హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తేతెలంగాణ): ‘కేసీఆర్ పదేండ్ల పాలనలో సుభిక్షంగా విలసిల్లిన తెలంగాణ.. కాంగ్రెస్ 20 నెలల పాలనలో అస్తవ్యస్తమైంది. నాడు అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచింది. కానీ, హస్తం పార్టీ అసమర్థ విధానాలతో రాష్ట్రంలో నేడు దుర్భిక్షం నెలకొన్నది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఎన్నారై యూకే బీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో లండన్‌లో నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సమైక్య పాలనలో తెలంగాణ పరిస్థితులు, కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోదాహరణంగా వివరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. 14 ఏండ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ.. కేసీఆర్ పదేండ్ల పాలనలో అనేక అద్భుతాలు సృష్టించిందని ఉద్ఘాటించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, తలసరి విద్యుత్తు వినియోగంలోనూ రికార్డు సృష్టించిందని చెప్పారు. జీఎస్డీపీ అభివృద్ధిలో తెలంగాణకు దరిదాపుల ఏ రాష్ట్రం కూడా లేదనే విషయాన్ని గుర్తుచేశారు.
ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు
మ్యానిఫెస్టోలో చెప్పిన పథకాలతోపాటు చెప్పని వాటిని సైతం అమలుచేసిన గొప్ప నేత కేసీఆర్ అని హరీశ్‌రావు ప్రశంసించారు. ఇంటింటికీ నల్లానీరు ఇవ్వకుంటే ఓట్లడగనని చెప్పి.. ఆచరణలో చేసి చూపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. మిషన్ భగీరథ స్ఫూర్తితో కేంద్రం ప్రారంభించిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పదేండ్లయినా పూర్తికాలేదని.. హర్ ఘర్ జల్ కల సాకారంకాలేదని ఉదహరించారు.
ఏడాదిలోనే 24 గంటల కరెంట్
ఉమ్మడి రాష్ట్రంలో ఎండాకాలం వచ్చిందంటే హైదరాబాద్‌లో పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇచ్చేవారని హరీశ్‌రావు గర్తుచేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 24 గంటల కరెంట్ ఇచ్చి శాపనార్థాలు పెట్టిన అనాటి సీమాంధ్ర నేతల నోర్లు మూయించారని పేర్కొన్నారు. ‘ఆయన ఉదయం నిద్రలేచిన వెంటనే పవర్‌పై సమీక్షించే వారు. విద్యుత్తు కొనుగోలు టైమ్‌ని చూసేవారు. తర్వాత మిషన్ భగీరథ పురోగతిని తెలుసుకొనేవారు. అంకితభావం, అకుంఠిత దీక్షతో పనిచేయడంతోనే తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమించింది..’ అని గుర్తుచేశారు.
దేశం దృష్టిని ఆకర్షించిన మిషన్ కాకతీయ
సమైక్య రాష్ట్రంలో విధ్వంసానికి గురైన చెరువులను మరమ్మత్తు చేసుకొనే సంకల్పంతో మిషన్ కాకతీయ పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారని హరీశ్‌రావు చెప్పారు. ఈ స్కీం కింద 30 వేల చెరువులను పునరుద్ధరించి ఆయకట్టు భూములకు సాగునీరు అందించామని గుర్తుచేశారు. భూగర్భ జలాలు సైతం పెరగడంతో అన్నదాతకు సాగు గోస తప్పిందని చెప్పారు.
భవిష్యత్తు తరాల కోసం హరితహారం
దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనివిధంగా కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణకు హరితహారం పథకాన్ని ప్రారంభించారని హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏకంగా 7.7% గ్రీన్‌కవర్‌ను పెంచి దేశంలోనే తెలంగాణను నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు.
ఆశ పెట్టి గోసపెడుతున్న కాంగ్రెస్
అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పాలన చేతగాక ప్రజలను అరిగోస పెడుతున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. అద్భుతాలు చేస్తామని చెప్పి అవినీతి పాలన తెచ్చారని ధ్వజమెత్తారు. పంచాయతీ కార్యదర్శుల బాధలు చూస్తేనే కాంగ్రెస్ గొప్పదనం తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు. ‘ఒకరోజూ నా దగ్గరికి పంచాయతీ కార్యదర్శులు వచ్చి అష్టకష్టాలు పడుతున్నామని, బిల్లులు రాక అప్పుల పాలమయ్యామని, ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంలో మీకు ఉద్యోగాలెవరిచ్చారు? చెక్ పవర్ ఎవరిచ్చారు? అని అడిగితే కేసీఆర్ అని..ఒకేసారి 10,000 మందికి జాబ్‌లు ఇచ్చారని చెప్పారు. మరి ఎందుకు ఓడించారని ప్రశ్నిస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది. బాగానే చేశారు.. కానీ, వాళ్లు(కాంగ్రెస్) ఇంకా బాగా చేస్తరని నమ్మినం.. కానీ ఇప్పుడు పాలేవో నీళ్లేవో తెలుస్తున్నది.. పొరపాటు చేశామని చెప్పిన్రు’ అని హరీశ్‌రావు వివరించారు. ‘రాష్ట్రం రాకముందు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనుక్కొనే పరిస్థితి ఉండేది. కేసీఆర్ వచ్చిన తర్వాత రివర్స్ అయింది. కానీ, మళ్లీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. సమైక్య పాలనలోని పరిస్థితులు కనిపిస్తున్నాయి..ఎకరానికి రూ.10 లక్షలు కూడా పలకడం లేదు’ అని పేర్కొన్నారు. పాలకుడికి పాజిటివ్ ధోరణిలేకపోవడంతో సుసుంపన్నమైన తెలంగాణ అధోగతి పాలవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అవినీతి పెచ్చరిల్లుతున్నదని, ఏ శాఖలో చూసినా జడలు విప్పుతున్నదని విమర్శించారు.
కాళేశ్వరంపై దుష్ప్రచారం
తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడిచే లక్ష్యంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు దుష్ప్రచారం చేస్తున్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. చిన్న లోపాన్ని సాకుగా చూపి రూ.లక్ష కోట్లు గంగలో కలిశాయని తప్పుదోవ పట్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం కూలిపోయిందని దుష్ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి..మరోవైపు మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు ఇస్తామనడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. ‘మల్లన్నసాగర్ కాళేశ్వరంలో భాగమని తెలియదా? లేదంటే బుకాయిస్తున్నారా? కాళేశ్వరం కూలిపోతే గోదావరి నీళ్లు మూసీకి ఎలా తరలిస్తారు. రూ.700 కోట్లతో టెండర్లు ఎందుకు పిలిచారు?’ అని ప్రశ్నించారు. 20 నెలల పాలనలో వట్టెం పంప్‌హౌస్ మునిగిపోయిందని, పెద్దవాగు కొట్టుకుపోయిందని, ఎస్ఎల్బీసీ, సుంకిశాల కూలిపోయాయని చెప్పారు. వాటిని విస్మరించి బీఆర్ఎస్ను బద్నాం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కాళేశ్వరంలోని అన్ని కంపొనెంట్లు మనుగడలో ఉన్నాయని, కేవలం మేడిగడ్డకు రూ.350 కోట్లు వెచ్చిస్తే మరమ్మతు పూర్తవుతుందని తెలిపారు. ఇప్పటికైనా దుష్ప్రచారం ఆపి రైతులకు నీరందించాలని డిమాండ్ చేశారు.
రైతుబంధుతో సాగులో సమూల మార్పులు
దేశానికి అన్నంపెట్టే రైతుల అభ్యున్నతిని కాంక్షించి కేసీఆర్ రైతుబంధును తెచ్చారని హరీశ్‌రావు వివరించారు. ఏటా ఎకరాకు రూ.10 వేల ఇన్‌ఫుట్ సబ్సిడీ, 24 గంటల ఫ్రీ కరెంట్‌తో సాగు సుసంపన్నమైందని, రైతుల జీవితాలు బాగుపడ్డాయని చెప్పారు. 2014కు ముందు రాష్ట్రంలో ఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల ధర మాత్రమే పలికేదని, కానీ ప్రస్తుతం తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లోనూ ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలకు తక్కువలేదని వెల్లడించారు. రైతుబంధును కేంద్రం కాపీ కొట్టి పీఎం కిసాన్యోజనను ప్రారంభించిందని తెలిపారు.
మీట్ అండ్ గ్రీట్ విత్ హరీశ్‌కు భారీ స్పందన
ఎన్నారై బీఆర్ఎస్ యూకే సెల్ అధ్యక్షుడు నవీన్‌రెడ్డి, ముఖ్య నేతలు రవిప్రదీప్, సురేశ్ గోపతి ఆధ్వర్యంలో వెస్ట్ లండన్‌లో శుక్రవారం నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్ విత్ హరీశ్‌రావు’కు విశేష స్పందన లభించింది. వేలాదిమంది హరీశ్‌రావు అభిమానులు, తెలంగాణవాదులు తరలివచ్చారు. ముందుగా అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్, అమరవీరుల స్తూపం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హరీశ్‌రావు రాజకీయ ప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే బాధ్యులు సీక చంద్రశేఖర్‌గౌడ్, హరిగౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, రవికుమార్ రేటినేని, అశోక్‌గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల, గణేశ్ కుప్పాల, శ్రీకాంత్ జెల్ల, దొంతుల వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్ వీర, మధుసూదన్‌రెడ్డి, మల్లారెడ్డి, అబూ జాఫర్, సురేశ్ బుడగం, సత్యపాల్‌రెడ్డి, రమేశ్ ఇస్పంపల్లి, శ్రీధర్‌రావు, నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్‌రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, ప్రశాంత్ మామిడాల, అంజన్‌రావు, తరుణ్, పవన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.