ఎవరి కోసం మూసీ సుందరీకరణ చేపడుతున్నారో.. ఇందులో ఎవరెవరి హస్తమున్నదో బట్టబయలు చేస్తం.. 30 ఏళ్ల క్రితం కట్టుకున్న పేదల ఇండ్లను కూల్చడానికి ఇదేం మీ అయ్య జాగీరు కాదు
– హరీశ్
Harish Rao | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు రక్షణ ఇవ్వాల్సింది పోయి మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ సర్కార్ పేదల బతుకులను ఆగం చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. మూసీ వెంట బడుగు వర్గాలు కట్టుకున్న ఇండ్లను కూలగొట్టి ప్రపంచ బ్యాంకుకు భూములను కుదువపెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారని విమర్శించారు. పేదల జీవితకాల కష్టార్జితాన్ని కూల్చివేసి కట్టించేవి రిసార్టులు, హోటళ్లా? అని ప్రశ్నించారు. మూసీ అభివృద్ధి పేరిట కాంగ్రెస్ సర్కార్ పేదల కండ్లలో రక్తం చూస్తున్నదని
ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరంలోని మూసీ పరీవాహక ప్రాంతాలైన హైదర్షాకోట్, లంగర్‌హౌస్‌లోని హసీంనగర్ ప్రాంతాల్లో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ ఆలీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, స్వామిగౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకుల బృందం ఆదివారం పర్యటించింది.
బాధితుల భుజం తట్టి భరోసానిస్తూ ముందుకు కదిలింది. కాయకష్టం చేసి కట్టుకున్న పేదల ఇండ్లను కూల్చకుండా రేవంత్ సర్కార్‌ను నిలువరిస్తామని బాధితులకు అభయమిచ్చింది. వేలాది మంది బాధితులు కలిసి తీసిన ర్యాలీలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మూసీ పేరిట జరుగుతున్న రియల్ ఎస్టేట్ దందాలు, అక్రమణల కోసం పేదల బతుకులను ఆగం చేయవద్దని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. కనీసం మ్యానిఫెస్టోలో లేని విషయం కోసం పేదల ఇండ్లను కూల్చడం ఎందుకని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల్లో ఒక్కటీ పరిపూర్ణంగా అమలు కాలేదని, పేదల బతుకులు కూల్చే మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. హైదరాబాద్‌ను పునర్నిర్మాణానికి కేసీఆర్ చేయూతనిస్తే.. రేవంత్‌రెడ్డి కూలగొట్టే కార్యక్రమాలను ముందట వేసుకున్నారని మండిపడ్డారు. ఇక్కడున్న నిర్మాణాలకు కాంగ్రెస్ హయాంలోనే పట్టాలు, పర్మిషన్లు ఇచ్చారని, ప్రజలు అన్ని రకాల ట్యాక్సులు కడుతున్నారని, కేసులు పెట్టేదుంటే ఏ ప్రభుత్వమైతే అనుమతులిచ్చిందో దానిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం నడవదని ప్రచారం చేస్తుంటే.. రేవంత్‌రెడ్డి పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపుతూ గుండారాజ్యాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును తొలగించి బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. బాధితులెవరూ అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇండ్లపైకి వచ్చే బుల్డోజర్ల ముందు గులాబీ దండు ఉంటుందని స్పష్టంచేశారు. ఇండ్లను కూల్చాలంటే ముందు తమను దాటుకొని రావాలన్నారు.
సర్కార్‌పై మండిపడ్డ మాజీ మంత్రులు
అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను విడిచి కాంగ్రెస్‌లో చేరిన ప్రకాశ్‌గౌడ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్లేసి గెలిపించిన బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు ఇబ్బందుల్లో ఉంటే ఆయన ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని విడిచి ప్రజల మనిషి కాకుండా పోయాడని విమర్శించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మూసీ బాధితులకు డబుల్ బెడ్రూం ఇస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి, అంతకు ముందే 60వేల మందికి అలాట్ చేశారని, ఏ ఒక్క ప్రాజెక్టులోనూ ఇండ్లు ఖాళీ లేవని, 16వేల మంది బాధితులకు ఇస్తామన్న ఇండ్ల వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మూసీ పేరిట కాంగ్రెస్ చేస్తున్న ఆరాచకాలతో పేదల ఇండ్లు కూలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించిన చందంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
మూసీ వెంట ఆందోళనలు, ఆక్రందనలు
నగరంలో విస్తరించి ఉన్న మూసీ పరీవాహక ప్రాంతాల కాలనీలు, బస్తీలన్నీ ఆందోళనలు, ఆక్రందనలతో నిండిపోయాయి. కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో పేదలు రోడ్డున పడుతున్నారు. ఈ క్రమంలో మూసీ వెంట పలు కాలనీల ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సీఎం రేవంత్‌రెడ్డి తీరును ఎండగడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న ఇండ్లను బుల్డోజర్లతో కూలగొడుతున్న కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు.
బుల్డోజర్ రాజ్యం నడవదని రాహుల్ గాంధీ ప్రచారం చేస్తుంటే.. పేదల ఇండ్లపైకి రేవంత్‌రెడ్డి బుల్డోజర్లతో గూండా రాజ్యాన్ని అమలు చేస్తున్నడు.. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి
-హరీశ్
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటీ పరిపూర్ణంగా అమలు కాలే.. మహిళలకు ఇచ్చేందుకు రూ.2500 లేవుగాని, లక్షన్నర కోట్లతో పేదల బతుకులు కూల్చే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ఎలా చేపడుతరు? పెన్షన్ డబ్బులు ఎప్పుడిస్తావని నిలదీస్తే పైసల్లేవని చేతులెత్తేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మూసీకి లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తరు? -హరీశ్ బాధితులెవరూ అధైర్యపడొద్దు. బీఆర్ఎస్ అండగా ఉంటది. మీ ఇండ్లపైకి వచ్చే బుల్డోజర్ల ముందు గులాబీ దండు నిలబడుతది. మీ ఇండ్లను కూల్చాలంటే మమ్మల్ని దాటుకొని రావాలి. -హరీశ్
వంటావార్పుతో నిరసన
మూసీ పరీవాహక ప్రాంతమైన న్యూమారుతీనగర్ నార్త్ కాలనీలోని ప్రధాన కూడలి వద్దకు మహిళలు ఆదివారం పెద్దఎత్తున తరలివచ్చి రోడ్లపైనే వంటావార్పు నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. తమ ఇండ్లను కూల్చాలని చూస్తే తగినరీతిలో సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్తామంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పాటలు పాడారు. ఇండ్లను కూల్చాలని వచ్చే వారికి ఎదురొడ్డి నిలబడతామని ప్రతిజ్ఞ చేశారు. ప్రజాపాలన.. మార్పు అంటూ వచ్చి తమను నట్టేట ముంచాలని చూస్తున్న ముఖ్యమంత్రికి మహిళాలోకం తలచుకుంటే ఏం చేస్తుందో చూపుతామని హెచ్చరించారు. ఇక నుంచి రోడ్లపైనే వంటావార్పు నిర్వహిస్తూ తమపై దాడికి వచ్చే వారికి తగిన బుద్ధి చెప్తామన్నారు. చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తా సహకారంతో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. మూసీ అభివృద్ధి పేరిట ప్రజలను రోడ్డు పాలు చేస్తామంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కూల్చడమే ప్రజాపాలనా?
పేదల ఇండ్లను కూల్చడమే ప్రజాపాలనా?. పేదలంటే కాంగ్రెస్‌కు ఎందుకింత కక్ష? మా ఇండ్లు కూల్చి మమ్మల్ని రోడ్డు పాలు చేయడమే సీఎం లక్ష్యంగా కనిపిస్తున్నది. పేదల ఇండ్లను కూల్చడం కాదు.. కబ్జాలు చేసి కట్టిన బడాబాబుల ఇండ్లను కూల్చాలి.
– జ్యోతి, ఫణిగిరి కాలనీ
కబ్జాకోరులం కాదు
పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు మాది. మేమేం కబ్జా కోరులం కాదు. 20 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నం. అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇంటిని కూలుస్తామంటే ఎలా ? మా ప్రాణాలు పణంగా పెట్టయినా ఇండ్లను కాపాడుకుంటం. పది రోజులుగా మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నరు. ఏ రాత్రి ఎవరు వచ్చి ఇండ్లు కూలగొడుతరోనని భయపడుకుంట
బతుకుతున్నం.
– శైలజ, ఫణిగిరి కాలనీ
భూములు అమ్ముకొని కట్టుకున్నం
పిల్లల భవిష్యత్తు, ఉన్నత చదువుల కోసం గ్రామాల నుంచి వలస వచ్చి బతుకుతున్నం. ఇక్కడ అద్దెలు కట్టలేక ఊర్లో ఉన్న భూములను అమ్ముకొని ఇక్కడ స్థలాలు కొన్నం. ఆ సమయంలోనే అన్ని అనుమతులు తీసుకొని ఇల్లు కట్టుకున్నం. మేం కట్టుకుంటున్న ఇల్లు బఫర్జోన్లోనో, ఎఫ్టీఎల్లోనో ఉంటే ఎలా అనుమతులు ఇచ్చిండ్రు? కష్టపడి కట్టుకున్న ఇంటికి ఇప్పుడు మార్కింగ్ చేసి ఖాళీ చేసి వెళ్లుమంటే ఎక్కడికిపోవాలి?
– సత్యశ్రీ, ఫణిగిరి కాలనీ
డబుల్ బెడ్రూం వద్దు
లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి కట్టుకున్న ఇంటిని ఖాళీ చేసిపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నరు. మీరిచ్చే డబుల్ బెడ్రూం ఇల్లు మాకు అవసరం లేదు. మా ఇంటికి ఖాళీ చేసే ప్రసక్తే లేదు. అవసరమైతే ప్రాణాలు తీసుకుంటం కానీ ఇల్లు ఖాళీ చేయం. బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే ప్రాణాలు తీసుకుంటం. పేదలను చంపి మూసీని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నట్టున్నది.
– శ్రీనివాస్, ఫణిగిరి కాలనీ