సంగారెడ్డి : ఎన్నికల్లో రకరకాల హామీలతో కాంగ్రెస్ పార్టీ(Congress) ప్రజలను మభ్యపెట్టింది. గ్లోబెల్స్ ప్రచారం చేసి గెలిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. ఆదివారం పటాన్చెరు(Patancheru)లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మేం గెలిచాక 15 వేల రైతబంధు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు.
వడ్లకు బోనస్, వృద్ధాప్య పెన్షన్ పెంపు, 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ప్రచారం చేశారు. ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టింది. 12 మంది డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను అడిగితే తొందరెందుకు అంటున్నారని మండిపడ్డారు.కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తే ఇప్పుడు 15 నుంచి 16 గంటల కరెంటు వస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాక ఇన్వర్టర్లు, జనరేటర్లకి డిమాండ్ పెరిగిందని తెలిపారు.
కృష్ణా ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లీలో, ఢిల్లీలో ఎవరన్నా తెలంగాణ ప్రజల తరఫున పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని 40 సీట్లు తెచ్చుకోమని ఛాలెంజ్ చేసింది. ఇండియా కూటమి పని అయిపోయిందన్నారు. ఒక్కొక్కరు కూటమి నుంచి బయటికి వస్తున్నారని చెప్పారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చితే మేం శభాష్ అంటాం.
నిరుద్యోగులకు ఫిబ్రవరి 1న గ్రూప్స్ నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనకి స్పీడ్ బ్రేకర్ లాంటివన్నారు. రాజస్తాన్, ఛత్తీస్గఢ్లో ఐదేళ్లకే కాంగ్రెస్ ఇంటి బాట పట్టిందని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఒక్క రూపాయి అయినా తెలంగాణకి తెచ్చాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో వచ్చే పరిస్థితి లేదు.
రాముడు అందరి వాడని, రాజకీయంగా వాడుకొని ఓట్లు అడుగుతామంటే ఎవరు వెయరన్నారు. ఏం చేశారో చెప్పుకోవడానికి ఏం లేక దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నారని బీజీపై మండిపడ్డారు. కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో మనం అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిపోయాం. కలిసి పని చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదేనని స్పష్టం చేశారు.