హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : పరీక్షల నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. వరుసగా ప్రశ్నపత్రాల లీక్‌లతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశా రు. ప్రభుత్వ అసమర్థత, అవినీతి వ్యవహారానికి విద్యార్థులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నాడు ఓట్ల కోసం నిరుద్యోగులకు సాధ్యంకాని హామీలు గుప్పించిన కాంగ్రెస్ నేడు గద్దెనెక్కిన తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వడం, పరీక్షల నిర్వహణ లో విఫలమైందని దుయ్యబట్టారు.
ఆచా ర్య జయశంకర్ తెలంగాణ అగ్రి యూనివర్సిటీలో పరీక్షపత్రాల లీక్ ఘటన సర్కారు చేతగానితనానికి నిదర్శనమని విరుచుకుపడ్డారు. మొన్నటి పీజీ వైద్య విద్య పరీక్షల్లో బట్టబయలైన మెడికల్ స్కామ్ మరువకముందే, ఇవ్వాళ అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నపత్రాలు వాట్సాప్ ద్వారా లీక్ చేసి, ఏఐ పెన్లతో రాసిన మోడ్రన్ స్కాం యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నదని పేర్కొన్నారు. ‘ఇంత బహిరంగంగా, అక్రమంగా పరీక్షలు జరుగుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కొందరు అక్రమార్కులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంటే సర్కార్ మొద్దునిద్రలో ఎందుకున్నట్టు?’ అని దుయ్యబట్టారు.
మార్పు తె స్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రశ్నపత్రాల లీకులే తెచ్చినా మార్పా..? అని నిలదీశారు. రెండేండ్లలోనే కాంగ్రెస్ సర్కార్ స్కామ్‌లకు చిరునామాగా మార టం, విద్యాసంస్థలు అవినీతికి కేంద్రాలుగా మారటం దురదృష్టకరమని ఎద్దేవా చేశా రు. ‘మహాకవి శ్రీశ్రీ కాదేది కవితకు అన ర్హం అని చెబితే, రేవంత్‌రెడ్డి కాదే దీ స్కామ్ కు అనర్హం అని చెబుతున్నారు..’ అని చురకలంటించారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం, పరీక్షలను సక్రమంగా నిర్వహించడం చేతగాని ప్రభుత్వమని నిప్పులు చెరిగారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.