హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ జనరల్ కార్యదర్శిగా, తెలంగాణ భవన్ ఇన్చార్జిగా సుదీర్ఘకాలం సేవలందించిన మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మీయ వీడ్కోలు సభను సోమవారం తెలంగాణభవన్‌లో అట్టహాసంగా నిర్వహించారు. మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డిని పూలబొకెలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి మాట్లాడుతూ శ్రీనివాస్‌రెడ్డి తన జీవితాంతం తెలంగాణ కోసం పరితపించారని కొనియాడారు.
కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి అండగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించారని గుర్తు చేసుకున్నారు. ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’ అనే మాటకు కట్టుబడి ఉంటూ కేసీఆర్ బాటలో నడిచిన గొప్పవ్యక్తి అని ప్రశంసించారు. శ్రీనివాస్‌రెడ్డి ఎక్కడ ఉన్నా ఆయన మనస్సు కేసీఆర్, తెలంగాణ చుట్టూ పరిభ్రమిస్తుందంటూ కొనియాడారు. తెలంగాణభవన్‌పై చెరగని ముద్ర వేసిన ఆయన దూరంగా వెళ్తున్నారంటే గుండెల నిండా భారంగా అనిపిస్తోందని తెలిపారు. వినోద్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి అనేక బాధ్యతలు నిర్వర్తించి బీఆర్ఎస్ అభ్యున్నతికి కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి ఆయురోరాగ్యోలతో నిండూ నూరేండ్లు జీవించాలని ఆకాంక్షించారు. శ్రీనివాస్‌రెడ్డి జీవితం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమని మహమూద్‌అలీ ప్రశంసించారు. తాను ఉద్యోగ సంఘం ఏర్పాటు చేసినప్పుడు శ్రీనివాస్‌రెడ్డి తనను ఎంతగానో ప్రోత్సహించారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేసుకున్నారు. పద్మారావుగౌడ్ మాట్లాడుతూ శీనన్నను కలవడానికి కచ్చితంగా అమెరికా వెళ్తానని చెప్పారు. ఆయన నిండూనూరేండ్లు ఆరోగ్యంగా సుఖసంతోషాలతో గడుపాలని అభిలాషించారు.
తెలంగాణభవన్‌లో నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మీయ వీడ్కోలు సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, చిత్రంలో మండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు మహమూద్‌అలీ, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు
శ్రీనివాస్‌రెడ్డితో తనకు మూడుతరాల అనుబంధమున్నదని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. కౌన్సిల్ డిప్యూ టీ చైర్మన్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ వెనుకబడ్డ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి విద్యాధికుడిగా తమకు ఎనలేని గౌరవమన్నారు. కేసీఆర్‌ను నమ్ముకొని వస్తే మంచి భవిష్యత్ ఉంటదని తాను పార్టీలో చేరేందుకు మాదిరెడ్డి ఎంతగానో ప్రోత్సహించారని సత్యవతి రాథోడ్ గుర్తుచేసుకున్నారు. ఎర్రెబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ శ్రీనివాస్‌రెడ్డి కుటుంబంతో చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నదని పేర్కొన్నారు. తాను సివిల్స్‌కు ఎంపికయ్యేందుకు శ్రీనివాస్‌రెడ్డి బోధించిన సబ్జెక్టే ఉపకరించిందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గుర్తుచేసుకున్నారు. జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఎంతో ఇష్టపడే వ్యక్తి దూరంగా వెళ్లడం భారంగా ఉందని తెలిపారు. అన్ని వేళల్లో బాస్ ఏదంటే అదే అని చెప్పిన శ్రీనివాస్‌రెడ్డి నిరాహారదీక్షకు వెళ్లిన సందర్భంలో తనతో మాట్లాడుతూ అభ్యంతరం చెప్పారని జ్ఞాపకం చేసుకున్నారు.
తెలంగాణ అంటే గుర్తుకు వచ్చే పేరు కేసీఆర్‌ది అయితే తెలంగాణ భవన్ అంటే గుర్తుకు వచ్చే పేరు శ్రీనివాస్రెడ్డిదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రెండున్నర దశాబ్దాల ప్రస్థానంలో ఆయననోట ఏనాడు పరుషపదజాలం వినలేదని, ఓపిక, ప్రేమ, కమిట్మెంట్ను మాత్రమే చూశామని పేర్కొన్నారు. ఆయన పదవుల కోసం కాకుండా తెలంగాణ సాధన కోసమే వచ్చిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. ఆయన ఇచ్చిన బీఫాంలతోనే ఎందరినో జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులుగా గెలిపించుకున్నామని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పడ్డ కష్టనష్టాలు, నాటి నుంచి నేటి వరకు ఎదురైన అడ్డంకులు, విజయాలతో ఓ పుస్తకం రాయాలని విజ్ఞప్తిచేశారు. ఆ పుస్తకాన్ని తెలంగాణ భవన్లో ఆవిష్కరించుకుందామని చెప్పారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
వీడ్కోలు సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు తదితరులు
రెండున్నర దశాబ్దాలు కేసీఆర్‌తో కలిసి పనిచేయడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, మాణిక్‌రావు, చింత ప్రభాకర్, ఎమ్మెల్సీ వాణిదేవి, గోరెటి వెంకన్న, తాతా మధు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పద్మాదేవేందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, వీజీ గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, దాసోజు శ్రవణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గ్యాదరి బాలమల్లు, వై.సతీశ్‌రెడ్డి, దేవీప్రసాద్, రాజీవ్ సాగర్, వాసుదేవరెడ్డి, ఆయాచితం శ్రీధర్, చిరుమల్ల రాకేశ్, కిశోర్‌గౌడ్, గెల్లు శ్రీనివాస్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్, మంత్రి శ్రీదేవి, సుమిత్రాఅనంద్ తదితరులు పాల్గొన్నారు.