2023లో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 83,025 భారీ మెజారిటీతో గెలుపొందాను. చట్టసభకు వరసగా ఏడుసార్లు ఎన్నికయ్యా. 2014, 2019లోనూ అసెంబ్లీకి ఎన్నికై నీటిపారుదల, శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక ఇతర శాఖలకు మంత్రిగా సమర్థంగా పనిచేశా. ఉత్తమ ప్రజాప్రతినిధుల్లో ఒకరిగా నిలిచాను. ప్రజాజీవితంలో ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు సేవచేస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజలతో మమేకమైన నన్ను అప్రతిష్ఠపాలు చేసేందుకే పంజాగట్టులో తప్పుడు ఫిర్యాదు చేశారు.
– హరీశ్‌రావు
Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 4, (నమస్తే తెలంగాణ): తనపై అసత్య ఆరోపణలతో కాంగ్రెస్ నాయకుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ కుట్రపూరితంగా చేసిన ఫిర్యాదుతో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హైకోర్టులో బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చక్రధర్‌గౌడ్ కుట్రతోనే పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేయించానంటూ తనతోపాటు రాధాకిషన్‌రావు, ఇతరులపై ఇచ్చిన ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ చేయకుండానే పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారని తెలిపారు. కేసులో తనను పోలీసులు అరెస్టు చేస్తే మచ్చలేని తన రాజకీయ జీవితానికి సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ట్యాపింగ్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చక్రధర్ తర్వాత దానిని ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు.
‘చక్రధర్‌గౌడ్ ఫోన్‌ను ట్యాపింగ్ చేయించానని పేరొనడం విడ్డూరం. ఫిర్యాదుదారుడికి హాని కలిగించానని చెప్పడానికి ఆధారాలు లేవు. నేను ప్రజా సమస్యలను పరిషరిస్తూ జనంతో మమేకం అవ్వడంతో ఓర్వలేక చక్రధర్ నిరాధార ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఎన్నికలో నాపై చిత్తుగా ఓడిపోయారు. నా ఎన్నికను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రజాక్షేత్రంలో ఎదురొనలేక అడ్డదారిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు” అని హరీశ్‌రావు వివరించారు.
“సేవా సంస్థ ద్వారా సేవ చేస్తుంటే ఓర్వలేక తాను చక్రధర్‌గౌడ్‌ను బెదిరించానని ఫిర్యాదులో పేరొనడం విస్తుగొల్పుతున్నది. సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి బీజేపీ టికెట్ రాకపోవడంతో బీఎస్పీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల సమయంలో కూడా బెదిరించానని చెప్పడం ఇంకా దారుణం’ అని హరీశ్ పేర్కొన్నారు.
పోలీసులు ప్రాథమిక విచారణ లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా కేసులు నమోదు చేయించి రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని, పగ, ప్రతీకారంతోనే కేసు నమోదు చేశారని హరీశ్‌రావు తెలిపారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ ఫిర్యాదు అన్యాయమని, ఫిర్యాదులో పేర్కొన్న నేరాలతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. దీనిని రాజకీయంగా ప్రేరేపిత కేసుగా పరిగణించి, ఫిర్యాదును ప్రాథమిక దశలోనే కొట్టేయాలని కోరారు. దీనిపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసు కొనసాగితే చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని కేసులో స్టే మంజూరు చేయాలని, తుది తీర్పులో ఫిర్యాదును కొట్టేయాలి.. అని హరీశ్‌రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో హైకోర్టును కోరారు.
తప్పుడు కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని, కేసు దర్యాప్తుతో సహా తదుపరి ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును హరీశ్‌రావు కోరారు. తుది ఉత్తర్వుల్లో పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. తాను మంత్రిగా ఉండగా ఫోన్ల ట్యాపింగ్ చేయించానంటూ చక్రధర్‌గౌడ్ ఈ నెల 1న చేసిన ఫిర్యాదుకు ఆధారాల్లేవని తెలిపారు. ఈ ఫిర్యాదును తీవ్ర జాప్యంతో చేయడానికి కారణాలు కూడా వివరించలేదని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్పై స్టే మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని, తుది తీర్పులో ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, చక్రధర్‌గౌడ్‌ను ప్రతివాదులుగా చేర్చుతూ దాఖలు చేసిన ఈ క్రిమినల్ పిటిషన్‌ను గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ విచారించనున్నారు.