హైదరాబాద్: తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ (KCR) తెలంగాణే తన ప్రాణంగా భావించారని, ఎవరికి కష్టం వచ్చినా ఊరుకోలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాత్రం ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. తెలంగాణ (Telangana) రైతులు అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్నచూపని విమర్శించారు. ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జడ్పీ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుంది. జహీరాబాద్ నియోజకవర్గంలో పెద్దఎత్తున ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకుంటాం. తెలంగాణ ప్రజలను మోసగించడంలో, దోచుకోవడంలో కాంగ్రెస్-బీజేపీ రెండు దొందూ దొందే. ఒక పార్టీది మోస చరిత్ర, మరొక పార్టీది ద్రోహ చరిత్ర. చోటా భాయ్, బడే భాయ్ ఇద్దరిదీ ఒకే తీరు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులే , తెలంగాణ పాలిట శకునిలే.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా. 8 మంది ఎంపీలను గెలిపించారన్న కృతజ్ఞత కూడా బీజేపీకి లేదు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలే కేంద్రానికి ప్రాధాన్యం. ఓటు రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతోంది. ఆనాడు దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది?. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, పేదలందరికీ ఇండ్లు, బుల్లెట్ రైళ్లు వంటి హామీలు ఏమయ్యాయి?. రూ.350 ఉన్న సిలిండర్‌ను రూ.1,200, రూ.65 ఉన్న పెట్రోల్‌ను రూ.100 దాటించారు.
2017 నుంచి కొత్తగా జీఎస్టీ తెచ్చి పప్పు, ఉప్పు, సబ్బు, నూనె, షర్ట్, ప్యాంట్, టీవీ, సైకిల్, మోటార్, కారు.. ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది మీ బీజేపీ ప్రభుత్వమే కదా?. పెంచింది మీరే.. తగ్గించినట్లు డ్రామాలు ఆడుతున్నది మీరే. ఎన్నికలు రాగానే చారానా తగ్గించుడు, ఎన్నికలు అయిపోగానే రూపాయి పెంచుడు, ప్రజలను ప్లాన్డ్గా మోసం చేస్తున్నారు.
తెలంగాణకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష. కేసీఆర్ తెలంగాణే తన ప్రాణంగా భావించారు. ఎవరికి కష్టం వచ్చినా ఊరుకోలేదు. కాని రేవంత్ రెడ్డి మాత్రం నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతున్నాడు. యూరియా కోసం ఏనాడైనా ఇంత తిప్పలు పడ్డామా?. యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా లేదా?. తెలంగాణ రైతులంటే రాష్ట్ర, కేంద్రా ప్రభుత్వాలకి చిన్న చూపు. ఆరుగాలం కష్టపడే రైతు పట్ల ఎందుకు అంత వివక్ష?. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఎన్నికల కోసం కష్టపడి పని చేసి మరింత మంచి ఫలితాలు రాబట్టేందుకు కృషి చేయాలి. కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలి.’ అని హరీశ్ రావు అన్నారు.