హైదరాబాద్: కేబినెట్ నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయమని, క్వశ్చన్ అవర్‌లో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ జిల్లాలోని నీటి సమస్యలను గురించి సంబంధిత మంత్రిని ప్రశ్నించారు. దీనిపట్ల హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల్లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడటం ఏంటని, ఒక మంత్రి మరో మంత్రిని ప్రశ్నించడం ఏంటన్నారు. కొత్త సంస్కృతిని సభలో తీసుకురావద్దని స్పీకర్‌ను కోరారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి మంత్రిగా ఉన్నారని, వారి హయాంలోనే మూసీ మురికి కూపంగా మారిందన్నారు. అప్పుడు వారు సరిగ్గా చేసిఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు.
అయితే ఏ హోదాలో అడుగుతున్నారని హరీశ్‌రావును మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఆయనకు అడిగే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు సూచించారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అతిఎక్కువ పాలించింది కాంగ్రెస్ పార్టీ. నేడు మూసీ వల్ల నల్లగొండ జిల్లా ప్రజలు బాధపడుతున్నారంటే దానికి ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే నన్నారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 పనులు పూర్తిచేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రజలకు అందించేదే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందే, తాము ఏం చేశామో చర్చ పెట్టాలన్నారు. ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నకు సూటిగా జవాబు వచ్చినట్లయితే పది ప్రశ్నలకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతిరోజు మూడు నాలుగు ప్రశ్నలకే సభాసమయం సరిపోతుందని, ఒక్కో ప్రశ్నకు సూటిగా సమాధానం వచ్చేలా చూడాలన్నారు. మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే తాము కల్పించుకోవాల్సి వస్తుందన్నారు. అలాంటి వాటికి మరోసారి అవకాశం ఇవ్వొద్దని స్పీకర్‌ను కోరారు.
Live: అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish https://t.co/uorXTXgrVG
— BRS Party (@BRSparty) December 19, 2024