Harish Rao | హైదరాబాద్ మే 24 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు కుట్రలు చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా రూ.80 వేల కోట్లతో నిర్మించతలపెట్టిన బనకచర్లకు కేంద్రం 50% నిధులు సమకూర్చడం, మిగిలిన 50% నిధులకు ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి రుణ సమీకరణకు ఏపీకి అనుమతులిచ్చి సహకరించడం అన్యాయమని పేర్కొన్నారు. నాటి సమైక్య పాలకులు పోతిరెడ్డిపాడుతో కృష్ణా జలాల అక్రమ తరలింపునకు ప్రణాళికలు వేస్తే, నేటి కాంగ్రెస్ నాయకుల సమక్షంలోనే బనకచర్ల ద్వారా గోదావరి జలాల దోపిడీకి మార్గం సుగమం చేస్తున్నారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుల అనుమతి అవసరమని శనివారం ఎక్స్ వేదికగా గుర్తుచేశారు.
కానీ అందుకు విరుద్ధంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలను ఏపీ సర్కారు తుంగలో తొక్కుతున్నదని ధ్వజమెత్తారు. అడ్డుకోవాల్సిన కేంద్రం నిధులిచ్చి సహకరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకుంటే ఎఫ్ఆర్బీఎం రికవరీ పెట్టిన బీజేపీ సర్కారు, ఇప్పుడు బనకచర్లకు ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి రుణ సమీకరణకు అవకాశం కల్పించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ, ఆంధ్రప్రదేశ్‌పై వరాల జల్లులు కురిపిస్తున్నా కాంగ్రెస్ సర్కారు కేంద్రాన్ని నిలదీసే ధైర్యం ఎం దుకు చేయడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కా రు కేంద్రాన్ని నిలదీసే, పోరాటం చేసే పరిస్థితి లేకపోవడంతో తెలంగాణ నష్టపోయే దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అంటేనే కరప్షన్.. ఆ పార్టీ డీఎన్ఏలోనే అవినీతి ఉన్నది. ప్రాణహిత-చేవెళ్ల ్ర నిర్మాణానికి 2007లో రూ.17,875 కోట్లతో జీవో ఇచ్చి 19 నెలల్లో తట్టెడుమట్టి ఎత్తకుండానే రూ.38,500 కోట్లకు, ఆ తర్వాత రూ.43,300 కోట్లకు అంచనాలు పెంచి దండుకున్న చరిత్ర కాంగ్రెస్‌దే.
-హరీశ్‌రావు
కరప్షన్‌కు కేరాఫ్‌గా ప్రసిద్ధిగాంచిన కాంగ్రెస్ సర్కా రు కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లను వినియోగిస్తూనే మరోవైపు పనికిరానిదని, వైట్ ఎలిఫెంట్ అని అనడం దుర్మార్గమని మండిపడ్డారు. మతిభ్రమించిన నీటిపారుదల మంత్రి ఉత్తమ్ ఈ బృహత్తర పథకంపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కాళేశ్వరాన్ని దుష్ప్రచా రం చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. వీళ్లిద్దరే తెలంగాణ పాలిట వైట్ఎలిఫెంట్లు అని, ఒకరు ఆదాయానికి ఎసరుపెడితే, మరొకరు నీటి వాటాకు గండికొడుతున్నారని అన్నారు.
కమీషన్ల కోసమే తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారంటూ అదే పనిగా కాంగ్రెస్ నాయకులు కారుకూతలు కూస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ‘తుమ్మిడిహెట్టి దగ్గర తగినంత నీటి లభ్యత లేదని 2015 ఫిబ్రవరి 18, మార్చి4న సీడబ్ల్యూసీ రాసిన లేఖల్లో పేర్కొన్న మాట వాస్తవం కాదా? తుమ్మిడిహెట్టి వద్ద ఖర్చు చేసే ప్రతి రూపాయి వ్యర్థమేనని మహారాష్ట్ర సీఎం ఉత్తరం రాసింది నిజంకాదా?’అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడకముందు ఏడేండ్లు మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీ, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుకు ఎందుకు అనుమతులు సాధించలేదని, తట్టెడుమట్టి ఎందుకు తీయలేదని నిలదీశారు. ఏపనీ చేయకుండానే మొ బిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట రూ.2,328 కోట్లు స్వా హా చేశారని ఆరోపించారు. ‘కాళేశ్వరం గురించి ఎక్కడైనా వాస్తవాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. విచారణ తర్వాత చర్యలు తప్పవని మంత్రి ప్రకటించడం చూస్తుంటే..విచారణ తీరుపై అనుమానాలొస్తున్నాయి’అని పేర్కొన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఏడేండ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చుచేసినట్టు మంత్రి ఉత్తమ్ చెప్పింది శుద్ధ అబద్ధమని హరీశ్‌రావు కొట్టిపారేశారు. భూసేకరణ, ఇతర పనులకు చేసిన ఖర్చు రూ.3,780 కోట్లేనని స్పష్టంచేశారు. ‘కాంగ్రెస్ నేతలు బరాజ్ నిర్మించి? ఎల్లంపల్లి దాకా గ్రావిటీ కెనాల్‌ను తవ్వితే ప్రాజెక్టు రీడిజైనింగ్ అవసరం ఉండేదికాదని చెప్పారు. కాంగ్రెస్ తప్పులు సరిదిద్దేందుకు, చేసిన ఖర్చు వృథాకాకుండా చూసేందుకు ప్రాణహితను రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం నిర్మించామని స్పష్టంచేశారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడతామని చెప్పి ఏడాదిన్నర దాటినా పిడికెడు మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు.
రెండు దశాబ్దాలుగా పక్కన పెట్టడం వల్లే ఎస్ఎల్బీసీ సొరంగం కూలిందని మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ.3,200 కోట్లు ఖర్చుచేసి 12 కిలోమీటర్లు సొరంగం తవ్వి, డిండి, పెండ్లిపాక రిజర్వాయర్ల పనులు పూర్తి చేశామని చెప్పారు. నిరూపించేందుకు చర్చకు మీరు సిద్ధమా? హైదరాబాద్‌లోనైనా, హుజూర్నగర్లోనైనా చర్చించేందుకు రెడీ అని సవాల్ విసిరారు.
ప్రాజెక్టుల నిర్మాణం, పంపుల ఏర్పాటుపై ఉత్తమ్ కు అవగాహన లేదు ప్రాణిహిత-చేవెళ్ల పూర్తిస్థాయి గ్రావిటీ ప్రాజెక్టు అని చెప్పిన మంత్రి.. ఇప్పుడు ఒక పంపు అవసరమని మాట మార్చడమే అజ్ఞానానికి నిదర్శనం. ఒక్క పంపు, రెండు పంపులు ఉండవు. అవసరమైన మేరకు ప్రతి చుక్కనూ ఎత్తిపోయాల్సిందే.
-హరీశ్‌రావు
గద్దెనెక్కిన మొదటి ఏడాదిలోనే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కారు ఏడాదిన్నర దాటినా కనీసం ఆరు ఎకరాలకైనా నీళ్లిచ్చిందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, అసెంబ్లీలో రేవంత్ సర్కారు విడుదలచేసిన శ్వేతపత్రమే సాక్షి అని తెలిపారు.
దేశంలో అంచనా పెంచకుండా ఏ ప్రాజెక్టును పూర్తిచేశారో చెప్పాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు. దేశంలోనే కాళేశ్వరం అత్యంత తక్కువ కాస్ట్ ఎస్కలేషన్‌తో పూర్తిచేసిన ప్రాజెక్టని స్పష్టంచేశారు. ప్రాజెక్టు వ్యయం పెరిగిందని మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు .. బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు, నీటి వినియోగాన్ని 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు, ఆయకట్టును 16.4 లక్షల ఎకరాల నుంచి 18.25 లక్షలకు (స్థిరీకరణ 18.8 లక్షల ఎకరాలు), పంపింగ్ కెపాసిటీని 1.8 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. నాడు ఎకరానికి రూ.2 లక్షలు ఇస్తే తమ ప్రభుత్వం రూ.11 లక్షల పరిహారం ఇచ్చిందని గుర్తుచేశారు.