Harish Rao | రేవంత్ రెడ్డికి బూతులు.. ప్రతిపక్షాల మీద తిట్లపై ఉన్న సోయి రైతుల మీద లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డికి తిట్ల మీద ధ్యాస తప్ప.. పత్తి, మొక్క జొన్న రైతుల తిప్పలు కనపడటం లేదా అని ప్రశ్నించారు. యుద్ధప్రాదిపాదికన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ రైతులతో హరీశ్‌రావు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. అధిక వర్షాలు పడి ఇప్పటికే పత్తి రైతులకు దిగుబడి తగ్గి నష్టం వచ్చిందని.. ఉన్న పత్తిని కొనక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మరింత నష్టం చేస్తుందని తెలిపారు. పత్తి మద్దతు ధర 8వేల 100 ఉంటే ప్రభుత్వం కొనక దళారులకు రైతులు 5వేల 900 లకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం పత్తి రైతులకు క్వింటాలుకి 2వేల రూపాయలు నష్టం కలిగిస్తుందని అన్నారు.
రాష్ట్రంలో 6లక్షల ఎకరాలు మొక్క జొన్న సాగు జరిగిందని హరీశ్‌రావు తెలిపారు. మక్కలు మార్కెట్ లో పెట్టుకుని రైతులు పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 30%- 40% వరకు రైతులు దళారులకు అమ్ముకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర 2420.. దళారులకు అమ్ముకోవడం వల్ల క్వింటాలుకు 500 రూపాయలు నష్టం కలుగుతుందని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఎకరానికి రైతులకు రూ. 10వేలు నష్టం వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకాలంలో మక్కలు కొన్నామని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌లో మక్కలు చేతికి అందిన ఫలితం దక్కడం లేదని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాల మీద నోరు పారేసుకునుడే తప్ప రైతుల మీద పట్టింపు లేదని హరీశ్‌రావు విమర్శించారు. రెండు రైతుబంధులు ఇచ్చిండు… రెండు రైతుబంధులు ఎగ్గొట్టిండని మండిపడ్డారు. సగం ఋణ మాఫీ చేసిండు.. సగం రుణ మాఫీ ఎగొట్టిండని అన్నారు. కౌలు రైతులకు రుణమాఫీ చేస్తా అని మాట తప్పిండని పేర్కొన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఉండేదని.. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 3గంటల వరకే కరెంట్ ఇస్తున్నాడని తెలిపారు. రైతులకు 11 గంటల కరెంట్ మాత్రమే ఇస్తుండని అన్నారు. తొందరపడి పంటలను దళారులకు అమ్ముకోవద్దని రైతులకు సూచించారు. వెంటనే పత్తి, మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.