Harish Rao | రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చారు.. కానీ రేవంత్ పాలన అంత తుస్సే అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో హరీశ్‌రావు పర్యటించారు. చెల్లాపూర్ వార్డులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌ను రేవంత్ తిడుతున్నాడని హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చి అభివృద్ధి పథకాలు అమలు చేయడం కేసీఆర్ తప్పా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ను తిడితే ఓట్లు రావని.. పథకాలు అమలు చేస్తే వస్తాయని హితవుపలికారు. బూతులు మాట్లాడే రేవంత్‌కు పోలింగ్ బూత్‌లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పంద్రాగస్టుకల్లా రుణమాఫీ పూర్తి చేస్తానని దేవుళ్లపై రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టిండని హరీశ్‌రావు గుర్తుచేశారు.
మెదక్ రావాలంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని హరీశ్‌రావు అన్నారు. అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డి ఉమ్మడి మెదక్‌కు వచ్చేందుకు ముఖం లేదని విమర్శించారు.ఇక్కడ హరీశ్‌రావు ఉన్నాడని భయపడుతున్నాడని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, గారడీలపై మెదక్ ప్రజలు నిలదీస్తారని ఇటువైపు చూడటం లేదని పేర్కొన్నారు. మెదక్‌లో రేవంత్ రెడ్డి ఒక్క వార్డులో కూడా గెలవడని తెలిపారు. రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ లేదు కానీ.. స్కామ్ క్యాలెండర్ అయితే ఇచ్చిండని విమర్శించారు. ప్రతి నెల ఏదో ఒక కుంభకోణం తెరపైకి తీసుకొచ్చాడని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి సురుకుపెట్టాలని అన్నారు. దుబ్బాక ఓటర్ల దెబ్బకు రేవంత్ రెడ్డికి దిమ్మ తిరగాలని అన్నారు. అలా కాకుండా కాంగ్రెస్‌కే ఓటేస్తే.. పథకాలు ఎగబెట్టినా నాకే ఓట్లు వేశారని రేవంత్ రెడ్డి అంటారని తెలిపారు.
దుబ్బాకలో కాంగ్రెస్ ఏదైనా అభివృద్ధి చేస్తే చూపించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన పథకాలు, అభివృద్ధితో పోలిస్తే ఈ డబ్బులు ఎంత అని ప్రశ్నించారు. దుబ్బాకలో బడి కట్టింది.. గుడి కట్టింది.. ఆస్పత్రి కట్టింది కేసీఆర్ అని గుర్తుచేశారు. రెండేళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. దుబ్బాకను ఇంకా అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి నోరు విప్పితే బూతులు తప్ప మంచిమాట రాదని అన్నారు.
కేసీఆర్ హయాంలో భూముల విలువ పెరిగిందని హరీశ్‌రావు తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక భూముల ధరలు తగ్గడమే కాదు.. తెలంగాణ ప్రతిష్ట కూడా దిగజారిందని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేతిలో మోసపోని మనిషే లేడని పేర్కొన్నారు. హామీలు, గ్యారంటీల పేరుతో మోసం చేసి కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణ భవిష్యత్ గురించి ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డికి చురుకు తగిలితేనే పథకాలు అమలవుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.