Harish Rao | పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాయని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కారు జోరుతో కాంగ్రెస్ బేజారయ్యారని ఎద్దేవా చేశారు. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో అధికార పార్టీ 90 శాతం గెలిస్తే.. పది శాతం ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయని తెలిపారు. కానీ బీఆర్ఎస్ 40 శాతం అంటే.. 4 వేలకు పైగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలిచారని అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఇవాళ సన్మాన కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని డబ్బులు పంచినా.. గుండాయిజం చేసినా అద్భుతంగా ఎదురించి గెలిచారని అన్నారు. గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి మందికి పుట్టిన బిడ్డను కూడా తన బిడ్డ అనే అంటాడని హరీశ్‌రావు విమర్శించారు. మనం గెలిచిన సర్పంచ్‌లను కూడా రేవంత్ రెడ్డి తన ఖాతాలోనే వేసుకుంటున్నాడని తెలిపారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ 35 గెలిస్తే 25 మాత్రమే గెలిచామని అంటున్నాడని మండిపడ్డారు. రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో నోబెల్ ప్రైజ్ ఇస్తే అది రేవంత్ రెడ్డికే వస్తుందని విమర్శించారు. నంబర్‌వన్ జూటాకోర్ అని ఎద్దేవా చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 50 శాతం లోపే గెలిస్తే.. 66 శాతం గెలిచామని బుకాయిస్తున్నాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 10, 12 స్థానాలకు మించి గెలవదని అన్నారు. ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ కావాలని ఎదురుచూస్తున్నారని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఎరువులు ఇచ్చే తెలివి ఉందా అని హరీశ్‌రావు మండిపడ్డారు. పంట పండాలంటే నీళ్లు, కరెంటు, ఎరువులు కావాలని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం యాప్‌లు, మ్యాప్‌లు కావాలంటున్నాడని అసహనం వ్యక్తం చేశారు. నీ ముఖానికి ఎప్పుడైనా వ్యవసాయం చేశావా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. కేసీఆర్ హయాంలో కరెంటు ఫుల్లు.. నీళ్లు ఫుల్లు, ఎరువులు ఫుల్లు అని అన్నారు. కానీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు. పోయిన యాసంగికి బోనస్ ఎగ్గొట్టారని.. రెండు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో సకాలంలో ఎరువులు ఇచ్చామని గుర్తుచేశారు. రైతుల గ్రామాల్లోకి ఎరువుల లారీలు పంపించామని అన్నారు. యూరియా ఇవ్వడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని విమర్శించారు.
ఏడాదిన్నర నుంచి జిల్లా పరిషత్‌లకు, మున్సిపాలిటీలు, కోఆపరేటివ్ సంస్థలకు ఎన్నికలు పెట్టడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. రైతులు తిరగబడతారని రేవంత్‌కు అర్థమైందని.. అందుకే ఎన్నికల జోలికి వెళ్లడం లేదని అన్నారు. బీఆర్ఎస్ సర్పంచ్‌లను గెలిపిస్తే నిధులు ఆపేస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో చేసిన ప్రచారంపైనా హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం 85 శాతం నిధులు ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా వస్తాయని తెలిపారు. ఆ నిధులను మధ్యలో రేవంత్, మంత్రులు ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి డబ్బులు డైరెక్ట్‌గా సర్పంచ్ అకౌంట్లలోకి వస్తాయని చెప్పారు. సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదని.. మంత్రికి చెక్‌పవర్ లేదని.. ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదని.. కానీ గ్రామ సర్పంచ్‌కు చెక్‌పవర్ అని తెలిపారు. ధైర్యంగా పనిచేయండి.. త్వరలో గెలిచిన సర్పంచ్‌లకు శిక్షణా కార్యక్రమాలు పెడతామని తెలిపారు. సర్పంచ్ విధివిధానాలు, బాధ్యతలపై ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడదామని చెప్పారు. ఏమున్నా రెండేళ్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని.. మీరు ఐదేళ్ల కోసం సర్పంచ్‌గా గెలిచారని తెలిపారు. మీ పదవీకాలంలో మళ్లీ మూడేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉంటారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన పనులు వీలైనంత వరకు చేయండని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే నేను దగ్గరుండి మీ పనులు చేయించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు సూచించారు. తలలో నాలుకలా ఉండాలని.. ఓడిపోయిన వారికి భవిష్యత్ ఉంటదని పేర్కొన్నారు. గెలిచిన వారికి బాధ్యత ఉంటుందని చెప్పారు. ఎదిగినకొద్దీ ఒదగాలి.. ఓపికతో ఉండాలన్నారు. నిన్నటి వరకు దండం పెట్టి ఓటు అడిగి గెలువంగనే మారిపోకూడదని సూచించారు.
రేవంత్ రెడ్డి మందికి పుట్టిన బిడ్డను కూడా తన బిడ్డనే అంటాడు
మనం గెలిచిన సర్పంచ్‌లు కూడా రేవంత్ రెడ్డి ఆయన ఖాతాలోనే వేసుకున్నాడు
సంగారెడ్డిలో మనం 35 గెలిస్తే 25 మాత్రమే గెలిచామని అంటున్నాడు – హరీష్ రావు pic.twitter.com/7hywtqp3nI
— Telugu Scribe (@TeluguScribe) December 20, 2025