హైదరాబాద్ : ముఖ్యమంత్రి, మంత్రులు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడినా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారు. అధికార దుర్వినియోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులు అన్నింటినీ తట్టుకుని గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish rao) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దాదాపు 700 పైగా వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపు సాధించడం యాదృచ్ఛికం కాదన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనం అని పేర్కొన్నారు.
పల్లె, పట్టణం తేడా లేకుండా రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మందగించింది. ఎన్నికల హామీలు గాలిలో కలిసిపోయాయి. సంక్షేమ పథకాలు అటకెక్కాయి. అందువల్లనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు అనే కొరడాతో ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ను గద్దె దించే శక్తి ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని మొన్న పంచాయితీ ఫలితాలు, నేడు మున్సిపల్ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయన్నారు. అధికార పక్షం దౌర్జన్యాలను ఎదుర్కొని, ప్రతిపక్షంలో ఉంటూ సాధించిన ఈ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.
పాలన గాలికి వదిలి.. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయకుండా కాలం గడుపుతున్న రేవంత్ సర్కారు భరతం పడుతూనే ఉంటం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ఫైఫల్యాలను ఎండగడుతూనే ఉంటం. ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో గులాబీ జెండా ఎగురేసేందుకు నిర్విరామ పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులందరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.