పరిమితం చేయడం శోచనీయమని అన్నారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల, సకాలంలో వైద్యం అందక పోలీసు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్‌రావు తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో గుండెపోటుకు గురైన ఏఆర్ ఎస్సై జనార్దన్‌రావును ‘గోల్డెన్ అవర్’లో ఓ ప్రముఖ ప్రైవేటు దవాఖానకు తరలించినప్పటికీ.. పోలీసు ఆరోగ్య భద్రత కార్డు ద్వారా చికిత్సకు నిరాకరించడంతో సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పాలకులకు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని.. ఇది అత్యంత బాధాకరం, అమానవీయమని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో పోలీసు ఆరోగ్య భద్రత గాలిలో దీపంగా మారిందని హరీశ్‌రావు అన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షగా ఉండే పోలీసులకే రక్షణ కరువైన దిక్కుమాలిన పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది అని విమర్శించారు. ఆపత్కాలంలో ఆదుకునే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఆరోగ్య భద్రత పథకం లక్ష్యాన్ని నీరుగార్చుతుండటం హేయమైన చర్య అని అన్నారు. ఆంక్షలు, అరెస్టులతో నిత్యం పోలీసుల పహారా నడుమ పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి గారు.. ఇప్పుడు ఆ పోలీసుల జీవితాలతో చలగాటమాడటం దుర్మార్గమని మండిపడ్డారు. మీ రక్షణ కోసం వేల మంది పోలీసులను వాడుకుంటూ.. వారి కనీస హక్కులను కాలరాయడం మీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు.
ఎన్నికలకు ముందు ఏక్ పోలీస్ వ్యవస్థ తెస్తామని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి గారు.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారని హరీశ్‌రావు విమర్శించారు. తమ సమస్యలు పరిష్కరించాలని, హక్కుల కోసం రోడ్డెక్కిన పోలీసులనే అరెస్టు చేయించి జైలు పాలు చేయడం, సస్పెండ్ చేయడం మీ అహంకారానికి నిదర్శనం.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రశ్నించారు. ఒకపక్క వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని.. మరోపక్క పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవ్ డబ్బులు, టీఏలు, స్టేషన్ అలవెన్సులు రాక మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. పోలీసులంటే మీకెందుకంత కక్ష రేవంత్ రెడ్డి గారు అని నిలదీశారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య భద్రత బకాయిలన్నీ చెల్లించి, నిమ్స్ తో పాటు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్, టీఏలు వెంటనే చెల్లించాలని, స్టేషన్ అలవెన్సులు నెల నెలా విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.