హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): దీర్ఘకాలిక లక్ష్యాలతో యువత రాజకీయాల్లోకి రావాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు సూచించారు. విద్యావంతులు సైతం రాజకీయాల్లో వస్తున్నారని, ఇది స్వాగతించాల్సిన విషయమని అన్నారు. ఎన్నికలప్పుడే కష్టపడితే రాజకీయాల్లో రాణించలేమని చెప్పారు. ప్రజాప్రతినిధులకు హాలీడేస్ ఉండవని, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటేనే ప్రజలు ఆదరిస్తారని అన్నారు. ఇదే తన సక్సెస్ మంత్ర అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎన్నారైలకు రానున్న రోజుల్లో చట్టసభల్లో బీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పారు.
హైదరాబాద్‌లో శనివారం ‘తెలుగు ఎన్నారై రేడియో’తో హరీశ్ స్పెషల్ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. రాజకీయాల్లో పదవులతో వ్యక్తిత్వం పెరగదని ఆయన అభిప్రాయపడ్డారు. చేసిన అభివృద్ధి పనులతోపాటు మన ప్రవర్తన, ప్రజలతో నడుచుకొనే విధానం గుర్తింపు తెస్తుందని చెప్పారు. తొలి టర్మ్‌లో తమ ప్రభుత్వంలో తాగు, సాగునీటిపై ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలిపారు. తద్వారా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించగలిగామని పేర్కొన్నారు. రెండో టర్మ్‌లో విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు చెప్పారు. కొవిడ్ కారణంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదురైనా ప్రజా సంక్షేమంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదని అన్నారు.
ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని, ఆ హామీలను ప్రాక్టికల్‌గా అమలు చేసే పరిస్థితి లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆదాయ వనరులు పెంచుకోవడంలో కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమైందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వైఖరితో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో పెట్టుబడులకు హైదరాబాద్ హబ్‌గా ఉన్నదని గుర్తుచేశారు. అనేకమంది నార్త్ ఇండియాకు చెందిన వ్యాపారులు గతంలో ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ రాష్ట్రం దివాలా తీసిందని ప్రకటించడంతో వాతావరణం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రూ.40 వేల నుంచి 50 వేల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని తెలిపారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్ర వృద్ధి రేటు -4శాతానికి పడిపోయిందని విమర్శించారు.