మేడిగడ్డ వద్ద 50 మీటర్ల ఎత్తులో ప్రవాహం ఉంటే కన్నెపల్లి పంపహౌస్ నుంచి నీటిని ఎత్తిపోయవచ్చు. బుధవారం సాయంత్రం మేడిగడ్డ వద్ద 90.80 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ఇలా నిండా నీళ్లున్నా ప్రభుత్వం ఎత్తిపోయడం లేదు.
నిన్న ఆయన ఏం మాట్లాడుతడు.. అరె ఎల్‌నినో వచ్చింది భయ్.. ఎల్నినోనే వచ్చే.. వాననేవడ్తలేదు.. సుక్క నీళ్లు లేవు. ఈనె ఒత్తొత్తు అంటడు.. యాడొత్తాలె అంటుండు.. నీకు మెదడు లేదు.. నీ మెదడులో వెర్రి ఉన్నదో, పిచ్చి ఉన్నదో నాకు తెల్వది.. గా ఎల్‌నినో వచ్చింది గనుకనే నేనారోజు చెప్పిన. కరువు వచ్చినా, కాలం కాకపోయినా కేసీఆర్ ముందుచూపుతో నీళ్లుండే మేడిగడ్డ కట్టిండు. ఎస్.. మళ్లీ చెప్తున్న కరువొచ్చినా.. కాలంగాకపోయినా నీళ్లుండే ఒకే ఒక్క ప్రాంతం మన తెలంగాణలో మేడిగడ్డ గనుకనే ఆడ గట్టినం. ఈ నిమిషానికి.. ఈ సెకనుకు మేడిగడ్డలో 89,230 క్యూసెక్కుల నీళ్లు పారుతున్నయ్. మోటర్లు ఆన్‌చేసి ఆ నీళ్లు ఎత్తిపోస్తవా? పోయవా? నీకు రైతు ప్రయోజనాలు ముఖ్యమా? రాజకీయాలా? నువ్వే డిసైడ్ చెయ్యి మిస్టర్ రేవంత్‌రెడ్డీ!
– హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రస్తుతం 89,230 క్యూసెకుల ప్రవాహం ఉన్నదని, ఆ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు వాడుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై నిజా నిజాలు- రేవంత్ చెప్పిన అబద్ధాలు’ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరువు వచ్చినా, కాలం కాకపోయినా ఎల్లప్పుడూ నీటి ప్రవాహం ఉండే ప్రాంతం మేడిగడ్డ అని, అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో బరాజ్ కట్టిందన్నారు. ఇప్పుడు కూడా బరాజ్ వద్ద ఏడు టీఎంసీల నీరు ప్రవహిస్తున్నదని, మూడు టీఎంసీలు ఎత్తిపోసుకున్నా, మరో నాలుగు టీఎంసీలు దిగువకు వెళ్తాయన్నారు. మరోవైపు సమ్మక్క బరాజ్‌లో లక్షా 8వేల క్యూసెక్కుల వరద ఉన్నదని, దేవాదుల ప్రాజెక్టు మూడు ఫేజ్‌లు కలిపి రోజుకు 2,542 క్యూసెక్కులు ఎత్తిపోయవచ్చని తెలిపారు. ప్రభుత్వం మాత్రం కేవలం 900 క్యూసెక్కులు మాత్రమే ఎత్తిపోయడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో వరద నీళ్లు ఉండి కూడా ఎత్తిపోయకపోవడం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిల క్రిమినల్ నెగ్లిజెన్సీ అని ధ్వజమెత్తారు. అబద్దాలకు నోబెల్ బహుమతి ఇస్తే అది రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ వద్ద రబ్బరు డ్యామ్ నిర్మించి నీళ్లను వాడుకోవచ్చని నిపుణులైన ఇంజినీర్లు ఇచ్చిన నివేదికను తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
‘పోయిన రెండేండ్లు కాలం మంచిగైంది కాబట్టి నీకు ఇబ్బంది రాలేదు. ఇప్పుడు బాలేదు కాబట్టి నీళ్లు ఇవ్వుమంటే కథలు చెప్తున్నావ్. నిన్నటిదాకా కూలిపోయిందన్న ప్రాజెక్టుకు ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే నీ మోసం ప్రజలకు అర్థమవుతుందని పంతాలు, పట్టింపులకు పోయి మోటార్లు ఆన్ చేయకుండా డ్రామాలు నడుపుతున్నావ్’ అని హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరువు వచ్చినా, కాలం కాకపోయినా ఎల్లప్పుడు నీటి ప్రవాహం ఉండే ప్రాంతం మేడిగడ్డ అని, అందుకే ఆ ప్రాంతంలో బరాజ్ కట్టామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వానలు లేకపోయినా ఇప్పడు కూడా మేడిగడ్డ దగ్గర 89,230 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నదని, ఏడు టీఎంసీల నీళ్లు ప్రవహిస్తున్నాయని చెప్పారు. మూడు టీఎంసీలు ఎత్తిపోసినా ఇంకా నాలుగు టీఎంసీల నీళ్లు దిగువకు వెళ్తాయన్నారు. ఈ సందర్భంగా గోదావరి ప్రవాహ ఆన్లైన్ డేటా బేస్‌ను ప్రదర్శించారు. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అధికారిక డేటా అని చెప్పారు. దీనినిబట్టి రెండుమూడు రోజుల కిందట లక్ష క్యుసెక్కులకుపైగా ప్రవాహం ఉన్నదని గణాంకాలు చెప్తున్నాయన్నారు. ‘అక్కడ నీటి ప్రవాహం ఉన్నది కాబట్టే మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయాలని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లు ఆన్‌చేసి మూడు టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఇప్పటికీ ఉన్నదని, ఎందుకు ఆ పనిచేయడం లేదని హరీశ్ ప్రశ్నించారు. కేసీఆర్‌కు పేరొస్తదనే చిల్లర రాజకీయాలతో నీళ్లను కిందకి జారవిడిస్తూ రైతులకు, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ‘మోటార్లు ఆన్‌చేసి ఆ నీళ్లు ఎత్తిపోస్తవా? పోయ వా? అది నీ విజ్ఞత? నీకు రైతు ప్రయోజనాలు ముఖ్యమా? రాజకీయాలు ముఖ్యమా? నువ్వే డిసైడ్ చెయ్యి రేవంత్‌రెడ్డి?’ అని సూచించారు. వొడిసిపడుతావో.. విడిచిపెడుతావో నిర్ణ యం తీసుకోవాలన్నారు. ‘వొడిసిపడుతలేవుగానీ.. చంద్రబాబు కోసం విడిచిపెడుతున్నావు’ అంటూ సీఎంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
మేడిగడ్డ వద్ద రబ్బర్ డ్యామ్ వేసి నీటిని వాడుకోవచ్చని ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు ఒక రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిండ్రు. చిత్తశుద్ధి ఉంటే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ రిపోర్ట్‌ను బయటపెట్టాలె. రిపోర్ట్ ఇచ్చిన ఈఎన్సీని వారం తిరుగకముందే బదిలీచేసి బెంచ్‌పై కూర్చోబెట్టిండ్రు. పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ చేసిండ్రు. ఆయనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డరు. కాళేశ్వరం మీద ఇంత పగ, ఇంత ప్రతీకారమా? 99 శాతం కాళేశ్వరం బాగున్నది కాబట్టే 8 వేల కోట్లు వెచ్చించి మూసీకి నీళ్లు తెస్తున్నరు.
-హరీశ్‌రావు
రాష్ట్రంలో వరద నీళ్లు ఉండి కూడా ఎత్తిపోయకపోవడం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిల క్రిమినల్ నెగ్లిజెన్సీ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఈ విషయంలో వారిద్దరినీ ఉరి తీసినా తప్పులేదని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో నీళ్ల మంత్రి, ముఖ్యమంత్రి ఫెయిలయ్యారని మండిపడ్డారు. కేసీఆర్ నాడు ముందు చూపుతో సమ్మక్క బరాజ్‌ను నిర్మించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుతం సమ్మక్క బరాజ్‌లో లక్షా8వేల క్యూసెక్కుల వరద ఉందని వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టులోని మూడు ఫేజ్‌లు కలుపుకుని రోజుకు 2,542 క్యూసెక్కులు ఎత్తిపోయవచ్చని తెలిపారు. కానీ ప్రభుత్వం 900 క్యూసెక్కులు మాత్రమే ఎత్తిపోయడం శోచనీయమన్నారు. దేవాదుల ఫేజ్ 1, ఫేజ్ 2లో ఒక్క మోటర్ మాత్రమే నడుపుతున్నారని చెప్పారు. ఫేజ్ -3లో ఆరు మోటర్లకు రెండే నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో 75 శాతం నుంచి 80 శాతం చెరువులు ఎండిపోయాయని చెప్పారు. నీళ్లు ఎత్తిపోసి వాటిని నింపవచ్చన్నారు. నది ప్రవహిస్తుంటే.. ఓవైపు నీళ్లు నింపుకునే అవకాశం ఉన్నా, మరోవైపు బీఆర్ఎస్ హయాంలో పకడ్బందీగా రూపొందించిన వ్యవస్థతో నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉన్నా కూడా గురుదక్షిణ కింద చంద్రబాబు కోసం నీళ్లను దిగువకు విడిచిపెడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ ఎన్డీఎస్ఏ అడ్డంకులు లేవని, రిపేర్లు కూడా లేవన్నారు. ‘కట్టిన ఇళ్లు, పెట్టిన పోయ్యి లెక్క అంతా సిద్ధంగా ఉన్నా నీళ్లు ఎత్తిపోయడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జిల్లాకు నీళ్లు రాకపోతే ఇద్దరు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జిల్లా ఎంపీలు మాట్లాడకపోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. వరంగల్ జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై తాను చర్చకు సిద్ధమని హరీశ్ రావు సవాల్ విసిరారు.

పవర్‌పాయింట్ ప్రజంటేషన్ను తిలకిస్తున్న బీఆర్ఎస్ నేతలు వద్దిరాజు, గంగుల, కేపీ వివేకానంద, కొత్త ప్రభాకర్, ఎల్ రమణ, జీవన్‌రెడ్డి, ఎర్రోళ్ల, దేవీ ప్రసాద్ తదితరులు
మేడిగడ్డ దగ్గర రబ్బర్ డ్యామ్ వేసి నీటిని వాడుకోవచ్చని ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారని హరీశ్‌రావు గుర్తుచేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆ నివేదిక ఇచ్చిన ఈఎన్సీని వారం తిరగకముందే బదిలీచేసి బెంచ్‌పై కూర్చోబెట్టారని, పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం మీద ఇంత పగ, ఇంత ప్రతీకారం ఎందుకని ప్రశ్నించారు. 99 శాతం కాళేశ్వరం ప్రాజెక్టు బాగున్నది కాబట్టే రూ.8 వేల కోట్లు వెచ్చించి మూసీకి నీళ్లు తీసుకొస్తున్నారని చెప్పారు. భేషజాలకు పోకుండా మేడిగడ్డ, సమ్మక్క బరాజ్‌ల నీళ్లు ఎత్తిపోయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘మేడిగడ్డ వద్ద ఎన్ని నీళ్లు పోతున్నయో తెలుసా?.. ఇది అఫీషియల్ డాటా.. రేవంత్‌రెడ్డి లాగా ఏది పడితే అది అస్సలు చెప్పను.. తప్పయితే దేనికంటే దానికి సిద్ధం.. రేవంత్‌రెడ్డి ఏం అన్నడు.. ఎల్ నినో వచ్చింది..సుక్కనీళ్లే లేవ్ అన్నడు.. ఏం ఒత్తాలే అన్నడు.. మరీ ఇది లైవ్ స్ట్రీమ్.. గుగుల్‌కు పోయి వెతికితే ఎవరడిగినా చెబుతది.. మధ్యాహ్నం ఒంటిగంటకు 89,230 క్యూసెక్కుల నీళ్లు వస్తానయ్.. అంటే 7.5 టీఎంసీల నీళ్లు మేడిగడ్డకు వస్తానయ్.. నిన్న 1,22,000 క్యూసెక్కుల నీళ్లు పోయినయ్.. మూడు రోజుల్ల 3, 47,110 క్యూసెక్కుల నీళ్లు పోయినయ్.. రేపు 70 వేల క్యూసెక్కుల నీళ్లు పోతయ్.. ఇది నాది కాదు.. సీడబ్ల్యూసీ లెక్క.. ఇప్పుడు ఈ సమయానికి కన్నెపల్లి పంపులు మోటర్లు ఆన్‌చేస్తే 3 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయొచ్చు.. మరి రేవంత్ రెడ్డి ఏం అంటడు.. వర్షాల్లేవ్.. నల్లా వస్తే కదా.. బిందె నిండేది అంటడు..’
– హరీశ్‌రావు
తుమ్మిడిహట్టికి అనుమతులు తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు ఆడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి రాసిన లేఖలో ‘152 మీటర్ల ఎత్తుకు ప్రాజెక్టు కట్టేందుకు తవ్వకాలు చేపడితే ఖర్చు వృథా అవుతుంది’ అని స్పష్టం చేశారన్నారు. తుమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకుంటే అగ్రిమెంట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిజంగా చూపితే రాజీనామాకు సిద్ధమని హరీశ్‌రావు సవాల్ విసిరారు. లేదంటే ‘రాజకీయాల కోసమే అబద్దాలు మాట్లాడాను’ అని రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే తుమ్మిడిహెట్టి కడతామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. రెండున్నరేండ్లు దాటినా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ దొరకడంలేదా? అని ప్రశ్నించారు. 30 నెలల్లో కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయారా? అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు ఖర్చు పెట్టామని చెబుతున్న రూ.6వేల కోట్లను కాంగ్రెస్ నేతలే బుక్కారన్నారు. ఎలాంటి పనులు చేయకుండానే రూ. 2,328 కోట్లను సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట కాంగ్రెస్ నేతలు పంచుకుతిన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ వచ్చాక మొబిలైజేషన్ అ డ్వాన్స్ విధానాన్ని రద్దు చేశామని గుర్తుచేశారు. కేసీఆర్ వేసిన రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ మేడిగడ్డ బరాజ్ కట్టొద్దని చెప్పిందంటూ రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు ఆడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. మేడిగడ్డ కట్టొద్దని రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. అబద్దాలకు నోబెల్ బహుమతి ఇస్తే అది రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
‘కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ చెఫ్ లాంటిదని సీఎం అంటుండు. ఆ సంస్థను ఎవరు తెచ్చారు? ఆనాటి రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కన్సెల్టెన్సీగా వ్యాప్కోస్ను అపాయింట్ చేశారని, కాంగ్రెస్ పార్టీయే వ్యాప్కోస్ను తీసుకొచ్చిందన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర సరైన నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీడబ్ల్యూసీ చెప్తేనే.. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలని కోరిందన్నారు. సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్ చూపిన ప్రత్యామ్నాయంతోనే మేడిగడ్డ దగ్గర నిర్మాణాలు జరిగాయన్నారు. ‘వ్యాప్కోస్ వాడు చెఫ్ అయితే.. ఈ సూత్రం నీకు కూడా వర్తిస్తది కదా? నువ్వు వ్యాప్కోస్‌కు కన్సల్టెన్సీగా ఇచ్చిన డాక్యుమెంట్లు బయటపెట్టాల్నా?. వాడు ఎట్ల చెప్తే అట్ల ఇచ్చేటోడైతే నువ్వు ఎందుకు ఇచ్చినవ్ రేవంత్‌రెడ్డి?’ అని నిలదీశారు. చెంపలేసుకొని తప్పు ఒప్పుకోవాలని చురకలంటించారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు రావాలని నాడు కాంగ్రెస్ ప్రతిపాదించినట్టుగానే తాము కూడా పనులు ప్రారంభించామని హరీశ్‌రావు చెప్పారు. ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకూ ఎలాంటి మార్పు లేదన్నారు. అయితే.. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవన్నారు కాబట్టే అక్కడ్నుంచి మేడిగడ్డకు వచ్చామని హరీశ్‌రావు స్పష్టత ఇచ్చారు. ‘వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా డీపీఆర్ తయారు చేసి, నివేదిక కేంద్రానికి పంపితే.. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర వాడుకోవచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఈ విషయంలో ఎవరిది తప్పు? నీది తప్పా.. సెంట్రల్ వాటర్ కమిషన్‌ది తప్పా?’ అని ప్రశ్నించారు.
‘కన్నెపల్లి పంప్‌హౌజ్‌లోకి నీళ్లు వచ్చినయ్.. దాని రిటైనింగ్ వాల్ కూలిపోయిందని సీఎం అంటున్నడు. 2022లో గోదావరి నది చరిత్రలో ఎప్పుడూ రానంతగా 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. భద్రాచలం కూడా ఆ రోజు మునిగిపోయింది. అంత వరద వచ్చినప్పుడు కన్నెపల్లి పంప్‌హౌస్‌లోకి నీళ్లు వచ్చినమాట వాస్తవం. ఆ వరద వచ్చిన రెండు నెలల్లో రోజుల్లో ఆ ఏజెన్సీయే రిస్టోర్ చేసి, పంప్‌హౌస్‌ను మళ్లీ సిద్ధం చేసింది. మోటార్లు నడిపినం, నీళ్లు ఎత్తినం, రైతాంగానికి ఇచ్చినం’ అని హరీశ్‌రావు వివరించారు. కానీ, ఆనాడు నీళ్లు వచ్చిన ఫొటో చూపించి అది నడవటం లేదని సీఎం బిల్డప్ ఇస్తున్నడన్నారు. ‘ప్రభు త్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండానే ఏజెన్సీతో పనులు చేయించించి.. 45 రోజుల్లో మళ్లీ మోటార్లు ఆన్చేసినం. ఈ రోజుకు, ఇ ప్పుడు, ఈ నిమిషానికి కన్నెపల్లికి పోయి మోటార్ ఆన్ చేస్తే.. నీళ్లు వస్తాయి’ అని స్పష్టం చేశారు.
తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి సుందిళ్లకు నీళ్లు తెస్తాం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. మరోవైపు సుందిళ్ల కూలిపోయిందని, మేడిగడ్డ మేడిపండయ్యిందని సీఎం, ఉత్తమ్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇదే నిజమైతే సుందిళ్లకు నీటిని ఎలా ఎత్తిపోస్తారని ప్రశ్నించారు. ‘ఒకవేళ సుందిళ్ల బాగున్నదంటే అన్ని బరాజ్‌లు బాగున్నట్టే కదా? ఎందుకంటే అన్నీ ఒకే టెక్నాలజీతో నిర్మించారు. మీ మాటల్లో నిజాయితీ లేదనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి?’ అని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏగా మేడిగడ్డపై రిపోర్టు ఇచ్చిన వ్యక్తి చంద్రశేఖర్ అయ్యర్ అని, ఆయన నాయకత్వంలో ఏపీలో కట్టిన పోలవరం చాలాసార్లు కొట్టుకుపోయిందని గుర్తు చేశారు. దీంతో రూ.7వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. అయినా అక్కడికి ఎన్డీఎస్ఏ వెళ్లదన్నారు. అలాంటి సంస్థ ఇచ్చే నివేదికల విశ్వసనీయత ఎంత? అని ప్రశ్నించారు.
తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని, అబద్ధాలతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం రిపోర్టుకు పూర్తిస్థాయిలో కేంద్రం నుంచి అనుమతి ఉందని, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సహా 18 డైరెక్టరేట్ల నుంచి అనుమతులు తెచ్చామని చెప్పారు. ‘దేశంలోనే అతి తక్కువ ఖర్చుతో పూర్తయిన ది వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం. నువ్వు దానిని మెచ్చుకోవాల్సింది పోయి.. బురద రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నావ్’ అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొనడంపై స్పందిస్తూ.. ‘దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా అంచనా వ్యయం పెరగకుండా ఎక్కడైనా ప్రాజెక్టులు పూర్తయ్యాయా? నీ కొడంగల్-నారాయణపేట లిఫ్టుకు ముందుగా రూ.1450 కోట్లతో జీవో ఇచ్చారు. అది చిన్న ప్రాజెక్టు. అయినా ఈరోజు రూ.4,350 కోట్లకు ఎట్లా పెరిగింది? ఎందుకు పెరిగింది? సమాధానం చెప్పు’ అని నిలదీశారు. కాళేశ్వరం వల్ల 16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలకు పెరిగిందని, నీటి వినియోగం 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు పెరిగిందని, ఆయకట్టు 16 లక్షల ఎకరాల నుంచి 37 లక్షల ఎకరాలకు విస్తరించిందని వివరించారు. పంపింగ్ సామర్థ్యం రోజుకు 1.8 టీఎంసీలకు బదులు 3 టీఎంసీలకు పెరిగిందన్నారు. నాడు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు భూ సేకరణ పునరావాసం కోసం ఎకరానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షలు ఇస్తే, తాము రూ.11-16 లక్షలు ఇచ్చామన్నారు. ఇవన్నీ పెరిగినప్పుడు ప్రాజెక్టు కాస్ట్ పెరగదా? అని నిలదీశారు.
రైతులకు తాగు, సాగు నీళ్లు ఇవ్వడం రేవంత్‌రెడ్డి సర్కారుకు చేతకావడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. తనకు మూడు నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగిస్తే నీళ్లు తెచ్చి చూపిస్తానని సవాల్ విసిరారు. ‘నాకు మూడు నెలలు ఇరిగేషన్‌శాఖ అప్పగించు. నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యాన్ వద్దు, ఫ్యూన్ వద్దు. నీళ్లు ఎలా తేవాలో నేను చూపిస్తా. నీళ్లు పారిచ్చి చూపిస్తా. నేను కొత్తగా ఈ పదవి చేయడం లేదు. 13 ఏండ్లు మంత్రిగా పనిచేసిన. నాకు పదవి అవసరం లేదు. సవాల్ విసిరావు కాబట్టి మాట్లాడుతున్న. రెండుమూడు నెలలు ఇస్తే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తం. బరాబర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తం. ఒకవేళ నీళ్లు తేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఇందుకు నువ్వు సిద్ధమేనా?’ అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ‘రాజకీయాల్లో నవ్వు 20 ఏండ్లు అని చెప్తున్నవ్. నేను 23 ఏండ్లుగా ఎమ్మెల్యేను, నీ కంటే సీనియర్‌ను. ఎమ్మెల్యేగా సీనియర్‌ను, మంత్రిగా సీనియర్‌ను, రాజకీయాల్లో సీనియర్‌ను, నువ్వు నా శిశ్యుడివి. నా వెనుక తిరిగినోడివి. భేషజాలు ఉండాల్సిన అవసరం లేదు. చలో మాట్లాడుదాం.. నీకు కేసీఆర్ అవసరం లేదు. మేము చాలు’ అని పేర్కొన్నారు. .
నువ్వు నా శిష్యుడివి రేవంత్! నవ్వు జడ్పీటీసీ నుంచి సీఎం వరకు అని 20 ఏండ్లు చెప్తున్నవ్. నేను 23 ఏండ్లుగా ఎమ్మెల్యేను. నీ కంటే సీనియర్‌ను. ఎమ్మెల్యేగా సీనియర్‌ను, మంత్రిగా సీనియర్‌ను, రాజకీయాల్లో సీనియర్‌ను. నువ్వు నా శిశ్యుడివి. నా వెనుక తిరిగినోడివి. భేషజాలు ఉండాల్సిన అవసరం లేదు. చలో మాట్లాడుదాం.. నీకు కేసీఆర్ అవసరం లేదు. మేము చాలు.
– హరీశ్‌రావు
‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చి 31 నెలలైంది. కనీసం మేడిగడ్డపై పరీక్షలు చేశారా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ పాలనలో జనవరి నుంచి జూన్ వరకు మూడు సీజన్లలో అవకాశాలు వచ్చినా ఎలాంటి పనులు చేపట్టలేదు. పరీక్షలు చేపట్టలేదు. ఏదీ నీ నిజాయితీ? మేము మూడేండ్లలో ప్రాజెక్టు కడితే.. నువ్వు మూడేండ్లలో పరీక్షలే చేపట్టలేదు. ఇక నీకు మిగిలింది ఒకటే సంవత్సరం. ఆ తర్వాత నువ్వు చేసేది కూడా ఏం లేదు. ప్రజలు నిన్ను ఇంటికి పంపించేది ఖాయం. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో ప్రాజెక్టును రిపేర్ చేస్తాం.. మళ్లీ బరాబర్ నీళ్లు తెస్తాం. నీ ఇజ్జత్ పోకుండా ఉండాలంటే రిపేర్లు చెయ్, కన్నెపల్లి మోటార్లు ఆన్ చెయ్. నీ తప్పులు సరిదిద్దుకోవడానికి నీకిది చివరి అవకాశం’ అని హరీశ్‌రావు హితవు పలికారు.
కేసీఆర్ అమలుచేసిన అన్ని పథకాలు తాము కొనసాగిస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి అబద్దాలు చెప్తున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.19 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు ఆపి, 20 లక్షల మంది ఎస్సీ. ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తుతో అడుకుంటున్నారని విమర్శించారు. ప్రజల్లోకి వస్తే ఏయే పథకాలు ఆపారో తెలుస్తుందన్నారు. పోలీసుల వలయంలో, జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో, బోధి పెవిలియన్‌లో, ఇనుప కంచెలు, ఇనుప గోడల మధ్య రేవంత్‌రెడ్డి ఉంటున్నారని, అందుకే ఏ పథకాలు ఆపారో, ప్రజలు నిత్యం ఎదుర్కొనే కష్టాలు, ఇబ్బందులు ఆయనకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ‘దేనిపైన అయినా మాట్లాడుదామని సీఎం అంటున్నారు. చర్చించడానికి మేము కూడా సిద్ధం’ అని స్పష్టం చేశారు. జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు అని 20 ఏండ్ల రాజకీయ ప్రస్థానాన్ని వేడుకగా జరుపుకున్న రేవంత్‌రెడ్డికి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిన నాయకుడిగా కేసీఆర్‌ను గౌరవించే సంస్కృతి లేదని విమర్శించారు. కేసీఆర్ చావును రేవంత్ కోరుకుంటున్నారని, ఇప్పటికి 20-30 సార్లు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడారని మండిపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. నాడు ఇనుప కంచెలు బద్దలు కొట్టానని బిల్డప్ ఇచ్చి, ఇప్పుడు ఇనుప కంచెల మధ్య బతుకున్నాడని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ పక్కనే రూ.100 కోట్లతో నిర్మించిన క్యాంపు కార్యాలయానికి రూ.17 కోట్లతో ఎందుకు ఇనుప కంచెలు, భారీకేడ్లు పెట్టుకున్నారని సీఎంను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్‌రెడ్డికి లేదని స్ప ష్టంచేశారు. ‘ఎవడురా జై తెలంగాణ అంటున్నది.. అని ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన నువ్వా? ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నది’ అని మండిపడ్డారు. ‘రాజీనా మా చేయమంటే మేమంతా ఒరిజిన ల్ ఇస్తే.. నువ్వు జిరాక్స్ ఇచ్చి తొకముడిచినవ్. ఉద్యమకారుల గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడటం అంటే.. హం తకుడే సంతాప సభ పెట్టినట్టుగా ఉన్నది’ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఉద్యమకారులను ఎమ్మెల్యేలను, ఎంపీలను, స్పీకర్‌ను, కార్పొరేషన్ల చైర్మన్లను చేశారని గుర్తుచేశారు. ఏనాడైనా గన్‌పార్క్ వద్దకు వెళ్లి పూలు వేసి నివాళి అర్పించావా? ఉద్యమంలో ఏనాడైనా జై తెలంగాణ అని నినదించావా? అని రేవంత్‌రెడ్డిని నిలదీశారు.