హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందాల పోటీలపై మాత్రం రివ్యూల మీద రివ్యూలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పంటను అమ్ముకోవడానికి రైతులు 10-15 రోజులు కొనుగోలు కేంద్రాల్లో వేచి చూడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రికి అందాల రాశులు తప్ప ధాన్యం రాశులు పట్టవా? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేక వడదెబ్బతో ధాన్యం రాశులపైనే రైతులు ప్రాణాలు వదులుతున్నారని, ఇవి ముమ్మాటికీ కాంగ్రెస్ నిర్లక్ష్యంతో జరిగిన హత్యలేనని, రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు చనిపోతుంటే పట్టించుకోకుండా అందాల పోటీల మీద రివ్యూలు పెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి తీరు.. రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి పిఢేల్ వాయించినట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు.
ధాన్యం కొన్న 48గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని చెప్పారని, 10 రోజులైనా డబ్బులు ఖాతాల్లో జమకావడం లేదని మండిపడ్డారు. తాలు, తరుగు పేరుతో క్వింటాకు 10 కిలోలు కోత పెడుతున్నారని, ఈ దోపిడీని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేపడుతున్నారని గుర్తుచేశారు. యాసంగిలో సన్నాలకు రూ.512 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉన్నదని, కానీ ప్రభుత్వం ఐదు పైసలు కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. రైతుల పక్షాన త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్ దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు.
దేశం కోసం సరిహద్దుల్లో సైనికులు యుద్ధం చేస్తున్నారని, మరోవైపు రైతులు తమ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో యుద్ధం చేస్తున్నారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. కొన్న ధాన్యానికి 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రగల్భాలు పలికారని, పది రోజులైనా దికులేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్న వడ్లకు ప్రభుత్వం రూ.4 వేల కోట్లు రైతులకు బకాయి పడిందని మండిపడ్డారు. యాసంగిలో సన్నాలకు రూ.512 కోట్లు బోనస్ చెల్లించాల్సి ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తరుగు తియ్యబోమని రేవంత్ అన్నారని హరీశ్‌రావు గుర్తుచేశారు. కానీ, క్వింటాకు 10 కిలోల తరుగు తీస్తున్నారని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో జెట్టి రాజు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారని న్యూస్ క్లిప్పింగ్‌ను మీడియాకు చూపించారు.
కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం కనీస వసతులు కల్పించకపోవడం వల్ల రోజుల తరబడి ఎండలో పడిగాపులు కాయడం వల్ల రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని హరీశ్‌రా వు ఆవేదన వ్యక్తంచేశారు. రైతు డిమాండ్ల సాధనకు రైతులపక్షాన బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని హరీశ్ హెచ్చరించారు.
తాము ఆవేదనతో రైతుల సమస్యల గురించి మాట్లాడితే మంత్రి ఉత్తమ్ తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ మాట ప్రకారమే రాష్ట్రంలోని రైతాంగానికి రూ. 4వేల కోట్ల ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉన్నదని మంగళవారం ఎక్స్ వేదికగా గుర్తుచేశారు. 48 గంటల్లో ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి జాప్యం చేయడమెందుకని ప్రశ్నించారు. సన్నవడ్లకు చెల్లించాల్సిన రూ. 767 కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనే విషయాన్ని మంత్రి అంగీకరించినందుకు హరీశ్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.