హరీశ్‌రావు ఏడ నిద్రపోతున్నడు.. రాజీనామా ఎప్పుడు చేస్తవ్.. అని రేవంత్‌రెడ్డి అడుగుతున్నడు. నీ గుండెల్లో నిద్రపోతున్న రేవంత్‌రెడ్డీ.. రైతులకు రుణమాఫీ జరిగేదాకా నిన్ను విడిచిపెట్టను.
-హరీశ్‌రావు
Harish Rao | సిద్దిపేట, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, అన్ని వర్గాలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దసరాలోగా రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని, వచ్చే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా బీఆర్ఎస్ వదిలిపెట్టదని స్పష్టంచేశారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటూ శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలకేంద్రంలో రైతులు నిర్వహించిన ధర్నాలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. రుణమాఫీ, రైతుభరోసా, పంటలకు బోనస్ ధర ఇలా అన్ని విషయాల్లో రైతులను రేవంత్‌రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో.. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ, అవ్వ తాతలకు 4వేల పెన్షన్, అకచెల్లెళ్లకు రూ.2,500 సహా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే రాజీనామా చేస్తానంటూ తాను సవాల్ చేసిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఎమ్మెల్యే పదవి కంటే రైతులకు రుణమాఫీ కావడమే తనకు ముఖ్యమని చెప్పారు. ‘పంద్రాగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మొదట రూ.49 వేల కోట్లు అని, ఆ తర్వాత 31 వేల కోట్లు అని చెప్పి చివరకు మాఫీ చేసింది రూ.17 వేల కోట్లు. నంగునూరు మండలంలోనే 11,000 మంది రైతులు అప్పు తెచ్చుకుంటే ఐదువేల మందికే రుణమాఫీ అయింది. మరి.. ఎక్కడ రుణమాఫీ చేసిండ్రు’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాళేశ్వరం కూలిపోయిందని చెప్తున్న రేవంత్‌రెడ్డి వచ్చి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్‌ను చూడాలని, కాళేశ్వరం కూలిపోతే నీళ్లు ఎట్లా వచ్చాయో చెప్పాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలవదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయని, అందులో మూడు బరాజ్‌లు, 19 పంప్‌హౌజ్‌లు, 18 రిజర్వాయర్లు, సొరంగాలు, కాలువలు, పైపులైన్లు ఉన్నాయని వివరించారు. రెండు పిల్లర్లకి చిన్నపగుళ్లు వస్తే కాళేశ్వరం మొత్తం కూలిపోయిన్నట్టు ప్రచారం చేశారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే ఫారూఖ్‌హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ పాల్గొన్నారు.
నంగునూరు ధర్నాకు తరలివచ్చిన రైతులతో హరీశ్‌రావు ముచ్చటించారు. ఆయా రైతులకు రుణం ఎంత ఉన్నది? ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? రుణమాఫీ కాకపోవడానికి అధికారులు ఏం చెప్తున్నారు? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీ కోసం ఎవరెవరి వద్దకు ఎలా తిరిగామో రైతులు హరీశ్‌రావుకు వివరించారు. ‘మేమంతా రుణమాఫీ కానోళ్లం సార్.. పంట కోతకు వచ్చింది కానీ రైతుబంధు పడలేదు. కేసీఈర్ సార్ ఉన్నప్పుడు రైతుబంధు మంచిగా ఇచ్చిండు. రేవంత్ మాటలకు మోసపోయాం. రుణమాఫీ అయ్యేంత వరకు కొట్లాడుదాం. దసరా వరకు మాఫీ చేయకపోతే సచివాలయంకు వస్తాం.. మాఫీ అయ్యేంత వరకు అక్కడే ఉంటాం’ అని రైతులు చెప్పారు.
హరీశ్‌రావు ఏడ నిద్రపోతున్నడు.. రాజీనామా ఎప్పుడు చేస్తావ్.. అని రేవంత్‌రెడ్డి అడుగుతున్నడు. నీ గుండెల్లో నిద్రపోతున్న రేవంత్‌రెడ్డీ.. రైతులకు రుణమాఫీ జరిగేదాకా నిన్ను విడిచిపెట్టను
– హరీశ్‌రావు
నాకు బ్యాంకుల రెండు లక్షల ముప్పై వేల రుణం ఉన్నది. రెండు రూపాయల చొప్పున అప్పు తెచ్చి మీది రూ.40 వేలు బ్యాంకుల కట్టిన. మిత్తికి తెచ్చి రెండు నెలలు అయింది. లోన్ మాఫీ అయితలేదు. ఏం చేయాల్నో అర్థమైతలేదు. నాకు మూడున్నర ఎకరాల భూమి ఉన్నది. ఇంకా రైతుబంధు రాలె. కాంగ్రెస్‌ది ఏమి సర్కారో ఏమో. – జక్కుల యాదరిగి, రైతు, గట్లమల్యాల, సిద్దిపేట జిల్లా
నాకు ఎకరం ఒక గుంట భూమి, రూ.58 వేల క్రాప్ లోన్ ఉన్నది. బ్యాంకుకు వెళ్తే వ్యవసాయ అధికారులను అడుగుమన్నరు. వచ్చే నెలలో లోన్ రెన్యువల్ ఉన్నది. కట్టకపోతే వడ్డీ ఎస్తమంటుర్రు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు రూ.5 వేలపైన పడుతుండే. ఇప్పుడు రైతుబంధు రాక పెట్టుబడికి రూ.10 వేల అప్పు తెచ్చిన.
-దుర్గారెడ్డి, రైతు, నంగునూరు, సిద్దిపేట జిల్లా