Harish Rao | నిన్న జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు పోటీగా సీఎం రేవంత్ రెడ్డి సభ పెట్టడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సభకు పోటీగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభ పెట్టి తన కురచ బుద్ది బయటపెట్టుకున్నాడని విమర్శించారు. జగిత్యాలలో కేసీఆర్ సభను ముందుగానే నిర్ణయించామని.. కానీ సంకుచిత మనస్తత్వంతో రేవంత్ రెడ్డి పోటీగా సభ పెట్టారని అన్నారు. కేసీఆర్ మాట్లాడే సమయానికి మైక్ పట్టుకున్నాడని విమర్శించారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా రేవంత్ రెడ్డి తీరు ఉందని ఎద్దేవా చేశారు.
సోషల్‌మీడియాలో కేసీఆర్ ప్రసంగాన్ని 36లక్షల మంది లైవ్ చూశారని హరీశ్‌రావు తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని కనీసం 4 లక్షల మంది కూడా చూడలేదని అన్నారు. కాంగ్రెస్ అఫిషియల్ సైట్లో కేవలం 54 మంది చూశారని పేర్కొన్నారు. రేవంత్ స్థాయి ప్రజలకు అర్థమైందని అన్నారు. ఇప్పటికైనా నీ స్థాయి తెలుసుకో అని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
కేసీఆర్ ప్రసంగం అంతా హుందాగా ఉందని హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు కూడా తీయలేదని పేర్కొన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎంతో ఫ్రస్టేషన్‌తో మాట్లాడారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రసంగం స్ట్రీట్ మెన్ కంటే ఘోరంగా ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డి స్పీచ్‌ను ప్రజలు చూడలేదంటేనే స్టేట్ మూడ్ తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సూచనలు పాటించి.. రెండున్నరేళ్లలోనైనా సరిగ్గా పనిచేస్తే కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను బాధ్యతగా తీసుకుంటే బాగుంటుందని అన్నారు.