కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు ఆ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలు బీసీ కోటాపై ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడంలేదు. ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న రాహుల్‌గాంధీ పార్లమెంట్లో ఎందుకు ఆ అంశాన్ని లెవనేత్తడంలేదు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు మిన్నకుంటున్నారో చెప్పాలి.
– హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తేతెలంగాణ): ‘బీసీ కోటా సాధించే విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి. కేంద్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన ఆ రెండూ ఒక్కటైతే బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకునేదెవరు? ఢిల్లీలో కొట్లా డాల్సిన ఆ పార్టీలు గల్లీలో నాటకమాడుడెందుకు? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ‘ఎక్కడికెళ్లినా జిత్నా ఆబాదీ.. ఉత్నా హక్’ అని నినదించే రాహుల్‌గాంధీ పార్లమెంట్లో ప్రైవేట్ బీసీ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్లో బీజేపీకి 240 మంది, కాంగ్రెస్‌కు 99 మంది ఎంపీల బలం ఉన్నదని.. ఆ రెండు పార్టీలు ఏకమైతే బీసీ రిజర్వేషన్ల పెంపు ఎందుకు సాధ్యం కాదని శనివారం ఎక్స్ వేదికగా నిలదీశారు.
బలహీనవర్గాల అభ్యున్నతిపై చిత్తశుద్ధిలేని ఆ రెండు పార్టీలూ ఆ వర్గాలపై కపటప్రేమను కనబరుస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఆరుసార్లు జనాభా గణన చేసిన కాంగ్రెస్.. ఏనాడూ బీసీ గణన చేయలేదని గుర్తుచేశారు. బీజేపీ ఏకంగా నాలుగేళ్లుగా జనగణనను వాయిదా వేస్తూ వస్తున్నదని విమర్శించారు. గడిచిన 35 ఏండ్లలో పాలిస్తూ వచ్చిన ఆ రెండు పార్టీలకు ఏనాడూ బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.
ఏనాడూ బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్లు పెంచాలనే ఆలోచన చేయని ఆ పార్టీలు.. నేడు బలహీనవర్గాల ఓట్ల కోసం, రాజకీయ లబ్ధికోసం నాటకాలాడుతున్నాయని ధ్వజమెత్తారు. ఢిల్లీలో పోరాటాన్ని పక్కనబెట్టి గల్లీలో డ్రామాలను రక్తి కట్టిస్తున్నాయని తూర్పారబట్టారు. రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపును సాధించాల్సిందిపోయి కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా గల్లీలో డ్రామాలను కట్టిపెట్టి ఢిల్లీలో పోరాటం మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. వారి పోరాటానికి, పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు చట్టబద్ధతకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.
బలహీనవర్గాల అభ్యున్నతికి నాడు సీఎంగా కేసీఆర్ చిత్తశుద్ధితో ప్రయత్నించారని హరీశ్‌రావు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించిన ఘనత ఆయనకే దక్కిందని పేర్కొన్నారు. 2005లోనే కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఉండాలని కోరిన దేశంలోనే ఏకైక నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. అయినా ఇన్నేండ్లుగా ఢిల్లీలో అధికారం వెలగబెడుతున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఆయా అంశాలపై చలనమే లేదని విమర్శించారు.