మోర్తాడ్, ఆగస్టు 2 : కాళేశ్వరం జలాలు జిల్లాను ముద్దాడాయి. ‘కర్షకులు కన్నీళ్లను దిగమింగేలా చేసేందుకు, నేనున్నా….ఎవరేమన్నా.. నన్ను వద్దనుకున్నా మీదగ్గరకు వస్తూనే ఉంటా, మీకష్టాల సాగుకు సహకరిస్తూనే ఉంటా..’ అంటూ మరోమారు కాళేశ్వ రం జలాలు జిల్లాకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం 7గంటలకు జిల్లా సరిహద్దులోని కమ్మర్పల్లి మండలం నాగాపూర్ శివారులోని క్రాస్‌రెగ్యులేటర్ గేట్లను అధికారులు ఎత్తడంతో కాళేశ్వరం జలాలు జిల్లాలోకి ప్రవేశించాయి. వరదకాలువ 73వ కిలోమీటర్ రాంపూర్ పంప్‌హౌస్ వద్ద నాలుగు మోటర్లను ఆన్‌చేసి నాలుగు పంపుల ద్వారా వరదకాలువలోకి నీటిని విడుదల చేశారు. దీంతో ఉదయం వరకు 34 కిలోమీటర్లు ప్రయాణించి రాజేశ్వర్‌రావుపేట్ పంప్‌హౌస్‌కు కాళేశ్వరం జలాలు చేరకున్నాయి.
రాజేశ్వర్‌రావుపేట్ పంప్‌హౌస్ వరకు చేరుకున్న నీటిని అక్కడ ఉన్న గేట్లను మొదట అధికారులు ఎత్తివేశారు. దీంతో జలాలు జిల్లా సరిహద్దులోని నాగాపూర్ క్రాస్‌రెగ్యులేటర్ వరకు చేరుకోవడంతో అధికారులు అక్కడ ఉన్న గేట్లను ఎత్తివేశారు. 10గంటలకు రాజేశ్వర్‌రావుపేట్ పంప్‌హౌస్ వద్ద పంపింగ్ ప్రక్రియ ప్రారంభించారు. మొదట ఒకపంప్ ద్వారా 1,450 క్యూసెక్కు లు, 11.51 గంటలకు రెండో పంప్‌ను ఆన్‌చేసి మరో 1,450 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారు. మ ధ్యాహ్నం ఒంటిగంటకు మూడో పంప్‌ను ప్రారంభించి మరో 1,450 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు. ప్రస్తుతం మూడు పంపుల ద్వారా 4,350 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. మొత్తం 4,350 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండడంతో సోమవారం ముప్కాల్ జీరోపాయింట్ వరకు నీరు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. .
మోర్తాడ్, ఆగస్టు 2: కమ్మర్పల్లి-మోర్తాడ్ సరిహద్దులోని తిమ్మాపూర్ బైపాస్‌రోడ్డు సమీపంలో వరదకాలువ బ్రిడ్జి వద్ద రివర్స్‌పంపింగ్ ద్వారా నీరు ఎదురెక్కి పారుతుండడంపై ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తంచేశారు.ఈ సందర్భంగా కమ్మర్పల్లి శివారులో వరదకాలువపై తెలంగాణ తొలిసీఎం కేసీఆర్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు కమ్మర్పల్లి, మోర్తాడ్, వేల్పూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, రైతులు క్షీరాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలియజేశారు. కాళేశ్వరం జలాలపై పూలు చల్లిస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ..ఈప్రాంత ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్‌రెడ్డి ఇక్కడి రైతాంగ బాధలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగానే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అధికారులతో సర్వే చేయించి రివర్స్ పంపింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చారని తెలిపారు. దీంతో ఏడాది పొడుగునా వరదకాలువ నిండుగా ఉన్నదని, బాల్కొండ నియోజకవర్గంతో పాటు మెట్పల్లి, వేములవాడ, జగిత్యాల పరిధిలోని రైతులు లిఫ్ట్ మోటర్లు పెట్టుకుని యాసంగి, వానకాలం పంటలకు పుష్కలంగా నీరు వినియోగించుకున్నారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం కూలిపోయింది, మోటర్లు కాలిపోయాయి అంటూ రివర్స్‌పంపింగ్ చేయకుండా వరదకాలువను ఎండబెట్టారని, రెండున్నరేండ్లుగా ఆ పార్టీ నాయకులు చేసిన దుష్ప్రచారానికి ఇవాళ వరదకాలువలో పారుతున్న ఈ నీళ్లే చెంపపెట్టు అని పేర్కొన్నారు. తూములను వెంటనే తెరిచి, ఆయకట్టు గ్రామాల చెరువులను తక్షణమే నింపాలని డిమాండ్ చేశారు. పీఏసీఎస్ చైర్మన్ బద్దం అశోక్, యాల్లహన్మంత్రెడ్డి, కమ్మర్పల్లి మాజీ సర్పంచ్ గడ్డంస్వామి, మాజీ ఎంపీటీసీ ఎనుగందుల అశోక్, సంతనడ్పిరాజేశ్వర్, బద్దం రాజేశ్వర్, ప్రభుదాస్, దొన్కల్ గంగారెడ్డి, పిప్పెర అనిల్, అవారి మురళి, రఘు, మహేందర్, రైతులు పాల్గొన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు చాలా తక్కువగా ఉంటాయని తెలియడంతో రైతులు ఆందోళన చెందారు. వానకాలం పంటలసాగుపై సందిగ్ధం నెలకొన్నది. దేవుడిపై భారం వేసి రైతులు పంటల సాగు సిద్ధమై వరి, పసుపు, మక్కజొన్న పంటలు వేశారు. కానీ నెలన్నర రోజులపాటు వర్షాల జాడ లేకపోవడంతో పంటలు దక్కకుండా పోతాయనుకున్న పరిస్థితుల్లో మూడునాలుగు రోజులుగా వర్షాలు కురవడంతో ఊపిరినిచ్చినట్లయ్యింది.
మరోవైపు ఎస్సారెస్పీలోకి భారీగా వరద రావడం రైతుల్లో ఆశలను చిగురింపజేసింది. వర్షాలు లేని సందర్భంలో వరదకాలువకు నీటిని ఎత్తిపోయాలని ఒకవైపు రైతులు కోరారు. మరోవైపు ఎస్సారెస్పీలో ఉన్న 15 టీఎంసీల నుంచి 0.50టీఎంసీల నీటిని వరదకాలువకు విడుదల చేయాలని, మరో 3.5టీఎంసీల నీటిని వివిధ కాలువకు విడుదల చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అయినా రైతుల గురించి ఎవరూ పట్టించుకోలేదు. వరదకాలువలోకి నీళ్లు ఎత్తిపోయకుంటే మరింత చెడ్డపేరు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైతేనేమి వరదకాలువకు కాళేశ్వరం జలాలను ఎత్తిపోయడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. తమ పంటలకు ఇక ఢోకా లేదన్న ధీమాను రైతులు వ్యక్తం చేస్తున్నారు.