Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఒకే విషయంపై రాత్రి ఓ మాట.. తెల్లారి మరోమాట మాట్లాడటంలో సీఎం రేవంత్‌రెడ్డి తనకు తానే సాటి అని, ఈ సబ్జెక్ట్‌లో ఆయనకు పీహెచ్డీ ఇవ్వొచ్చని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎడతెగని వంచనకు గురయ్యారని, ప్రజాపాలన అని చెప్పి గద్దెనెక్కి ప్రజల హక్కులను హరిస్తున్నారని, నిర్బంధాలు, అణచివేతలు, కంచెలు, ఆంక్షలు నిత్యకృత్యమయ్యాయని, చిన్నారులు, మహిళలు, గర్భిణులపై దాష్టీకాలు పెరిగిపోయని నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట.. ఇప్పుడో మాట మాట్లాడుతూ డబుల్ స్టాండర్డ్ లీడర్‌గా ఘనత వహించాడని ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణభవన్‌లో శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ హోంమంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేత చింతా ప్రభాకర్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి రెండు నాల్కల ధోరణిని ఎండగట్టారు. వీడియో ైస్లెడ్స్ ప్రదర్శిస్తూ రేవంత్‌రెడ్డి తీరును బట్టబయలు చేశారు.
అధికారంలోకి రాగానే మూడు పంటలకు పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు రెండు పంటలకు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టి రైతులను నిండా ముంచారని హరీశ్ మండిపడ్డారు. 11 విడుతల్లో రూ.72 వేల కోట్లను కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కోసం విడుదల చేసిందని, రైతుబీమా కోసం రూ.10 వేల కోట్లు ఇచ్చిందని, మొత్తంగా రూ.82 వేల కోట్లు రైతులు, రైతు కుటుంబాల కోసం కేటాయించిందని, ఇది రేవంత్ సర్కార్ చేసిన రుణమాఫీ కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని హరీశ్‌రావు గుర్తుచేశారు. వానకాలం, యాసంగికి రైతుభరోసా ఇవ్వకుండా మోసం చేసి, ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు.
‘బతుకమ్మ పండుగకు కేసీఆర్ ఒకటే చీర ఇస్తున్నడు.. మేం వచ్చినంక రెండు చీరలు ఇస్తం అన్నవు.. ఇప్పుడు కనీసం జాకెట్ పీసు కూడా ఇవ్వకుండా ఆడబిడ్డలను మోసం చేసినవ్’ అంటూ హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆడబిడ్డలకు ఇచ్చిన మాట తప్పితే అంతకంటే పాపం మరోటి లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని దుయ్యబట్టారు. భూములు, ప్లాట్ల కు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని చెప్పి, ఇప్పుడు ఏఆర్ఎస్ (ఎనుముల రెగ్యులరైజేషన్ స్కీం) ద్వారా రూ.15 వేల కోట్ల వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. భట్టి విక్రమార్క గతంలో చెప్పినట్టు, ప్రజలకు ఇచ్చిన మాటకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు.
మోసం చేయడం మాకలవాటు.. మోసపోవడం ప్రజలకలవాటని నిస్సిగ్గుగా చెప్పిన మహా మోసగాడు రేవంత్‌రెడ్డి. టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలిదేవత అని, ఇప్పుడు మూడు రంగుల జెండా కప్పుకొని ధర్మదేవత అంటున్నవ్. ఏడో గ్యారెంటీ కింద ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి యథేచ్ఛగా హక్కుల హననానికి పాల్పడుతున్నవ్.
ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పిన కాంగ్రెస్, మొదటి ఏడాదిలో కనీసం పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మొండిచెయ్యి చూపిందని హరీశ్ తూర్పారబట్టారు. జాబ్‌క్యాలెండర్‌ను జాబ్‌లెస్ క్యాలెండర్‌గా చేశారని ఎద్దేవాచేశారు. పోటీపరీక్షల వాయిదా విషయంలో ట్రిపుల్ స్టాండర్డ్స్ తీసుకున్నారని దుయ్యబట్టారు. ‘తలకు మాసినోళ్లు పరీక్షలు వాయిదా వేయాలంటున్నరు..పరీక్షలు రాయనోళ్లు, సదువు రానోళ్లే ఇట్లా అం టరు అని ఉద్యోగార్థులను అవమానించినవ్. నిరుద్యోగుల ఆందోళనకు దిగొచ్చి గ్రూప్-2ను వాయిదా వేసినవ్.. అంటే తలకుమాసినోడు ఎవరు రేవంత్? సమాధానం చెప్పు?’ అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ చేపట్టిన కులగణన సర్వేపై అభాండాలు వేసిన రేవంత్, ఇప్పుడు చేసున్నదేమిటని నిలదీశారు. ‘సర్వేలో నీకు ఎంత భూమి ఉన్నది..సైకిల్ ఉన్న దా? మీ కొడుకు ఏం ఉద్యోగం చేస్తడు? వంటి సంబంధంలేని ప్రశ్నలు అడగడంలో ఔచిత్యమేమిటి?’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హ యాంలో ఒకట్రెండు అక్రమ కట్టాలను కూల్చివేస్తే ప్రతిపక్షంలో ఉండి గగ్గోలు పెట్టిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు హైడ్రా పేరిట విధ్వంసానికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.
‘నేను పోలీసు కుటుంబం నుంచి వచ్చిన.. మీ బాధలు నాకు తెలుసు.. ఏక్ పోలీసింగ్ తె స్తా అని ఎన్నికల సభల్లో మొసలి కన్నీరు కార్చి న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఇచ్చిన మాట నెరవేర్చాలని అడిగిన పాపానికి పోలీసులకే కన్నీరు పెట్టించిండు’ అని హరీశ్‌రావు నిప్పులుచెరిగారు. 39 మంది పోలీసుల ఉద్యోగాలు తీసేసి వారి కుటుంబాలను రాచిరంపాన పెడుతున్నారని విమర్శించారు.
మద్యం అమ్మకాల విషయంలోనూ సీఎం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని హరీశ్ ఆక్షేపించారు. బీఆర్ఎస్ పాలనలో ఊరికో బెల్ట్ షాపులు ఉన్నాయని గోబెల్స్ ప్రచారంచేసి, ఇప్పుడు గల్లీకో బెల్ట్ షాపు తెరిచారని విమర్శించారు. అప్పుడు మద్యం వద్దని పద్యం చెప్పి.. ఇప్పుడు అదనంగా రూ.10 వేల కోట్ల అదనపు ఆదాయం రాబట్టాలని ఎైక్సెజ్ అధికారులకు టార్గెట్లు పెట్టడం దుర్మార్గమని మం డిపడ్డారు. మద్యం అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోని అధికారులను తొలగిస్తున్నారని, ఇప్పటికే 30 మంది ఎైక్సెజ్ సీఐలకు చార్జిమెమోలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా కట్టకుండా వందలాది ఇండ్లను నేలమట్టం చేసినవ్.. తన ఇంటిని కూల్చుతుంటే పసిపాపను వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోనివ్వని అమానవీయాన్ని ఈ తెలంగాణ ప్రజానీకం చూసింది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా రేవంత్‌రెడ్డి క్రిమినల్ వేస్ట్ పేరుకుపోయింది.
కోటి ఎకరాలకు నీరందించేందుకు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరంపై సీఎం రేవంత్‌రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని హరీశ్ మండిపడ్డారు. ‘ఓ వైపు ప్రాజెక్టు కూలిపోయిందని చెప్తున్న ముఖ్యమంత్రి, మంత్రులు మరోవైపు మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీటి కోసం 20 టీఎంసీలు, మూసీలోకి 5 టీఎంసీలు తరలించాలని, రంగనాయక్ సా గర్ నుంచి లక్షా పదివేల ఎకరాలకు నీళ్లిస్తామని సిగ్గులేకుండా మాట్లాడుతున్నడు’ అం టూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పార్టీ ఫిరాయించినోళ్లను రాళ్లతో కొట్టాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిలుపునిచ్చిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా కండువాలు కప్పుతున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి కడుపులో తలకాయపెట్టి వారిని చేర్చుకున్నారని విమర్శించారు. ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో ఏడాది మార్కు పాలన సాగించడం ఆయనకే చెల్లిందని దెప్పిపొడిచారు. ఒక చేత్తో పూలు, మరో చేత్తో రాళ్లు విసిరే నేర్పిరితనం రేవంత్ సొంతమని ఎద్దేవాచేశారు.
బీఆర్ఎస్ హయాంలో వేసిన శిలాఫకాలపై రేవంత్ అనవసర రాద్ధాంతం చేశారని, అప్పు డు కేసీఆర్ పేరు వద్దన్న ఆయన ఇప్పుడు పే రుతో పాటు ఏకంగా తన బొమ్మకూడా పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని హరీశ్ నిలదీశారు. పేపర్ యాడ్స్ విషయంలోనూ ఇ దే తీరున మాటమార్చారని, చిన్న కార్యక్రమాలకు డబుల్ పేజీ యాడ్స్ ఇస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ 11 విడతల్లో 72 వేల కోట్లు రైతుబంధు కోసం ఇచ్చిండ్రు. 10 వేల కోట్ల రైతుబీమా కలుపుకొంటే మొత్తం 82 వేల కోట్లు.. ఇది నువ్విచ్చిన రుణమాఫీ కంటే నాలుగురెట్లు ఎక్కువనే విషయం గుర్తుపెట్టుకో రేవంత్‌రెడ్డీ..ఎన్నికల ముందు రైతులు, కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తానని చెప్పినవ్. ఇప్పుడు ఎవరికియ్యాలో వాళ్లిద్దరే తేల్చుకోవాలంటున్నవ్.. వానకాలం, యాసంగికి రైతుభరోసా ఇవ్వకుండా మోసం చేసినవ్. ఇప్పుడు నింపాదిగా సంక్రాంతి తర్వాత అనడంలో ఆంతర్యమేంది? .
మూసీపై ముఖ్యమంత్రి పదే పదే మాట మారుస్తూ ప్రజలను ఏమారుస్తున్నారని హరీశ్ విమర్శించారు. ‘మొదట ఈ ప్రాజెక్ట్‌కు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చవుతుందని అన్ని చెప్పిండు. మళ్లీ ఇటీవల నేను అలాచెప్పలేదు అని నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా అన్నడు.. సలహాదారుల నియామకంలోనూ ఇట్లనే వ్యవహరించిండు.. సలహాదారులు ఎందుకు?, వారికి క్యాబినెట్ హోదా ఎందకు ? అని నాడు రేవంత్‌రెడ్డి కోర్టుకు పోయిండు. ఇప్పుడు కేసు కో ర్టులో ఉండగానే నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తున్నడు. తనకు నచ్చిన నాయకులను సలహాదారులుగా పెట్టుకున్నడు’ అంటూ నిప్పులుచెరిగారు.
అభయహస్తం మ్యానిఫెస్టోలో ప్రజాస్వా మ్య పునరుద్ధరణ ఏడో గ్యారెంటీగా హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి, మూడు నిర్బంధాలు, ఆరు అణచివేతలు అన్నట్టుగా పాలన సాగిస్తున్నారని హరీశ్ ధ్వజమెత్తారు. పచ్చటి పొలాల్లో ఫార్మా కంపెనీలు పెట్టి చిచ్చు పెట్టవద్దని ఎదురుతిరిగిన లగచర్ల గిరిజన రైతులను చితకబాదారని మండిపడ్డారు. అర్ధరాత్రి లగచర్లలో పో లీసులు చేసిన అరాచకాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజనిర్ధారణ కోసం వెళ్లిన ప్రజాసంఘాలను అడ్డుకొని లగచర్లను పాకిస్థాన్ బా ర్డర్లా మార్చారని, చిన్నారులు, గర్భిణులు, మహిళలు అన్న కనికరం లేకుండా దాష్టీకాలకు పాల్పడడం రేవం త్ మార్క్ పాలనకు అద్ధంపట్టిందని నిప్పులుచెరిగారు. న్యాయం కోసం రోడ్డెక్కిన నిరుద్యోగుల వీపులపై లాఠీలు ఝు లిపించిన ఘనత నిఖాైర్సెన ప్రజాస్వామవాది రేవంత్‌రెడ్డికే దక్కిందని ఎద్దేవాచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నక్సలైట్లు ఉంటే బాగుంటదని మాయమాటలు చెప్పి, ఏడాది పరిపాలనలో మూడు బూటకపు ఎన్కౌంటర్లు చేయించి అమాయకులను మట్టుబెట్టారని హరీశ్ విరుచుకుపడ్డారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూట్యూబ్ చానళ్లను వాడుకొని గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ‘ఈ ట్యూబ్..ఆ ట్యూబ్’ అంటూ వెక్కిరిస్తున్నాడని, ప్రశ్నిస్తే ఆరాచక చానళ్లు అంటూ అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.‘టీవీల్లో రేవంత్ మాట్లాడుతూ కనిపించగానే పిల్లలు చెడిపోయే ప్రమాదమున్నదని తల్లిదండ్రులు చానళ్లు మా ర్చే దుస్థితి నెలకొన్నది’ అని దెప్పిపొడిచారు. ప్రజలు ప్రతిదీ నిశితంగా గమనిస్తున్నారని, తగిన సమయంలో కచ్చితంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు.