హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మెదడులో విషం తప్ప విజన్ లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెలు లేని పాలన తెస్తానని చెప్పి..ఆంక్షల పాలన తెచ్చాడని, 11 నెలల్లో అన్ని వర్గాలను మోసం చేసి పీడిత పాలన సాగిస్తున్నాడని, గ్యారెంటీలు అమలు చేయాలని అడిగిన పాపానికి ప్రతిపక్షాలను నోటికొచ్చినట్టు తిడుతున్నడని రేవంత్ తీరుపై నిప్పులు చెరిగారు. ఏ వర్గానికీ ఇచ్చిన హామీలు నెరవేరక వారంతా రోడ్డెక్కడంతో రాష్ట్రం ఆందోళనలతో అట్టుకుడుతున్నదని చెప్పారు. కేసీఆర్ మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాలను కూడా అటకెక్కించారని మండిపడ్డారు. రైతుబంధు ఎగ్గొట్టి, బోనస్‌ను బోగస్ చేసి, పత్తికి మద్దతు ధర ఇవ్వకుండా రైతులను దగాచేశారని, రాష్ర్టాన్ని దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శాసనమండలిలో ప్రతిపక్షనేత మధసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజు, ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్యతో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలకు బతుకమ్మ చీరలు, పంటలకు మద్దతు ధర ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. పత్తి క్వింటాల్‌కు రూ.7521 ఎమ్మెస్పీ ఇవ్వకపోవడంతో రూ. 5 వేలకే దళారులకు రైతులు తెగనమ్ముకుంటున్నారని, మక్కను కొనే దిక్కులేదని, కొనుగోలు చేసిన సోయాబీన్‌ను సైతం వాపస్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
పత్తి కొనాలని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలో రైతులు రోడ్డెక్కిన ఘటనలు, ఆదిలాబాద్‌లో కలెక్టర్ కాళ్లమీద పడిన దుస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని చెప్పారు. ‘నాడు కేసీఆర్ రెండు పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుబంధు ఇస్తే మూడు పంటలకు కలిపి ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని పొంకణాలు కొట్టిన రేవంత్‌రెడ్డి..ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి’ అని నిలదీశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే, రేవంత్‌రెడ్డి వారి పొట్టగొడుతున్నారని ధ్వజమెత్తారు.
ఏటా లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు, ఏడాది సమీపిస్తున్నా 20 వేల జాబ్లకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను నట్టేట ముంచిందని హరీశ్ ఫైర్ అయ్యారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి అశోక్‌నగర్ వెళ్లి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నిరుద్యోగుల వీపులపై లాఠీలతో విరుచుకుపడి అశోక్‌నగర్‌ను శోకనగర్గా మార్చిందని దుయ్యబట్టారు. విద్యార్థులకు భరోసా కార్డులిస్తామని, క్రమం తప్పకుండా రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పుడు మొద్దునిద్ర నటిస్తున్నదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ డీఏలు, ఆరునెలల్లోగా పీఆర్సీ ఇస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చి గతంలో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని కేసీఆర్ మంజూరు చేసిన డీఏనే ఇప్పుడు విడుదల చేసి దీపావళి పండుగ చేసుకొమ్మనడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. పీఆర్సీ విషయంలో ఉలుకూపలుకూ లేదని విమర్శించారు. రిటైర్డ్ అయిన అంగన్వాడీలు, ఉద్యోగులకు పైసా ఇవ్వని ఏకైక ప్రభుత్వం ఇదేనని ఎద్దేవాచేశారు.
11 నెలల్లోనే రేవంత్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని, పాలనపై అవగాహన లేక రాష్ర్టాన్ని దివాలా తీయించారని, ఈ పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్‌కు రేవంత్‌రెడ్డి తెరలేపారని హరీశ్ మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలను ఎండగడుతున్న కేటీఆర్‌పై సీఎం కక్షగట్టారని, పోరాటం చేస్తున్న కేటీఆర్‌ను నిలువరించేందుకు ఆయన కుటుంబాన్ని బద్నాం చేసే కుట్రకు పూనుకున్నారని దునుమాడారు. దీపావళి సందర్భంగా కేటీఆర్ బంధువులు ఫంక్షన్ చేసుకుంటే రేవ్ పార్టీగా చిత్రీకరించి మానసిక క్షోభకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని, రేవ్ పార్టీ అయితే 70 ఏండ్ల వయస్సున్న కేటీఆర్ అత్త, రెండు మూడేండ్ల చిన్నపిల్లలు ఎందుకు ఉంటారని నిలదీశారు. రైడ్ చేసిన అధికారులు అక్కడ ఏమీ దొరకలేదని చెప్పడం నిజంకాదా? అని ప్రశ్నించారు.
‘నేను పోలీసు కుటుంబం నుంచే వచ్చిన.. అధికారంలోకి రాగానే ఏక్ పోలీసింగ్ తెస్తా.. వారానికో సెలవు మంజూరు చేస్తా అని అరచేతిలో స్వర్గం చూపిన రేవంత్‌రెడ్డి.. 11 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదు’ అని హరీశ్ నిలదీశారు. న్యాయం కోసం రోడ్డుమీదికొచ్చిన పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబాలను పోలీసులతోనే అరెస్ట్ చేయించడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులనే పోలీసులు కొట్టే దుస్థితి తెలంగాణలో నెలకొనడం దురదృష్టకరమన్నారు. తమకు ఇంటి పని చెప్తున్నారని ఇటీవల ఓ కానిస్టేబుల్ ఎస్పీ కాళ్ల మీద పడిన ఘటన చూస్తే కన్నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తంచేశారు. సెలవులివ్వాలని అడిగిన పాపానికి 39 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం, మరో పది మందిని ఉద్యోగాల నుంచి తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తెలంగాణలో రక్షక భటులకే రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.
కాంగ్రెస్ సర్కారు అరాచక పాలనపై బీఆర్ఎస్ పోరాడుతుంటే బీజేపీ చోద్యం చూస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. సమస్యలపై ఆ పార్టీకి చెందిన బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీయకుండా నాటాకాలడుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని మంత్రులే కూల్చుతారని సంజయ్ చెప్పడం చూస్తుంటే కుమ్మక్కు రాజకీయం స్పష్టంగా తెలిసిపోతున్నదని ఎద్దేవాచేశారు. ‘రేవంత్ తానా అంటే సంజయ్ తందాన అంటున్నడు. సంజయ్ వైఖరి చూస్తుంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిలా లేడు. రేవంత్ సహాయ మంత్రిలా పనిచేస్తున్నడు’ అని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఉపాధిహామీ కింద వచ్చిన రూ.500 కోట్లు, హెల్త్‌మిషన్ కింద వచ్చిన రూ. 300 కోట్లు ఎక్కడికి పోయాయని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని హితవు పలికారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో ఆర్ఎస్ బ్రదర్స్ పాలన సాగుతున్నదనే విషయం స్పష్టమవుతున్నది చెప్పారు. రామన్నపేట వద్ద అంబానీ సిమెంట్ ఫ్యాక్టరీని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంటే, బీజేపీ నాయకులు మౌనంలో ఆంతర్యమేంటని నిలదీశారు.
మూసీ శుద్ధీకరణ ప్రాజెక్టును కేసీఆరే ప్రారంభించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. 31 ఎస్టీపీలు నిర్మించి మూసీలో మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. కొండపోచమ్మసాగర్ నుంచి గోదావరి జలాలు తెచ్చి నింపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కానీ రేవంత్ ఇదేదో తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. ఢిల్లీకి డబ్బు మూటలు పంపేందుకే మూసీని తెరపైకి తెచ్చారని, ఈ ప్రాజెక్టు పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తామంటే ఊరుకోబోమని, అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వం భేషజాలకు పోకుండా టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పరిషరించాలని, 10 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ, 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకొని వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరితే 10 మంది కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించడం హేయమైన చర్య అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘నేను పోలీసు కుటుంబం నుంచి వచ్చిన. పోలీసుల కష్టాలు నాకు తెలుసు. ఇంట్లో భార్య, బిడ్డలు పడే బాధ నాకు తెలుసు’ అంటూ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఊదరగొట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కరశంగా వ్యవహరిస్తున్నారని, అధికారం లేకుంటే ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ఏంటని ప్రశ్నించారు.