హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ)/బన్సీలాల్‌పేట్: హైడ్రా భయాందోళనతో ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా హెచ్చరికలతో కూకట్పల్లి యాదవ బస్తీలో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహానికి నివాళులర్పించేందుకు ఆయన ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి శనివారం గాంధీ దవాఖానకు వెళ్లారు. వారిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. మధ్యాహ్నం పోస్ట్‌మార్టం పూర్తయ్యాక బుచ్చమ్మ మృతదేహానికి నివాళ్లర్పించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు.
హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను పొట్టన పెట్టుకుంటుందని ధ్వజమెత్తారు. పేదలపై కనికరం లేకుండా సొంతిండ్లను కూల్చివేస్తుండటంతో భయాందోళనతో గుండెలు ఆగిపోతున్నాయని తెలిపారు. హైడ్రా అధికారులు తమ ఇంటిని కూలుస్తారనే భయంతో కూకట్‌పల్లిలోని నల్లచెరువు వద్ద నివాసముండే బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. పేదలపై విరుచుకుపడుతున్న రేవంత్‌రెడ్డి.. తన సోదరుడు, బడాబాబుల భవంతులను ఎందుకు కూల్చివేయలేదని ప్రశ్నించారు. పేదల ఇండ్లపైకి రాత్రికి రాత్రే బుల్డోజర్లను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. పరిహారం ఇచ్చి, ప్రత్యామ్నా యం చూపాకే పేదల ఇండ్లను తొలగించాలని సూ చించారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పారు.
ప్రజలు భయాందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడవద్దని, జీవించి ఉండి పోరాడాలని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రశాంతం గా ఉన్న హైదరాబాద్‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని, బ్రాండ్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు.నియోజకవర్గంలోని నిరుపేదలు శని, ఆదివారం వచ్చిందంటే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని తెలిపారు. కొద్దిసేపు ఓపీ బ్లాక్ ఎదురుగా ఉన్న మెడికల్ దుకాణాల వద్ద ఉన్న రోగులను హరీశ్ పలుకరించారు. డాక్టర్లు రాసిచ్చిన మందులలో రెండే దవాఖాన ఫార్మసీలో ఇచ్చారని, మిగతావి బయట కొంటున్నామని వారు తెలిపారు.