వరంగల్, మే 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పోక్సో కేసు నమోదైన బండి భగీరథ్‌ను అరెస్టు చేయకుండా ప్రత్యేక దర్యాప్తు అధికారిని నియమించడమంటే కేసును నీరుగార్చడమేనని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయటంతో కేంద్రమంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ మధ్య ఉన్న కుమ్మక్కు రాజకీయం ఏమిటో మరోసారి తేలిపోయిందని ఆరోపించారు. సోమవారం వరంగల్ జిల్లా ఖానాపురంలోని అశోక్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్కార్ తీరును ఆక్షేపించారు. భగీరథ్‌పై బాధితులు ఫిర్యాదు చేసి నాలుగు రోజులైనా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అదే తమ పార్టీ నేతలు క్రిశాంక్, నల్లబాలు సోషల్ మీడియా వేదికగా రీట్వీట్ చేసినందుకు అర్ధరాత్రి అరెస్టు చేశారని మండిపడ్డారు.
‘వాళ్లు(క్రిశాంక్..నల్లబాలు ) రేప్ చేయలే.. మర్డర్ చేయలే.. డ్రగ్స్ తీసుకోలే.. ట్విట్టర్లో వారి అభిప్రాయాన్ని రీ ట్వీట్ చేసిన్రు. దానికి ఒంటిగంట రాత్రి కేసుల మీద కేసులు పెట్టి.. పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా జైల్లో పెట్టిన రేవంత్‌రెడ్డి.. నాలుగు రోజులైనా రేప్ కేసులో ఫిర్యాదు వస్తే ఇప్పటిదాకా అరెస్టు చేయలేదంటేనే.. బండి సంజయ్‌తో రేవంత్‌రెడ్డికి ఉన్న కుమ్మక్కు రాజకీయం బయటపడుతున్నది’ అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు 10 సిట్లు వేసిందని, వాటిలో ఏ ఒక్క సిట్ అయినా రిపోర్డు ఇచ్చిందా? ఇస్తే వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏ సిట్ మీదనైనా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులోనూ సిట్ వేయటం వెనుక వారి ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కు రాజకీయమే కారణమని తెలిపారు.
హ్యామ్ రోడ్ల టెండర్లు రద్దు చేయాలి
హ్యామ్ రోడ్ల టెండర్లను రద్దు చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. హ్యామ్ రోడ్లను దక్కించుకున్నవారిలో 90శాతం హరీశ్‌రావు అనుచరులున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘టెండర్లు దకించుకున్నవాళ్లు హరీశ్‌రావు మనుషులే అని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నాడు. వాళ్లు నా మనుషులే అయితే వెంటనే ఆ టెండర్లను రద్దు చేయ్’ అని డిమాండ్ చేశారు. హ్యామ్‌రోడ్ల పేరుతో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల్లో 25శాతం ఎక్సెస్‌తో జరిగిన రూ.5వేల కోట్ల కుంభకోణాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టి పోరాడుతున్నది తానేనని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ 5శాతానికి మించి ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదని, మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేశామని తెలిపారు. హ్యామ్‌రోడ్ల టెండర్ల పేరుతో జరుగుతున్న ప్రజాధనం లూటీని ఆపాలని డిమాండ్ చేశారు.
76 స్కూళ్లలో రూ.500 కోట్ల అవినీతి
రేవంత్‌రెడ్డి అవినీతి కింగ్ అని, అందుకు రాష్ట్రవ్యాప్తంగా 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం కోసం వేసిన టెండర్లే నిదర్శమని హరీశ్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రిగానే కాక విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వరిస్తున్న రేవంత్‌రెడ్డి కనుసన్నల్లో భారీ అవినీతి జరుగుతున్నదని తెలిపారు. ‘కాంగ్రెస్ పాలన అంటనే అవినీతి. 76 పాఠశాలల టెండర్లలో రూ.500 కోట్ల అవినీతి జరిగింది. ప్రతి టెండర్ 4శాతం నుంచి 5శాతం ఎక్సెస్‌కు వేశారు. తన అనుయాయులతో సీఎం ఈ అవినీతికి పాల్పడుతున్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుపాలి’ అని డిమాండ్ చేశారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.