హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి రోజే బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఇండ్లను కూల్చివేయడం దారుణమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇది ఫూలే ఆత్మను అవమానించే చర్య అని మండిపడ్డారు. ప్రజాపాలన పేరుతో పేదల ఇండ్లను కూల్చివేయడం, మహిళలు, చిన్నారులను నడిరోడ్డు మీద నిలబెట్టడం.. ఇదేనా కాంగ్రెస్ ప్రజా పాలనా? అని నిలదీశారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి, బడుగు, బలహీన వర్గాలపై దాడులు జరుపడం, వారికి నీడ లేకుండా చేయడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం, వారిలో భయం నింపేలా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. రోజూ రాజ్యాంగ పరిరక్షణ అని మాట్లాడుతుంటే, వారి ముఖ్యమంత్రి ఆచరణలో మాత్రం రాజ్యాంగ భక్షణ చేస్తున్నాడని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడం కాదు రాహుల్ గాంధీ.. దాని విలువలను ప్రజల జీవితాల్లో అమలు చేయడం ముఖ్యమని హితవు పలికారు.
నిరుపేదల ఇండ్లను శని, ఆదివారాల్లో కూల్చడం, రాజ్యాంగ ఆత్మకు తూట్లు పొడిచినట్టు కాదా..మిస్టర్ రాహుల్‌గాంధీ? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ అమానుష చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. బాధితులకు తక్షణ న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు.