విద్యాబుద్ధుల్లేని, క్రిమినల్ కేసులున్న సీఎంలలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిన వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యం. సీఎంగా, విద్యాశాఖ, మున్సిపల్, హోంశాఖల మంత్రిగా ఫెయిల్ అయిన రేవంత్ కలెక్షన్ల మంత్రిగా మాఫస్ట్ ర్యాంకులో పాసైండు.
-హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): అధికార కాంగ్రెస్ నేతలు (Congress) జాబులు నింపుడు వదిలి జేబులు నింపుకొనే పనిలో మునిగి తేలుతున్నారని, పనుల్లో కమీషన్లు, ఫ్యాక్టరీల్లో వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) దెప్పిపొడిచారు. బోగస్ హామీలతో మోసం చేసిన రేవంత్‌రెడ్డి కండ్లు తెరిపించాల్సిన సమయం ఆసన్నమైందని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. నేడు నిరుద్యోగులు
విడుదల చేసిన ‘కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డులు’.. రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకోవాలని నిలదీస్తున్నాయని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో కాంగ్రెస్ నిరుద్యోగ బాకీకార్డులను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, బీఆర్ఎస్ నేతలు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, నిరుద్యోగ జేఏసీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాలిస్తామని, యువతకు రాజీవ్ యువవికాసం కింద రుణాలిస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఉద్దెర హామీలను గద్దెనెక్కగానే గాలికొదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు పెట్టి, ఫలితాలు ప్రకటిస్తే కాగితాలిచ్చిన ముఖ్యమంత్రి ఇది తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
రేవంత్..దమ్ముంటే చిక్కడపల్లికి రా!
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చానని నమ్మకముంటే, దమ్మూ ధైర్యముంటే పోలీసులు లేకుండా అశోక్‌నగర్ చౌరస్తాకో, చిక్కడపల్లి లైబ్రరీకో, దిల్సుఖ్నగర్కో రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్ సవాల్ విసిరారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చిన ఘనత రేవంత్‌కే దక్కిందని ధ్వజమెత్తారు. రాజీవ్ యువవికాసం వికసించకముందే వాడి పోయిందని ఎద్దేవాచేశారు. జూన్ 2న ఐదు లక్షల మంది నిరుద్యోగులకు సాయం చేస్తామని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయని నిప్పులు చెరిగారు. ఢిల్లీ నుంచి వచ్చి చేతులూపుకుంటూ హామీలిచ్చిన గాంధీలు పత్తాలేకుండాపోయారని దెప్పిపొడిచారు.
జాబ్ నోటిఫికేషన్ వదిలి మద్యం నోటిఫికేషన్
అధికారంలోకి రాగానే ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామనే హామీని విస్మరించిన కాంగ్రెస్, రెండు నెలల ముందుగానే మద్యం నోటిఫికేషన్ ఇచ్చిందని హరీశ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు జాబులు ఇచ్చుడు వదిలిపెట్టి జేబులు నింపుకొనే పనిలో మునిగి తేలుతున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ తీరును నిరసిస్తూ నామినేషన్లు వేసిన నిరుద్యోగులు ఓటుతో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. ‘చేతిలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని చెయ్యి పార్టీకి షాక్ ఇవ్వాలె. ఆనాడు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు బస్సుయాత్ర చేసిన నిరుద్యోగులు.. ఇప్పుడు ఓడించి సురుకుపెటాలె’ అని పిలుపునిచ్చారు. లేకుంటే వచ్చే మూడేండ్లు మోసపోవడం తప్ప చేసేదేం ఉండదనన విషయాన్ని విస్మరించవద్దని సూచించారు.
నాడు ఉద్యోగాలిచ్చినం..నేడు అసెంబ్లీలో కొట్లాడినం..
కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు మేలు జరిగిందని హరీశ్ పునరుద్ఘాటించారు. రెండేండ్లు లోకల్ రిజర్వేషన్ కోసం, ఆ తర్వాత కరోనా కారణంగా మరో రెండేండ్లు ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని చెప్పారు. కేసీఆర్ చిత్తశుద్ధితో రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి 95 శాతం లోకల్కోటా సాధించారని గుర్తుచేశారు. తదనంతర కాలంలో 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారని, మరో 80 వేల ఖాళీలకు నోటిఫికేషన్లు జారీ చేశారని తెలిపారు. 15,400 ఎస్ఐ, కానిస్టేబుల్, 9 వేల గురుకుల టీచర్లు, 8 వేల గ్రూప్-4, హెల్త్ డిపార్ట్మెంట్లో 7 వేలు, 1300 జేఎల్, 6 వేలతో డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. టీఎస్ ఐపాస్ తెచ్చి పెట్టుబడులను ఆకర్షించామని, పెద్దసంఖ్యలో ఉద్యోగాలు సృష్టించామని, కానీ గిట్టనివారు చేసిన దుష్ప్రచారాన్ని నిరుద్యోగులు నమ్మడం దురదృష్టకరమని వాపోయారు. ప్రతిపక్షంలోనూ బీఆర్ఎస్ నిరుద్యోగుల పక్షాన పోరాడుతునే ఉన్నదని స్పష్టంచేశారు. అసెంబ్లీలో జీవో 29, 55 ద్వారా అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై గట్టిగా నిలదీశానని పేర్కొన్నారు. సీఎం పట్టించుకుంటలేరని, దళిత మంత్రి అయిన ఉప ముఖ్యమంత్రిని అడిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.
కలెక్షన్ల సీఎం రేవంత్
విద్యాబుద్ధుల్లేని, క్రిమినల్ కేసులున్న సీఎంలలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిన వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యామని హరీశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ, మున్సిపల్, హోంశాఖల మంత్రిగా ఫెయిలైన రేవంత్‌రెడ్డి కలెక్షన్ల మంత్రిగా ఫస్ట్ ర్యాంకులో పాసయ్యాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన శాఖల పరిధిలోని అంశాలపై సమీక్షలు చేయడం మానేసి జూబ్లీహిల్స్ ఫ్యాలెస్‌లో కూర్చుండి సెటిల్మెంట్లు మాత్రం దర్జాగా చేస్తున్నారని నిప్పులు చెరిగారు.కేసీఆర్ పాలనలో పెట్టుబడిదారులకు రెడ్‌కార్పెట్ పరిచి స్వాగతించామని, ప్రస్తుతం ముఖ్యమంత్రి, మంత్రులు పారిశ్రామికవేత్తల కణతలకు గన్నులు పెట్టి బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయం స్వయంగా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వెల్లడించిందని గుర్తుచేశారు. కమీషన్ల కోసం మంత్రులు పెడుతున్న ఇబ్బందులు భరించలేకే ఓ సిన్సియర్, సీనియర్ ఐఏఎస్ అధికారి వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
బస్సు ప్రమాద మృతులకు నివాళి
కర్నూలు బస్సు ప్రమాద మృతులకు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, నిరుద్యోగులు నివాళులర్పించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, బీఆర్ఎస్ నేతలు గెల్లుశ్రీనివాస్ యాదవ్, ఏనుగుల రాకేశ్‌రెడ్డి తదితరులు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
నిరుద్యోగులకు అండగా బీఆర్ఎస్
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చేసే పోరాటానికి బీఆర్ఎస్ మద్దతిస్తుందని హరీశ్ భరోసా ఇచ్చారు. వారిపక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టంచేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా సర్కారు వెంటపడుతామని తేల్చిచెప్పారు. అవసరమైతే ప్రత్యక్ష పోరాటంలో పాలుపంచుకుంటామని చెప్పారు. నిరుద్యోగ యువత సైతం ఆలోచించాలని కోరారు. మోకా కోసం ధోకా చేసిన కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని విజ్ఞప్తిచేశారు. జూబ్లీహిల్స్ నుంచే కాంగ్రెస్ పతనానికి నాంది పలకాలని, ఇంటింటికీ వెళ్లి నిరుద్యోగ బాకీ కార్డులు పంచి ప్రభుత్వ మోసపూరిత విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
చెయ్యి గుర్తుకు ఓటేస్తే ఏటా 2 లక్షల ఉద్యోగాలిస్తామని, ప్రతినెలా రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీలిచ్చిన రేవంత్‌రెడ్డి..
నిరుద్యోగులను వేడుకుని, వాడుకొని గద్దెనెక్కిన తర్వాత వదిలేసిండు. అశోనగర్లో రాహుల్‌గాంధీతో సరూర్‌నగర్ స్టేడియంలో ప్రియాంకగాంధీతో మాయమాటలు చెప్పించి ఇప్పుడు నట్టేట ముంచిండు.
-హరీశ్‌రావు
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చానని నమ్మకముంటే.. దమ్మూ ధైర్యముంటే పోలీసులు లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి అశోక్‌నగర్ చౌరస్తాకో.. చిక్కడపల్లి లైబ్రరీకో.. దిల్సుఖ్నగర్కో రావాలి. మోసం చేసిన నిన్ను నిరుద్యోగులు బట్టలూడదీసి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నరు.
-హరీశ్‌రావు
నిరుద్యోగులు దండుకట్టాలె. దగా చేసిన కాంగ్రెస్‌ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడగొట్టాలె. ఏమాత్రం పొరపాటు చేసినా మళ్లీ హస్తం నేతల మోసాల పరంపర కొనసాగుతూ ఉంటదనే విషయాన్ని గుర్తుంచుకోవాలె. -హరీశ్‌రావు