హైదరాబాద్: ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ (BRS) పోరుబాట పట్టింది. ఎన్నికల హామీల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు ఆ హామీ ఊసే ఎత్తలేదు. దీనికితోడు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టింది. దీంతో ఆటో నడవక ఆర్థిక సమస్యలతో సతమవుతున్న డ్రైవర్ల జీవితాలు రోజురోజుకి దయనీయంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో భాగంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కోకాపేటలోని తన నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు, అక్కడి నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల బతుకులను కాంగ్రెస్ నిండా ముంచిందన్నారు. ఆటో కార్మికులకు రూ.24 వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.1500 కోట్లు బాకీ పడిందని, ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలన్నారు. ఆటో కార్మికులకు పైసలు ఇవ్వకుండా ఢిల్లీకి మూటలు పంపుతున్నాడని విమర్శించారు. ఆటో కార్మికులను పట్టించుకోకుండా మంత్రులు వాటాల కోసం తన్నుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఆటోలో తిరిగి కార్మికులను ఉద్ధరిస్తామన్నారు. ఆటో కార్మికుల సమస్యలు తీర్చాలనే సోయి రాహుల్ లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల బీమా రూ.10 లక్షలకు పెంచాలన్నారు.
ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు ఆటోలో ప్రయాణించిన హరీష్ రావు
తన నివాసం నుండి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు, అక్కడినుండి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించిన హరీష్ రావు pic.twitter.com/8341V1O0C3
— Telugu Scribe (@TeluguScribe) October 27, 2025