Harish Rao | రైతు భరోసా డబ్బులు ఇంకెన్ని రోజులు వేస్తావని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు. పంట వేసేటప్పుడు ఇచ్చే రైతుబంధు.. పంటలు కోసే సమయానికి కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల కోడ్ అయిపోగానే రైతు భరోసా వేస్తా అన్నావ్ కదా.. ఏమైందని నిలదీశారు.
మొన్న సిద్దిపేట వస్తే నిలదీస్తారని సగం రైతుబంధు వేశారని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ వస్తుండని మరో సగం రైతుబంధు వేసిండని పేర్కొ్న్నారు. కేసీఆర్ ప్రశ్నిస్తే.. బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతుబంధు వేయరా అని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అయిపోగానే రైతుబంధు వేస్తామని చెప్పిండని గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకు రూ.2వేల కోట్లు మాత్రమే వేసిండని తెలిపారు. ఇంకా 4వేల కోట్ల రైతుబంధు వేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆరు నెలలైనా రైతుబంధు పూర్తిస్థాయిలో పడలేదని చెప్పారు. కేవలం మాటలు చెబుతూ రైతు భరోసా డ్రామా ఆడావని మండిపడ్డారు. మిగతా రైతు భరోసా ఎప్పుడిస్తావని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టులకు డబ్బులు ఉంటాయి కానీ రైతులకు ఉండవా అని నిలదీశారు.
కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు థ్యాంక్స్ చెప్పారు. మొన్నటిదాకా కాళేశ్వరం కుప్పకూలింది.. కూలేశ్వరం అయ్యిందని అన్నాడని గుర్తుచేశారు. నిన్ననేమో రెండు పిల్లర్లు కుంగాయని అన్నాడని పేర్కొన్నారు. రాష్ట్రంలో సూపర్ కరవు రాబోతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారని అన్నారు. అప్పుడే రేవంత్ రెడ్డికి సోయి వచ్చిందని అన్నారు. ఎల్‌నినో వస్తుందని ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిగెత్తుకెళ్లిండని అన్నారు. కాళేశ్వరం మల్టీ పర్సస్ ప్రాజెక్టు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాళేశ్వరంతో కోట్ల మందికి తాగునీరు ఇచ్చామని తెలిపారు.
కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజి మాత్రమే కాదని హరీశ్‌రావు తెలిపారు. 240 టీఎంసీల నీటిని వాడుకునే ప్రాజెక్టు కాళేశ్వరమని వివరించారు. రెండు పిల్లర్స్ కుంగితే ఎంత హడావిడి చేశారని మండిపడ్డారు. మూసీకి నీళ్లు తీసుకొస్తామని మల్లన్నసాగర్ దగ్గర కొబ్బరికాయ కొట్టింది కాళేశ్వరమే కదా అని అడిగారు. గంధమల్ల ప్రాజెక్టు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా అని తెలిపారు.
ఎల్లంపల్లి నీళ్లు మిడ్ మానేరుకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన పంపులను వాడితేనే నీళ్లు వస్తున్నాయని తెలిపారు. కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లు ఎలా వస్తున్నాయని అడిగారు. కాళేశ్వరంలో రేవంత్ రెడ్డికి A తెల్వదు.. B తెల్వదు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కాళేశ్వరం ఇన్ట్యాక్ట్ ఉందని నిన్నటితో తేలిపోయిందని తెలిపారు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి మాటలన్నీ బొంకుడు మాటలే అని అన్నారు.
2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని హరీశ్‌రావు తెలిపారు. ఎల్లంపల్లి శంకుస్థాపన చేసినప్పుడు తాను మంత్రిని అని గుర్తుచేశారు. ఆ శిలాఫలకంపై తన పేరు ఉందని తెలిపారు. అప్పుడు రేవంత్ రెడ్డి చెడ్డీలు వేసుకుని తన వెనకాల తిరిగిండని పేర్కొన్నారు. మళ్లీ తాను నీళ్ల మంత్రిగా అయినకం ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేశామని తెలిపారు. రూ.2100 కోట్లతో ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేశామని పేర్కొన్నారు. ఎస్సారెస్పీలో 50 ఏళ్లలో ఒక్కసారి కూడా 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందలేదని అన్నారు. 6 లక్షలకు మించి సాగునీళ్లు ఇవ్వలేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్సారెస్పీ కాల్వలను బాగు చేసి, 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు.