హుజూరాబాద్/జమ్మికుంట, జూన్ 12: సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను అరిగోస పెడుతున్న హిట్లర్ అని, ఆయన పాలన అంతా అబద్ధాలమీదనే నడుస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు. తన విలాసాలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మాత్రం పైసల్లేవని చెప్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటికీ ఎగనామం పెడుతున్నాడని ఆరోపించారు. ‘రేవంత్.. నీ హిట్లర్ పాలనను అంతం చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నరు. నిన్ను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్’ అని హెచ్చరించారు. తెలంగాణ బాగుపడాలంటే ‘రేవంత్ పోవాలె.. కేసీఆర్ మళ్లీ రావాలె’ అని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్లో శుక్రవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు. అనంతరం బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సభ్యత్వ నమోదు, ‘సర్’ నమోదు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా మాజీ మంత్రులు హరీశ్‌రావు, జీవన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికార మత్తులో ఉన్నాడని, ఆయన తన విలాసాలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడని దుయ్యబట్టారు. అందాల పోటీలకు, మెస్సీతో ఫుట్‌బాల్ సోకుకు, ఎయిర్ బస్ హెలికాప్టర్‌కు, ఇతర రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి, అక్కడ ఎన్నికలు జరిగితే తెలంగాణ డబ్బులతో ఫుల్ పేజీ అడ్వైర్టెజ్మెంట్లకు డబ్బులుంటాయని విమర్శించారు. కానీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, రైతు బీమా, ఆసరా పింఛన్ల పెంపునకు డబ్బులు ఉండవా? అని ప్రశ్నించారు.
‘జూబ్లీహిల్స్‌లో పెద్ద ప్యాలెస్ ఉన్నా అది చాలదని రూ.వందల కోట్లు పెట్టి క్యాంప్ ఆఫీస్ కట్టాడు. ఫ్యూచర్ సిటీలో మరోటి కడుతున్నాడు. ఇప్పుడున్న హెలికాప్టర్ సరిపోదని రూ.5కోట్లు పెట్టి కొత్తది కొంటాడట’ అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనంటేనే కరప్షన్.. కమీషన్ పాలనగా సాగుతున్నదని దుయ్యబట్టారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రైతులకు 24గంటల విద్యుత్తు సరఫరా ఉండేదని, ఇప్పుడు కోతల ప్రభుత్వంతో అన్నదాతలను ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. రైతు డిస్కమ్ తెచ్చి 6గంటలకే పరిమితం చేసేలా ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రేవంత్ డిపాజిట్ గల్లంతేనని, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వంపై కొట్లాడుతున్న కౌశిక్‌రెడ్డిపై కేసులు పెడుతున్నారని, అలాంటి కేసులకు భయపడేది లేదని కార్యకర్తలకు అభయమిచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం, మల్లన్నసాగర్, తదితర ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు నీరందిస్తున్నదని తెలిపారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, పంటకు నీరిచ్చిందీ లేదని ధ్వజమెత్తారు. సమావేశంలో కమలాపూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పలువురు బీఆర్ఎస్లో చేరగా హరీశ్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీశ్‌బాబు, సభ్యత్వ నమోదు ఇన్చార్జి రాకేశ్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బండ శ్రీనివాస్, పింగిళి రమేశ్, జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్, వీణవంక, ఇల్లందకుంట మండలాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఉద్యమ నేత కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం. తెలంగాణకు ఆయనే శ్రీరామరక్ష. నా నలభై ఏండ్ల రాజకీయం జీవితంలో ఎన్నో చూసిన. కేసీఆర్ గొప్ప నాయకుడు. పోరాడి తెలంగాణ తెచ్చిన ఉద్యమనేత. కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్జాతీయ స్థాయిలో కట్టిండు. దేశానికే వన్నె తెచ్చిన ప్రాజెక్టు అది. లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తున్నది. కేసీఆర్ ప్రాజెక్టులు చరిత్రలో నిలిచిపోతయ్. కుంగిన మేడిగడ్డ పిల్లర్లకు సీఎం రేవంత్‌రెడ్డి మరమ్మతులు చేయిస్తలేడు. కేసీఆర్‌ను దోషిగా చూపేందుకు చూస్తున్నడు.
– జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి