హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ప్రైవేటీకరణపై కార్మికులు ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీలో ట్రాన్స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ డిమాండ్లు, గ్రాంట్లపై జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవడం శుభపరిణామమే అయినా, ఈ సాకుతో సిబ్బందిని కుదించడం తగదని చెప్పారు. బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులపై పని ఒత్తిడి పెరగడంతో వారు గుండెపోటుకు గురవుతున్నారని, ప్రమాదాలు పెరుగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు. జర్నలిస్టుల రాయితీ పాసులపై 1/3 చార్జీలకు బదులు 2/3 చార్జీలు వసూలు చేస్తున్నట్టు తెలిసిందని, ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆటోడ్రైవర్లకు ఏటా రూ.12,000 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆయిల్‌పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి సారించడంలేదని హరీశ్‌రావు ఆరోపించారు. తన నియోజకవర్గమైన సిద్దిపేట నర్సరీలో మొక్కలు వృథాగా పడి ఉండటమే నిదర్శనమని చెప్పారు. సాగు పెంపుపై మంత్రితోపాటు అధికారులు నిరంతరం సమీక్షించాలని సూచించారు. రూ.2లక్షల లోపు రుణం ఉన్న చాలామందికి రుణమాఫీ కాలేదని చెప్పారు. తన నియోజకవర్గంలో సన్‌ఫ్లవర్ 6,500 టన్నులు పండిస్తే, 1,350 టన్నులే కొనుగోలు చేశారని వివరించారు. పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే జమచేసి వెంటనే అమల్లోకి తీసుకొనిరావాలని డిమాండ్ చేశారు.