సిద్దిపేట, ఏప్రిల్ 29: రైతులకు పంట రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మరీ మాట తప్పిన రేవంత్ సరార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు న్యాయపోరాటం చేస్తున్నారు. రుణమాఫీ జరుగక రైతులు పడుతున్న కష్టాలు, కన్నీళ్లను చూసి చలించిపోయిన హరీశ్‌రావు.. వారి పక్షాన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో పంట రుణమాఫీకి అర్హులైన రైతులు 43,363 మంది ఉన్నారు. వీరిలో 20,514 మంది రుణమాఫీ ప్రయోజనం పొందారు. మిగిలిన 22,849 మంది రైతులు పంట రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గం లో 47% మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే హరీశ్‌రావు పలుసార్లు సీఎం, మంత్రులు, యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. కానీ, పట్టించుకోక పోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.
మాట తప్పిన సీఎం రేవంత్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఆపై రుణం ఉన్న రైతులు ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందని షర తు విధించింది. ఈ మాట నమ్మి ఎంతోమంది రైతులు అప్పులు చేసి, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి మరీ ఆమొత్తాన్ని చెల్లించారు. కానీ సర్కార్ నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది.
హైకోర్టులో పిటిషన్ వేశా: హరీశ్‌రావు
సిద్దిపేట నియోజకవర్గంలోని వేలాది మంది రైతుల కష్టాలను పరిగణనలోకి తీసుకుని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద హైకోర్టును ఆశ్రయించానని స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు పడుతున్న ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో వెంటనే రుణమాఫీ సొమ్ము జమ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన 22,849 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేయాలని కోరారు.