హైదరాబాద్, జూన్ 25 (నమస్తేతెలంగాణ): ‘ఆర్డీఎస్ నీటివాటా విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పష్టమైన హామీ సాధించారా? ఆంధ్రావైపు ఉన్న ఆర్డీఎస్ తూములను శాశ్వతంగా మూసివేసేలా, ఆనకట్టకు మరమ్మతులు చేసేలా ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించా రా? కర్ణాటక పరిధిలోని ఆర్డీఎస్ కాలువ కు తక్షణమే మరమ్మతులు చేసి, క్రమం త ప్పకుండా నిర్వహించేలా ఆ రాష్ట్రం నుంచి హామీ పొందారా? మరి కర్ణాటకలో గురువారం మూడు రాష్ర్టాల సీఎంల భేటీ లో ఏం సాధించారని సువర్ణాధ్యాయం అవుతుంది రేవంత్‌రెడ్డీ?’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ నీటిహక్కుల పరిరక్షణను గాలికొదిలి కర్ణాటకలో ప్రచారం పేరిట రేవంత్ చేసిన డ్రామాలతో తెలంగాణకు నిష్ప్రయోజనమేనని ఘాటుగా వ్యా ఖ్యానించారు. ఆర్డీఎస్ కింద తెలంగాణకు దక్కాల్సిన నీటివాటాను ప్రతిసారీ కోల్పోవాల్సి వస్తుందని గురువారం ఎక్స్ వేదిక గా పేర్కొన్నారు.
తుంగభద్రా డ్యామ్ గేట్లు మార్చినంత మాత్రాన తెలంగాణకు రావాల్సిన 15.90 టీఎంసీల నీరు ఎలా వస్తుం దో? చెప్పాలని నిలదీశారు. 75 ఏండ్లుగా పాతగేట్లు పనిచేస్తూనే ఉన్నాయని, అయినా ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు ఏనాడూ 5 టీఎంసీలకు మించి నీళ్లురాలేదని తెలిపారు. తుంగభద్రా డ్యామ్ గేట్లు మార్చడానికి, తెలంగాణకు దక్కాల్సిన 15.90 టీఎంసీల నీటి వాటాకు ఎలాంటి సంబంధంలేదని తేల్చి చెప్పారు. ఈ కీలకమైన విషయంపై రేవంత్‌రెడ్డి సాధించిన హామీ ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ‘సిస్టమ్ లాసెస్ అనే వాదనను ఎందుకు అంగీకరించారు.. కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్ అవార్డులో ఈ సిస్టమ్ లాసెస్ అనే విధానానికి అసలు గుర్తింపేలేదు’ అని పేర్కొన్నారు. ట్రిబ్యునల్ అవార్డు పరిధిలో లేని ఈ వాదనను అడ్డుపెట్టుకొని మనకు దక్కాల్సిన న్యాయమైన వాటాను తగ్గించేందుకు వీళ్లేదని తేల్చిచెప్పారు.
ఏడాది నుంచి ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను పరిమితికి మించి వాడుకొంటున్న తీరును రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని హరీశ్‌రావు నిలదీశారు. కేసీ కెనాల్ కోసం సుంకేశుల వద్ద ఆంధ్రా ప్రభుత్వం ఏకంగా 39 టీఎంసీల నీటిని వాడుకొంటున్నదని విమర్శించారు. దీనికితోడు కర్ణాటకతో కుమ్మక్కై కేసీ కెనాల్‌కు వెళ్లాల్సిన సుమారు 10 టీఎంసీల నదీజలాలను ఆర్‌బీహెచ్‌ఎల్‌సీ, ఆర్బీఎల్ఎల్సీలకు మళ్లిస్తున్నదని, దీంతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా రేవంత్‌రెడ్డి ఎందుకు నిలదీయలేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కులకు ముప్పుగా మారే కొత్త ప్రాజెక్ట్‌లను ఎందు కు వ్యతిరేకించలేదు? అని ప్రశ్నించారు.
తుంగభద్రా డ్యామ్, ఆర్డీఎస్ మధ్యలో సుమారు 35 టీఎంసీలు వినియోగించుకొనేలా కర్ణాటక ప్రభుత్వం నావలి రిజర్వాయర్, ఆర్డీఎస్, సుంకేశుల మధ్య 20 టీఎంసీలు వాడుకొనేలా ఏపీ సర్కార్ గుండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నాయని హరీశ్‌రావు తెలిపారు. ఆ రెండు ప్రాజెక్టులతో కృష్ణాజలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆ రెండు ప్రాజెక్టులపై రేవంత్‌రెడ్డి ఎందుకు అభ్యంతరం తెలుపలేదని నిలదీశారు. ఇన్ని సమస్యలు పెట్టుకొని సంబురాలు చేసుకోవడమెందుకో? అర్థం కావడంలేదని దెప్పిపొడిచారు. తెలంగాణకు దక్కాల్సిన 15.90 టీఎంసీల నీటివాటాను సాధించారా? అని ప్రశ్నించారు.