హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ‘299:512 టీఎంసీల నీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ సర్కార్ సంతకం పెట్టిందని సీఎం, మంత్రి చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలు. తాత్కాలిక, శాశ్వత ఒప్పందానికి తేడా తెలియని అజ్ఞానుల నోటి నుంచి ఇలాంటి మాటలే వస్తాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 299 టీఎంసీలకు ఒప్పుకున్నట్టు నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం.. మరి మంత్రి ఉత్తమ్‌కుమార్ అందుకు సిద్ధమా?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిది ఒక మాట, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిది మరో మాట అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూన్ 6న కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలకు ఎన్వోసీ ఇచ్చి ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండంటూ చంద్రబాబుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మళ్ల్లీ ఆయనే సెప్టెంబర్ 13న నీటి పారుదల శాఖపై నిర్వహించిన సమీక్షలో 904 టీఎంసీల వాటా సాధించి తీరుతామని బీరాలు పలికారు. మరోవైపు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొన్న 763 టీఎంసీలు డిమాండ్ చేసినం అని గొప్పలు చెప్పారు’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. బేసిన్లు తెలియని, నీళ్ల వాటా గురించి నీళ్లు నమిలే, తెలంగాణ సోయిలేని ముఖ్యమంత్రి, మంత్రి ఉండటం తెలంగాణ దౌర్భాగ్యామని చురకలేశారు. పూటకో మాట, ఘడియకో లెక్క చెప్తూ రాష్ట్ర పరువు తీస్తున్నారని బుధవారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్సేనని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుకు భయపడి బనకచర్లపై, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని ఆల్మట్ట్టి ఎత్తుపై మౌనం వహిస్తూ చారిత్రాక ద్రోహం చేస్తున్నదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, మంత్రి అజ్ఞానంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. నీటి హక్కులపై సీఎం చెప్పింది కరెక్టా? నీళ్ల మంత్రి చెప్పింది కరెక్టా? అని ప్రశ్నించారు. ‘కనీస అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడుతరు? ఎంతకాలం ప్రిపరేషన్ లేకుండా ఉంట రు’ అని చురకలంటించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జలాల్లో 763 టీఎంసీల వాటా కోసం అలుపెరగని పోరా టం చేశారని హరీశ్‌రావు ఉద్ఘాటించారు. 763 టీఎంసీల వాటా అంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్సే కొత్తగా తెరపైకి తెచ్చినట్టు మంత్రి ఉత్తమ్ డబ్బా కొట్టుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. తెలంగాణకు కృష్ణా నీటి వాటాలో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ నేతలేనని, 299:512 టీఎంసీల వాటాకు ఒప్పుకొని ఇప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 299:512 నీటి వాటాను బీఆర్ఎస్ సర్కారు పదేండ్లపాటు లిఖితపూర్వకంగా ఏపీకి రాసిచ్చిందని, చారిత్రక తప్పిదాన్ని సరిచేస్తున్నామని చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. తాత్కాలిక, శాశ్వత ఒప్పందానికి తేడా తెలియని అజ్ఞానుల నోటినుంచి ఇలాంటి మా టలే వస్తాయని ఎద్దేవా చేశారు. 299:512 టీఎంసీల వాటాకు ఒప్పుకున్నది ముమ్మాటికీ కాంగ్రెస్సేనని తేల్చిచెప్పారు. 2013 అక్టోబర్ 18వ తేదీన ఉమ్మడి ఏపీ సర్కార్ శ్రీకృష్ణ కమిటీకి నివేదించిందని, ఇదే రిపోర్టును అప్పటి అసెంబ్లీలోనూ పెట్టిందని గుర్తుచేశారు.
తెలంగాణ నీటి హక్కులకు మరణశాసం రాసింది కాంగ్రెస్సే.. మీ చేతగానితనం.. అడుగులకు మడుగులొత్తే విధానంతోనే ఈ దుస్థితి దాపురించిందని నిప్పులు చెరిగారు.అడ్హాక్, ఫైనల్ అవార్డుకు తేడా తెలియని వారు మన ముఖ్యమంత్రి, మంత్రిగా ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. 2015 జూన్ 26న చేసుకున్న అగ్రిమెంట్ తాత్కాలిక ఒప్పందం అని స్పష్టంగా లేఖలో ఉన్నదని, దీనిపై ఇప్పుడున్న మీ నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ కూడా సంతకం పెట్టారని చెప్పారు. కానీ ఉత్తమ్‌కుమార్ మాత్రం బీఆర్ఎస్పై నెపం నెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తెలంగాణ సిద్ధించిన తొలినాళ్లలోనే 2014 జూలై 14న కృష్ణాలో 299 టీఎంసీల వాటా అన్యాయని కేంద్రానికి లేఖ రాశామని ప్రస్తావించారు. రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఆనాటి కాంగ్రెస్ అన్యాయం చేసిందని, కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీటి లెక్కలు తేల్చాలని కేంద్రానికి విన్నవించామని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలపై మాకున్న చిత్తశుద్ధి, నిబద్ధతకు, నిజమైన ప్రేమకు ఇదే నిదర్శనమని పునరుద్ఘాటించారు. 299 టీఎంసీలకు తమ ప్రభుత్వం ఒప్పుకుంటే సెక్షన్-3 కోసం ఎందుకు అడిగామని ప్రశ్నించారు. రెండో అపెక్స్ కౌన్సిల్లో అప్పటి కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర షెకావత్ సూచన మేరకే సుప్రీంలో కేసును వా పస్ తీసుకొని సెక్షన్-3ని సాధించామని చెప్పారు. ‘299 టీఎంసీల వాటాకు శాశ్వత ఒప్పందం చేసుకుంటే సెక్షన్-3 ఎందుకు అడి గాం? అపెక్స్ కౌన్సిల్‌కు ఎందుకు పోయాం? సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు ఎక్కినం? అని ప్రశ్నించారు. సెక్షన్-3పై సుప్రీంకోర్టులో వాదనలు ముగింపు దశలో ఉన్న తరుణంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తీర్పును ప్రభావితం చేయవా? అని నిలదీశారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు ఆల్మట్టి ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణశాసనం రాస్తుంటే మన ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీ, బిహార్‌లకు చక్కర్లు కొడుతూ చోద్యం చూస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. డ్యాం ఎత్తును 519 మీటర్ల నుంచి 524 అడుగులకు పెంచాలని కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. ‘కేవలం 100 టీఎంసీల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడంలేదు.
‘బీఆర్ఎస్ సర్కార్ తాత్కాలిక ఒప్పందంపై సంతకంపెడితే బద్నాం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ 2025 ఫిబ్రవరి 17న చేసుకున్నది ఏం ఒప్పందం? తాత్కాలికం కాదా? అందులో ఫైనల్ అవార్డు వచ్చేదాకా 50:50 ఒప్పుకోవాలని మీరు అడగలేదా? మీ సెక్రటరీ లేఖ రాయలేదా? దీనికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారు?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పెద్దలు ప్రజలను తప్పుదోవపట్టించే కుయుక్తులు మానుకోవాలని హితవు పలికారు.
బీఆర్ఎస్ హయాంలో పూర్తిచేసిన సమ్మక్క సారక్క సాగర్‌పై కాంగ్రెస్ డబ్బాకొట్టుకోవడం విడ్డూరంగా ఉన్నదని హరీశ్‌రావు విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌తో కేవలం 50 ఎకరాల మంపు ప్రాంతం విషయంలో సూత్రప్రాయ అంగీకారం కుదిరితే గొప్ప లు చెప్పుకోవడం మంత్రి ఉత్తమ్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఏదో సాధించినట్టు.. తెలంగాణకు ఏదో ఉద్ధరించినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సవరించి, దేవాదులను పటిష్టం చేసే లక్ష్యంతో ఆనాడు కేసీఆర్ 7 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సారలక్క బరాజ్‌ను నిర్మించారని గుర్తుచేశారు. 88 మీటర్లకు డీపీఆర్ పంపినం..
అన్నీ డైరెక్టరేట్ల నుంచి అనుమతులు సాధించినం.. బరాజ్ కట్టినం.. ఇప్పుడు నీటిని కూడా ఎత్తిపోసుకుంటున్నం’ అని వివరించారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తరువాత ప్రాజెక్ట్ ఓ అండ్ ఎం డబ్బులు ఇవ్వక, దేవాదులకు నీళ్లు లిఫ్ట్ చేయకుంటే నిలదీసింది బీఆర్ఎస్సేననే విషయాన్ని మరువొద్దని హితవు పలికారు. ప్రాజెక్టుల అనుమతులను ఆపడంలో ఆరితేరిన కాంగ్రెస్ సమ్మక్క బరాజ్ విషయంలోనూ అదే చేసిందని నిప్పులు చెరిగారు. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ సర్కారుపై ఇక్కడి నాయకులు ఒత్తిడి తెచ్చి ఎన్వోసీ రాకుండా చేశారని ఆరోపించారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంతో దోస్తీ కట్టి 50 ఎకరాలకు సూత్రప్రాయ ఒప్పందం తెచ్చి, మొత్తం ప్రాజెక్టే కట్టినట్టు బిల్డప్ ఇవ్వడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు.