Harish Rao | హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస సర్కారు నిరంకుశ వైఖరిని వీడాలని మాజీ మంత్రి హరీశ్‌రావు హితవుపలికారు. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు తమ డిమాండ్లు పరిషరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే విధినిర్వహణలో భాగంగా వార్తలు కవర్ చేయడం జర్నలిస్టులు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించడం మీడియా హకును, స్వేచ్ఛను కాలరాయడమేనని దుయ్యబట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సమైక్యపాలన తలపిస్తున్నది: ఎర్రోళ్ల శ్రీనివాస్
ఓయూలో నెలకొన్న పరిస్థితులు నాటి సమైక్యపాలనను తలపిస్తున్నాయని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఓయూలో జర్నలిస్టులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. తమది కంచెల ప్రభుత్వం కాదు, ఆంక్షల ప్రభుత్వం కాదని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పెద్దలు జర్నలిస్టుల హకులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టు చేసిన జర్నలిస్టులు, విద్యార్థులు, నిరుద్యోగులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆ పోలీసులను సస్పెండ్ చేయాలి : బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్
విద్యార్థులపై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. డీఎస్సీ వాయిదా వేసి 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులను అరెస్టు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత నిర్బంధం లేదు ;మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
జర్నలిస్టులపై జరిగిన దాడి హేయమైనదని, రాష్ట్రంలో అప్రకటిత నిర్బంధం కొనసాగుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాపాలన పేరుతో ప్రజాస్వామ్యానికి తలవంపుల పాలన సాగుతున్నదని దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంతటి నిర్బంధం లేదని, ఇటీవలికాలంలో జర్నలిస్టులపై పోలీసులు వరుసగా చేస్తున్న దాడులు ఉద్దేశపూర్వకంగా సాగుతున్నవిగానే చూడాలని పేర్కొన్నారు. నిరుద్యోగుల గొంతు నొక్కాలనే కుటిల యత్నాలను సర్కారు వీడాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం నిరుద్యోగులను వాడుకొని, ఇప్పుడు వారినే అణగదొక్కుతున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.