Harish Rao | కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు చేయడంలో పోలీసుల జాప్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టిందని ఆయన ప్రశ్నించారు.
బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదై.. 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం వేరే ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Bandi Sai Bageerath
బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేయాలని బీఆర్ఎస్వీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముందు ఆదివారం మెరుపు ధర్నా చేశారు. అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్‌ను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను పలువురు మహిళలు ముట్టడించారు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.