Harish Rao | రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటల సాగు ముందుకుపోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని వివిధ జిల్లాలోని రిజర్వాయర్లు మిడ్ మానేర, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి సుమారు ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజి 6 వద్ద గల మోటార్లను ఆన్ చేసి నీటిని పంపింగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్‌రావు లేఖ రాశారు.
ప్రస్తుత వానాకాలం పంట సీజన్లో రైతులు ఇటు వర్షాభావం, అటు ప్రాజెక్టుల్లో రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం ద్వారా పంటల సాగు ముందుకు పోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు. అన్నారు. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన వచ్చే ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టడం కోసం సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌లను ఆన్ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన శ్రీ పాద ఎల్లంపల్లి రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుత సుమారు 14 టీఎంసీలల నీటి లభ్యత ఉన్నదని హరీశ్‌రావు అన్నారు. కడెం నుంచి దాదాపు 22,300 క్యూసెక్కుల వరద ఉందన్నారు. అదేవిదంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు లో (SRSP ) పూర్తి నీటి సామర్థ్యం 80 టీఎంసీలు, ప్రస్తుతం సుమారు 45 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదని తెలిపారు.
అదేరకంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో ఇన్‌ఫ్లో పెరిగిందని.. ఇట్టి విషయం దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకెజ్ -6 వద్ద గల నంది పంప్ హౌస్‌లోని మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించి తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మిడ్ మానేరు, అన్నపూర్ణ (అంతగిరి), రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ లను నింపాలని డిమాండ్ చేశారు. ఆయా రిజర్వాయర్ల పరిధిలోని చెరువులను, చెక్ డ్యామ్ లను అన్నింటిని నింపి సుమారు 5లక్షల ఎకరాల కు నీరందించేలా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నీటి పంపింగ్ చేపట్టాలని కోరారు.
లోయర్ మానేరు డ్యామ్ (LMD) పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి లభ్యత ఏడు టీఎంసీలు ఉన్నాయని హరీశ్‌రావు తెలిపారు. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు (LMD) కు నీటిని నింపి ఎస్సారెస్పీ స్టేజి-2 లోని అవసరమైన ఆయకట్టు కు ఖరీఫ్, రబీ పంటకు నీరు అందించి రైతులను అదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గత యాసంగి పంట లో కాళేశ్వరం ప్రాజెక్టు లోని రిజర్వాయర్ల పై ఆయకట్టు పరిధిలో 5 లక్షల ఎకరాలు సాగు అయిన విషయం గుర్తించి ఈ వానాకాలం పంటకి అదేవిధంగా వచ్చే యాసంగి పంటకు కూడా సాగు నీరు అందించేలా కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలోని అన్ని రిజర్వాయర్ నింపి తద్వారా వాటి అనుసంధానం గా నిర్మించిన కాలువ లు, చెరువు లు చెక్ డ్యామ్ ల అన్నింటిని నింపి రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించి రైతు సాగు ప్రయోజనాల దృష్ట్యా రాజకీయలకు అతీతంగా వెంటనే నీటి పంపింగ్ ప్రారంభించేల చర్యలు చేపట్టాలని కోరారు.