Harish Rao | మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారి ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం ఆరు రోజులైనా ఎటువంటి డైరెక్షన్ ఇవ్వడం లేదని, మంత్రులు టూరిస్ట్ ప్లేస్‌కి వచ్చినట్టు హెలికాప్టర్లలో వచ్చి పోతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతున్నదని విమర్శించారు. గురువారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను బీఆర్ఎస్ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
అనంతరం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎవరు ఏ పని చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? అనే విషయంలో సర్కారు డైరెక్షన్ ఇయ్యకపోతే లోపల ఉన్న వారి ప్రాణాలు ఏమైతయి? ఏ రకంగా ముందుకు పోవాలనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుందా? ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా? మంత్రులు పొద్దుగాలొస్తున్నరు.. సాయంత్రం పోతున్నరు.. హెలికాప్టర్ వేసుకొని’.. అని విమర్శించారు. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు కానీ ప్రమాద ఘటన స్థలానికి రావడం లేదని విమర్శించారు.
ప్రమాదం జరిగినప్పుడు ఒక విధానం, ఒక డైరెక్షన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. సరైన డైరెక్షన్ ఇచ్చి ఉంటే, లోపల ఉన్న కన్వేయర్ బెల్ట్‌ను మరమ్మతు చేసి ఉంటే, దానిద్వారా లోపల ఉన్న బురదను బయటికి పంపించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. ‘బోరింగ్ మిషన్‌పై రాళ్లు పడి కొన్ని భాగాలు వంగిపోయినయ్.. చెల్లాచెదురుగా పడి ఉన్నాయని చెప్పిండ్రు.. మిషన్‌ను కట్ చేసి తీస్తే గాని లోపల ఉన్న మట్టి, బురదను తొలగించే అవకాశం లేదు.. అది కట్ చేయాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి ఐదు రోజులు సమయం తీసుకుంటే ఎట్లా? లోపల చిక్కుకున్న వారి ప్రాణాలు ఏం కావాలి?’ అని మండిపడ్డారు. ఆరు రోజుల తర్వాత తట్టెడు మట్టిని బయటికి తీశారని, చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఇదేనా? అని మండిపడ్డారు.
‘మేము ఇక్కడికి వచ్చి ఎన్డీఆర్ఎఫ్, ఇతర బృందాలు, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడినం.. కన్వేయర్ బెల్ట్ ఎప్పుడు పూర్తవుతుందని వారిని అడిగితే రెండు, మూడు రోజులు పడుతుందని చెప్తున్నారు. మంత్రేమో రెండ్రోజుల్లో ఆపరేషన్ అంతా అయిపోతదని అంటున్నరు. ఆరు రోజులైనా కన్వేయర్ బెల్ట్ ఉపయోగంలోకి రాలేదు. ఇంతవరకు డేబ్రీస్ను లోపలి నుంచి బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. లోపల ఉన్న మిషన్లను కట్ చేసి డేబ్రీస్ను బయటికి తీసుకురావడానికి ఇంత నిర్లక్ష్యమా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మేము మాట్లాడుతుంటే మాట్లాడనివ్వకుండా వారిని పక్కకు తీసుకెళ్తున్నరు.
ఇదేం పద్ధతి? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము టన్నెల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నారని మండిపడ్డారు. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూస్తే తప్పులేదా? మేము చూస్తే తప్పా? అని ప్రశ్నించారు. ఎనిమిది మంది ప్రాణాలతో బయటకు రావాలన్న ఆకాంక్షతో సహాయక చర్యలకు తాము సహకరిస్తుంటే, మంత్రులు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రాజెక్టు కూలిపోయిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఈ ప్రమాదానికి, గత ప్రభుత్వానికి సంబంధం ఏమిటని నిలదీశారు. ‘మీరు పని ప్రారంభించేటప్పడు జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానికల్ నుంచి అనుమతి పొందారా? ఇస్తే రిపోర్ట్ బయట పెట్టండి’ అని నిలదీశారు. ఆదరాబాదరాగా పనులు ప్రారంభించి, ఒక ప్రాజెక్టు కుప్పకూలేలా చేశారని మండిపడ్డారు. బాధిత కుటుంబసభ్యులను తాము కలిసేందుకు ప్రయత్నిస్తే, వారిని కలవనీయకుండా దాచి పెట్టారని, ఎందుకంత భయం? అని నిలదీశారు.
ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా బాధిత కుటుంబాలను ఓదార్చాలని, వారికి ధైర్యం చెప్పాలని, ప్రభుత్వానికి సూచనల ఇవ్వాలని వస్తే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. తాము లోపలికి వెళ్లి ఎన్డీఆర్ఎఫ్ టీంను కలిసి, వారు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించామని చెప్పారు. సహాయక చర్యల్లో ఉన్న రైల్వే టీం, సింగరేణి టీం, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ర్యాట్ మైనర్స్ టీంలను సమన్వయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో నాలుగు ప్రాజెక్టులు కూలిపోయాయని, ప్రభుత్వం ఏమి చేస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. ‘ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది. సుంకిశాల కుప్పకూలిపోయింది. వట్టెం పంప్‌హౌస్ జలమయమైపోయింది. ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయిన పరిస్థితి ఏర్పడింది’ అని ఆరోపించారు. సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కంచర్ల రాంభూపాల్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు రజినీ సాయిచంద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కురువ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టడంలో సర్కారు దారుణంగా విఫలమైందని హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం ఆయన ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు బయల్దేరేముందు హైదరాబాద్ కోకాపేటలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగి ఐదురోజులు దాటినా కార్మికుల ఆచూకీ కనుగొనకపోవడం, రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
ఎస్ఎల్బీసీ కోసం గత ప్రభుత్వం పని చేయలేదంటున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒకసారి రికార్డులను పరిశీలించుకోవాలని హరీశ్‌రావు సవాల్ చేశారు. తొమ్మిదేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకి రూ.3,300 కోట్లు ఖర్చు పెడితే, తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.3,900 కోట్ల పని జరిగిందని వివరించారు. కాంగ్రెస్ హయంలో కంటే రూ.600 కోట్ల పని ఎక్కువగా చేశామని స్పష్టంచేశారు. కరోనా వచ్చినా, పదివేల లీటర్ల సీపేజీ వచ్చినా దాదాపు 12 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేశామని తెలిపారు. డిండి, పెండ్లిపాక రిజర్వాయర్లను పూర్తిచేశామని చెప్పారు. ఈ 14 నెలల్లో కనీసం 15 మీటరైనా సొరంగం తవ్వారా ? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలోనూ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు కూడా తనతోపాటు ఇక్కడకు వచ్చి పనులు సమీక్షించారని గుర్తుచేశారు. ఇప్పుడేమో ప్లేటు ఫిరాయించి నాలుక మడత పెట్టిండని, ఇదేమి పద్ధతని మండిపడ్డారు.